ఉలిక్కిపడ్డాడు రామదాసు!
"నవ్వేను తప్పయితే మన్నించండి దాసుగారూ! ఎందుకు నవ్వేనో కారణం చెబుతాను; వినండి. ఒక మనిషి పచ్చటి బతుకు మీద నిప్పులు పోసిన మరో మనిషి దేసమ్మీద పడి మనుషుల్ను ఉద్దరించే వ్యాపారం కొన్నేళ్ళుగా చేస్తున్నాడంటే, నవ్వు వచ్చి నవ్వేను. ఇన్నేళ్ళూ అతనెందరి మనుషుల్ని 'బాగు' చేసి వుంటాడో అంచనా వేసి ఆ మనుషుల బతుకులమీద జాలి పడ్డాను. 'నన్ను క్షమించు సీతా!' అని నన్నడిగినట్టే మీరెంతమంది ముందు తలొంచి నిలబడి క్షమించండని ప్రాధేయపడ్డారో లిస్టు రాసుకున్నారా? క్షమాపణలు చెప్పుకోడానికి మీకీ జీవిత కాలం సరిపోతుందా? ఇవన్నీ అటుంచి, వచ్చి నెత్తురు తాగే సింహం అకస్మాత్తుగా గడ్డి తినే సాధు వయ్యిందంటే నమ్మేదెలా, ఈ మార్పులో ఆంతర్యమేమిటి?" ఖచ్చితంగా అడిగింది సీత.
"సీతా!" అన్నాడాయన భయంగా.
"నిజమే చెప్పండి. అంతా నిజమే చెప్పండి. ఇంక నా జీవితంలో తిరిగి చూడలేననుకున్న మనిషి తనంతట తానే వచ్చి తాను చేసిన దుర్మార్గాన్ని మన్నించమని ప్రాధేయపడుతూంటే నేను సుళువుగా నమ్మగలనా? అందుచేత, ఈ మార్పుకి కారణమేమిటో ముందు చెప్పండి."
"నిజమే సీతా! నువ్వన్నది నిజం. నేనిప్పుడేం చెప్పినా నువ్వు సుళువుగా నమ్మలేవు. నా పాప పరిహారార్థం గుళ్లూ గోపురాలు కట్టించే స్తోమత మాకుంటే వుండొచ్చుగాని, గుళ్ళో దేవుణ్ణి చూసే జనం గుండెల్ని చేతుల్లో పట్టుకు మరీ చూస్తారు నువ్వన్నట్టు. ఈ సింహం గడ్డి తినడమే శరణ్యమనుకుంది. ఒక మహా సాధ్వికి అన్యాయం చేయడంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ రాజకీయ జీవితం నన్ను మరింత కిరాతకుణ్ణి చేసింది. చిన్న సింహాసనం సంపాయించేను. నీకు చేసిన కీడు మరిచేను. పెద్ద సింహాసనాల వేటలో పడి నువ్వెక్కడ ఎలా బతుకుతున్నావో తెలుసుకోలేకపోయాను. వారం రోజుల క్రితం నా వారసులు చేసిన ఘాతుకం, ఇన్నేళ్లూ నిర్లక్ష్యం చేసిన నా అంతరాత్మమీద దెబ్బ తీసింది. రాజకీయాలకి అంతరాత్మ లేవిఁటని నన్ను తక్కువ చేయకు. నువ్వు నమ్మూ నమ్మకపో! నేనిప్పుడు అంతరాత్మకి బానిసను సీతా_బానిసను. అందుకే నువ్వు గుర్తుకొచ్చేవు. నా వంశమంతా కిరాతకులమై పోతామనే భయం నాకు నా అంతరాత్మ కలిగించింది. నా వంశం చెడిపోగూడదు. అవసరమైతే రాజకీయాల్నే వదిలేస్తానుగాని, నా వంశం చెడిపోవడం సహించలేను, ఈ చెడు నాతోనే ఆగిపోవాలి. నన్ను నమ్ము. వచ్చేయ్. నాతోపాటు నా యింటికి వచ్చి, నా ప్రక్కనుండు. నువ్వు నా పక్కనుంటే...."
మధ్యలోనే మళ్ళా నవ్వేసింది సీత.
"సిగ్గు. సిగ్గు. ఇన్నేళ్లు వొచ్చి మీకు నేను భార్యనా? తగుదునమ్మంటూ ఇవాళ నేను మీ యింటికి రావాలా? వద్దండీ దాసుగారు వెళ్ళిపోండి మమ్మల్నిలా బతకనివ్వండి. ఈ సీత కష్టాలు మీవల్ల ముగింపుకొస్తే నా ఆశయానికీ, నా ఆనందానికి అర్థం వుండదు. ప్రసాదున్నాడు. నా వరాల తండ్రి వాడున్నాడు. నాకు వాడు వాడికి నేనుగా వున్నామిక్కడ. మా కష్టాల్ని మా ప్రయోజకత్వమే ఆదుకోవాలిగాని, మీలాంటివాళ్ళ ఔదార్యంకాదు కానేకాదు. వెళ్ళిరండి. మరో మాట దాసుగారూ! నేనివాళ మీకు నా కథ చెప్పుకున్నాను. ఎందుకో తెలుసా? బహుశ గ్రహించి వుండరు. ఆ కథలో నా దీక్ష వుంది. నన్ను మోసగించి వెళ్ళిపోయిన మీకు ఆ దీక్ష ఎంత పవిత్రమైందో, ఎంత విలువైందో చెప్పి తీరాలనే కసికొద్దీ ఇంత కథా చెప్పాను. అంతేగాని మీ ఆదరణని ఆశించి కాదు. నన్నేమనుకుంటున్నారు? కేవలం ఆడ సీతననుకుంటున్నారా? కాదండి బాబు నేను ఆడ సీతను కాను. మగవేషంలో కాలం గడుపుతూన్న సీతన్నేను. అంతే చెప్పగలను. నేనేం చెప్పిందీ ప్రసాదుకు తెలీకూడదు. వాడిని అతి భద్రంగా పెంచేను. వాడికి మన పాడు కథ తెలిస్తే ఫలితమేమిటో మీకు అర్థంకాదు కనుక, వాడికి తెలీకుండా జాగ్రత్త తీసుకోండి. మన నీచ చరిత్ర మూడో మనిషికి తెలీకూడదు. ఎదుటి మనిషికి మేలు చేయాలనే మీనీతి పాఠం. ఈ మేలుతోనే ప్రారంభం కానివ్వండి, వెళ్ళండింక...చూడండి. మనం మళ్లా కలుసుకుందాం. మన అక్రమ సంబంధానికి మరోసారి పలుకరించుకోడం ఎంతైనా అవసరం! అదెప్పుడో తెలుసా దాసుగారూ... ఇంతలో కాదు. నా చివరిక్షణాల్లోనో, మీ చివరి క్షణాల్లోనో తప్పించి అంతకంటే ముందు మనం మళ్లా కలుసుకోకూడదు. మన మొహాలు చూసుకోకూడదు. అప్పుడే కలుసుకుందాం. అప్పటివరకూ మీ గూడు రాజకీయమే! సెలవు!"
"సీతా!" అన్నాడాయన బాధగా!
"నా కథ చెప్పేను. నా నిర్ణయం చెప్పేను. ఇంకా ఆలస్యం తగదు, వచ్చే జన్మకి మీరు నేనై, నేను మీరై ఇదే దొంగాట ఆడుకుందాం. అదే మీకు తగిన శిక్ష! సరేనా? వెళ్ళండయితే."
రామదాసు లేచి నిలబడ్డారు. బరువుగా అక్కడ్నుంచి కదిలేరు! సీత యింక గాలి పీల్చుకుంది.
12
రామదాసు తిమ్మాపురం వచ్చిన్నాడే, గుండెపోటు రావడం వల్ల మంచమెక్కేరు. ఈ పోటు ప్రాణాన్ని క్షణంలో తీసుకుపోతే బావుండుననిపించింది వారికి. అలాగాకుండా మనిషిని వుండీ వుడిగీ తింటోందాపోటు!
ఇంట్లోవున్న వెంకటస్వామిగ్గాని, వంటలక్కకిగాని వారు తమ గుండెపోటు విషయం చెప్పలేదు.
కాని____
చిరంజీవి మైసూరు మహాసభలకి హాజరైనట్టు వెంకటస్వామీ, వంటలక్కా రామదాసుకి చెప్పేరు.
"అంటే, వీడు ఈ సంవాత్సరం పరీక్షలు రాయడం?" అని అడిగేరాయన.
