"అలాగే"
శేఖర్ ఆ పనిపై వెళ్ళాడు.
చౌదరి ఆలోచనల్లో పడ్డాడు.
* * * *
దాదాపు నాలుగయిదు రోజులు వూరంతా డబ్బు మయం అనిపించింది. చాలా మందికి గవర్నమెంటు డబ్బు అలా వందలకి వందలు అందటం తమ అదృష్టం అనిపించింది.
"గవర్నమెంటు ఎంత మంచిదో చూడండి, మనకి ఎన్నో మేళ్ళు చేస్తుంది. ఈసారి ఎలక్షన్లో కూడా మనం గవర్నమెంటు పార్టీ మనిషికే ఓటు వెయ్యాలి" అన్నాడు నాయుడు.
అతనికేప్పుడూ ఎలక్షను యావే! ప్రజల ఓట్లన్నీ తమ గుప్పెట్లో వుండాలని ఎప్పుడూ తహ తహలడుతూ వుంటాడు.
నాయుడు మాటలకి అంతా తలూపేరు.
డిస్ బర్స్ మెంట్ అంతా అయిపోయి అందరి సంతకాలతో రికార్డు తయారయ్యాక ఆరోజు సాయంకాలం జయన్న , సోము వచ్చారు చౌదరి దగ్గరికి.
ఇప్పుడు వాళ్ళ మధ్య మంచి స్నేహమే వుంది. జయన్న, సోము చౌదరిని నమ్మేరు. అతన్లో మార్పు వచ్చిందని కూడా నమ్మేరు.
"ఊ ఎలా వుంది ఊరు!"
నవ్వుతో చౌదరి అడిగిన దానికి జయన్న "అంతా మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు. డబ్బు కదా! అవసరాలకి అందిందని అంతా యింతా సంతోషం కాదు!" అన్నాడు.
సోము ఏమి అనలేదు.
సోము మెల్లిగా జేబులోంచి అయిదొందలు తీసి చౌదరికి యివ్వబోయాడు.
చౌదరి ఆశ్చర్యం నటించాడు. "ఏమిటిది! ఎందుకు?"
"మీ అప్పు!"
"ఛ! ఛ! నేను మరీ అంత దుర్మార్గుడిని అనుకోకు ఏం చెప్పాను అప్పుడు? మరిచిపోయావా! నాకు డబ్బు ముఖ్యం కాదు. మనుషులు ముఖ్యం అంతే! పైగా యిది నీ భూమి చేసుకోవడానికి, అప్పు తీర్చటానికి కాదు. ఇదేరా! మనలో వుండే పాడు లక్షణం. బాగుపడమని గవర్నమెంటు డబ్బు యిస్తే దాన్ని యిలా చేస్తాం మనం. ఎక్కడుంది న్యాయం. పండించుకుని బాగుపడండ్రా అంటే యిలా తిక్క వేషాలు వేస్తారు!"
సోము ఏదో అనబోయాడు.
ఊహు ఇంకేం చెప్పొద్దు. ఈ చౌదరి మంచికి ధర్మరాజు, చెడుకి యమధర్మరాజు అంతే.
సోము జయన్న వైపు చూశాడు.
జయన్న ఏదో చెప్పబోయాడు.
"నువ్వయినా బుద్ది చెప్పు జయన్నా వీడికి?"
"మీ అప్పు తీర్చేయ్యటం ధర్మం కదండీ!"
"ఇలానా? ఇదా మార్గం ఊహు నే నొప్పుకోను. కష్టపడి పండించి ఫలసాయంలో తీర్చమను."
నిట్టూర్చాడు సోము. వాడికి యిదంతా ఓ తంతులాగా అనిపించింది. అందుకే మళ్ళీ జయన్న వైపు చూశాడు.
"ఫర్లేదులే! వుంచేయ్యి!"
చౌదరిమళ్ళీ రెట్టింటంతో వాళ్ళెం అనలేక కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు.
చౌదరి అది విజయంగా భావించి గర్వంగా నవ్వుకున్నాడు.
16
అప్పటికీ జమాబంది ముగిసి చాలా రోజులైంది. తిరిగి కొత్త ఫనల్టీ లెక్కలు వ్రాయటం మొదలు పెట్టాడు కరణం. ఆయనకి ఈ మధ్య ఆదాయం బాగా వచ్చింది. నిత్యం లక్ష్మి అమ్మవారికి పూజలు జరిపించేడు.
కో ఆపరేటివ్ బ్యాంకు లోన్సు విషయంలో ఖర్చుల్లో ఎక్కువ భాగం శేషయ్య బీరువాలోకే పోయాయి. అదిగాక చౌదరి తననీ తన తమ్ముడినీ ఆపద నుంచి కాపాడినందుకు కృతజ్ఞతగా తన భాగంగా వచ్చిందంతా యిచ్చేశాడు . ఆ విషయం ఆ యిద్దరి మధ్యే వుంది.
