అరిచి, అరిచి భర్త మంచం దగ్గర కూలబడింది పార్వతి.
పట్టాభి విసురుగా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. మేడపై తన గదిలోకి వెళ్ళి పడుకుని తీవ్రంగా ఆలోచించసాగాడు.
భార్య తలనిమిరాడు శాస్త్రిగారు.
"పార్వతీ!" అనునయంగా అనురాగపూరితంగా పిలిచారు. ఆ ఒక్క పిలుపుతోనే ఆయన మనస్సు అవగతమైందామెకి. ఆ ఒక మాటతోనే ప్రశాంతి దొరికింది.
"ఎంత పాపిష్టిదాన్నండీ? నేను వాడిని తిట్టిపోశాను. అంత తిట్టినా వాడు నోరెత్తలేదు. ఆఖరికి చావమని శపించానండీ!"
"తల్లిగా అంత మాట అనగూడదు పార్వతీ! అయితే ఆవేశంతో నోరు జారావు."
మెల్లగా ఏడ్వ సాగిందామె.
"పార్వతీ వూరుకో!"
"ఈ విషయాలు స్వాతి వినలేదు కదా. శ్రీవిద్య ఆమె నిద్రపోతున్నారు కదా!" మెల్లిగా అడిగారు.
కళ్ళు తుడుచుకుంటూనే వినలేదన్నట్లు తల వూపింది.
"అయినా, ఒకసారి వెళ్ళి చూసిరా"
పార్వతి కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళింది. శ్రీవిద్య, స్వాతి గాఢంగా నిద్రపోతున్నారు. బరువుగా నిట్టూర్చి సంతృప్తితో తిరిగి వచ్చి భర్తతో చెప్పిందామె.
సరిగా ఆ సమయంలోనే గేటు చప్పుడయింది.
తాలూకాఫీసులో పదిగంటలు కొట్టారు.
* * * *
"ఎవరూ?"
శాస్త్రిగారి పిలుపుకి సమాధానంగా "నేను బాబాయ్! విస్వనాధాన్ని" అంటూ వచ్చాడు విశ్వనాధం.
అతని వెనుక జానకిరాం, ఆ వెనుక జ్యోతి, జ్యోతితో పాటు అయోధ్య అహల్య కూడా వచ్చారు. వాళ్ళంతా వచ్చిన కొద్దిసేపటికి సైకిల్ పై వచ్చాడు దాశరధి.
వాళ్ళందర్ని చూడగానే శాస్త్రిగారికి వాళ్ళెంత తొందర పడుతున్నారో అర్ధమైంది. ఆయన మనస్సు భగ్గుమంది. అయినా ఏమీ అనలేదు.
విశ్వనాధానికి కుర్చీ తెచ్చి వేసింది పార్వతి.
అతను కూర్చున్నాక మెట్ల మీద కూర్చున్నాడు జానకిరాం. జ్యోతి నిలుచునే వుంది_మందారం చెట్టు క్రింద అరుగుమీద కూర్చొన్నాడు అయోధ్య, అతని సరసనే కూర్చుంది అహల్య. వెన్నెల మసక మసగ్గా వుంది. ఆకుల మధ్య నుంచి వెన్నెల చీలి ముక్కలు ముక్కలుగా పడుతోంది వాళ్ళిద్దరి రదా _ _ _ __ __
"మీరు రేపు రాత్రికిరమ్మన్నామీట" __ __
"ప్రేమగా తొందరగా, వచ్చేశారు నాయినా మీరు" పార్వతి అక్కసుగా అనేసింది.
"అది కాదమ్మా! రేపు సాయంకాలం జానకిరాం హైదరాబాద్ వెళ్ళాలిట. అందుకని శ్రీవిద్య వచ్చి చెప్పగానే వీళ్ళకి చెప్పి పంపాను. ఆ మాట వింటూనే బయలుదేరి వచ్చారు. ఎందుకయినా మంచిది కదాని దాశరధి కోసం మనిషిని పంపాను. అతను వుంటే బావుంటుందని అనుకున్నాము__"
"పార్వతీ! పైన పట్టాభి పడుకుని వుంటాడు పిలువు"
ఉక్రోషంగా "పట్టాభి!" అని కేకేసిందామె. ఆమె గొంతు బొంగురు బోయింది. అప్పుడప్పుడే నిద్రపడుతున్న పట్టాభి ఆ పిలుపు విని భయపడి దిగివచ్చేశాడు.
క్రిందకి వచ్చి వీళ్ళందర్నీ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత రాత్రి వేళ భార్యలతో సహా యిలా ఎందుకొచ్చారా? అనుకున్నాడు.
అతను రాగానే విశ్వనాధం ప్రారంభించాడు.
"బాబాయ్! ఇవన్ని వుమ్మడి కుటుంబాలు పూర్వం ఆ కాలం వాళ్ళకి తల్లి, తండ్రి, అన్నా, దమ్ముడు, చెల్లి, ఆడబిడ్డా అనే అభిమానాలుండేవి. ప్రేమలూ వుండేవి. వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. వివాహ వ్యవస్థ గీచిన గిరిలో బాగా తిరిగి సుఖపడ్డారు.
"కాలం మారింది. వున్న వూరు విడిచి దేశం తిరగటం నేర్చుకున్నారు. మానవుడి రుచి, అభిరుచి మారిపోయింది. ఉమ్మడి కుటుంబం కంటే విభక్త కుటుంబంలోనే సుఖ పడటం ప్రారంభించాడు. అది మన వర్ణ వ్యవస్థ, వివాహ వ్యవస్థలలో వున్న లోపం. భార్యాభర్తలకి ఏకాంత సుఖం చాలా దుర్లభం కావటంతో విడివడి సుఖ పడటం నేర్చుకున్నారు.
"దీనికి ఎవరు ఎవర్ని తప్పుపట్టకూడదు. ఎందుకంటే ఒకనాడు ప్రతివాడూ ఆ సుఖాన్ని కోరుకున్నవాడే! ప్రతివాడూ వేరుపడాలని ఆశ పడ్డవాడే!"
"ఏది ఏమైనా మీ కుమారులు ఇద్దరూ వేరుపడ్డారు. ఎవరి కుటుంబాలవారు, ఎవరి కష్టసుఖాలు వాళ్ళవీ అయ్యాయి.
"ఈ స్థితిలో పితృ పితామహ సంపాదితమయిన స్థిర చరాస్థులు వాళ్ళకీ దక్కాలనుకోవటం సహజం. వాళ్ళు వెళ్ళిపోతే మరొకరు వుండి అనుభవించటం అన్యాయం అనిపిస్తుంది సహజంగా...
"అందుకే వాళ్ళు వాటా కోరుకుంటున్నారు. వాళ్ళు వాటా రావాలనుకోవటం న్యాయం, ధర్మం... చట్టసమ్మతం... మనం కాదంటే న్యాయస్థానాలున్నాయి. అడ్డగలమా?"
విశ్వనాధం ఉపన్యాసంలాగా చెప్పాడు.
"బాగా చెప్పావురా విశ్వం. అందుకేనేమో పట్టాభిని కేకేశాను. మొత్తం ఎనిమిదిమందిలో నలుగురొచ్చారు. శ్రీవిద్యని పిలుస్తాను. కోదండం భార్య స్వాతిని పిలిపిస్తాను. మరి సీతారాంలేడు, కోసలరాం హైద్రాబాద్ వెళ్ళాడు ఎలా?"
"ఫరవాలేదు. మెజారిటీ వాళ్ళున్నారు. అడ్వకేట్ ని నేనున్నాను. మనం చట్టసమ్మతంగా ఏదయినా చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేద్దాం. ఫరవాలేదు."
"ఇంతకీ విషయమేమిటిరా విశ్వం?" అంతవరకూ అర్ధంకాని దాశరధి అడిగాడు.
"ఏముందిరా ఈ ఇంట్లో భాగం కావాలిట వీళ్ళకి."
"అవునా జానకిరాం?" విస్మయంగా అడిగాడు తను.
"అవును" ధృడంగా అన్నాడతడు.
"జానకిరాం, ఇది ధర్మంకాదురా. మనం సుఖంగా సంపాదించుకుంటున్నాం, హాయిగా వున్నాం. ఇప్పుడీ ఇల్లుతో ఏమవుతుంది? ఈ ఇల్లుని పంచుకుని ఎలా ఉంటార్రా మీరు" తమ్ముళ్ళ ఆంతర్యాలు అర్ధమౌతున్న కొద్దీ దాశరధికి బాధగా వుంది.
"మాకీ ఇల్లు అక్కర్లేదు. దామాషాగా డబ్బు ఇస్తే చాలు" అంది జ్యోతి.
"ఎవరివ్వాలి?"
"ఎవరింట్లో వుంటే వాళ్ళే ఇవ్వాలి? అంతే! అందులో ఆలోచన ఏముంది?" తేలిగ్గా అనేసింది.
"జ్యోతి! ఇది అన్యాయం. ఇందులో అమ్మా నాన్నా వున్నారు, పట్టాభి వున్నాడు. కోసలరాం వెళ్ళిపోయాడు. సీతారాం ఏనాడూ ఇంట్లోలేడు. ఎవరిస్తారు డబ్బు?"
"మీరే చెప్పారుగా, అమ్మా నాన్నా వున్నారని వాళ్ళే యిస్తారు."
