శ్రీ లక్ష్మీనారాయణమూర్తి, శ్రీపాద
చైతన్యము
దీవించి సమరధాత్రికి పంపుదువుగాని
కడుపుచల్లగ పుత్త్రు గన్నతల్లి!
ఆనందముగ మనోహరు నంపుదువుగాని
విమతుల బోద్రోల వీరపత్ని!
అలనాటి సత్యను దలపించెదవుగాని
రావమ్మ ముందుకు యౌవనాంగి!
జయహారతులు పాడి సాగనంపుదు గాని
నీ యన్నలను భారతీయ బాల!
దేశ గౌరవ స్వాతంత్ర్య దివ్యకీర్తి
సుప్రతిష్ఠలు కాపాడ; సుహృదులట్లు
చూచుకొన్న చైనీయులే దోచుకొనగ
బూని దండెత్తినారు నీ భూమిమీద.
కష్టించి పనిచేసి గడియించి పొదుపు చే
సిన పవిత్రంబైన ధన మొకింత
తర తరమ్ములనుండి తనువున దాల్చుచు
మురిసిపోయెడి స్వర్ణభూషణముల
హుండీలు గ్రహియించి ఊరూరు నింటింట
తిరిగి వేడుకతోడ తెచ్చు సొమ్ము
ఎప్పుడో అనుటకై యిప్పుడే దాచిన
ఆహారధాన్యాలయం దొకింత
దేశమాతకు కాన్కగా తీసియిండు
ఆయుధ బలమ్ముతోడ సంఖ్యాబలమ్ము
కూడ గలిగిన రిపులతో ఘోర సమర
సీమ నిలిచినా భారతసేన కొరకు.
అద్వైత దృష్టితో నఖిలమ్ము వీక్షించు
తత్వమ్ముగల ఆర్ష ధాత్రి మనది
గౌతమాశోకులు గాంధీ మహాత్ముండు
గరపిన శాంతిమార్గంబు మనది
పగవారలను బాధపడనీక కష్టింప
ప్రాప్తించు స్వాతంత్ర్య లక్ష్మి మనది
న్యాయసంరక్షణకై యనేకాజి రం
గంబుల నిలుచు ధైర్యంబు మనది
మాతృదాస్య విముక్తికి మహిత సంప
దలను త్యజియించి ఖైదులోపల గృశింప
సిద్ధపడు త్యాగమూర్తుల సేవ మనది
అన్ని విధముల ఘన విజయమ్ము మనది.
తనయట్లె యెల్లరు మనసు లోకులనుండి
భాషింతురన్న భావంబు మనది
స్నేహపూరిత పరిస్థితులలో చర్చించి
సామరస్యము గూర్చు సరణి మనది
ఏ కూటమికి చెంద నిచ్చగింపని సుహృ
త్తాటస్థ్యమును బూను బాట మనది
ఒక సూది మోపిన యుర్వియు నితరుల
దాశింపబోని మర్యాద మనది
యెంతో శ్రమియింపగా లభియించినట్టి
స్వేచ్చ నిల్పుకొనంగ సంసిద్ధులమయి
యెట్టి త్యాగాలనైన గావింపగలుగు
ధర్మమార్గైక దీక్షాపథంబు మనది.
మునుపు పద్మవ్యూహమున జొచ్చు నభిమన్యు
దలపించు శౌర్యము గల జవాను
ప్రాణేశ్వరిని వీడి బవరాని కేతెంచు
నా బాలచంద్రు నీడగు జవాను
గజగజ లాడించు గడ్డకట్టిన మంచు
లెక్కింపకుండ నిల్చిన జవాను
సంఖ్యాబలమ్మున్న శత్రు సైన్యాలకు
జంకక ముందుకు చను జవాను
కలరు మన సరిహద్దు రక్షణము సేయ
నచల దీక్షను బూను సైన్యమ్మునందు;
ఒక్క రొక్కరి సాహస మక్కజంబు
గొలుపు జగమెల్ల కీర్తి కాంతులు వెలుంగ.
కంఠమందలి మౌక్తికపు హారము నొసంగ
నుబలాట పడుచున్న యువతు లిరుగొ
కరకంజముల గలగలలాడు బంగారు
గాజులజత లిచ్చు కాంత లిరుగొ
పరిణయ చిహ్నంగా ధరియించు నంగుళీ
యకము లీయగవచ్చు నతివ లిరుగొ
చెక్కులపై కాంతి చిందుచు కర్ణ భూ
షణము లొసంగెడు చాన లిరుగొ
ధర్మమార్గమ్ము వీడి యుత్తరపు హద్దు
మీరి వచ్చిన రిపుసేన బారద్రోల
భావి సౌఖ్యాలు గౌరవప్రదపు బ్రతుకు
భారతీయుల కొనగూర్చు వ్రతముతోడ.
* * * *
