Previous Page Next Page 
వారుణి పేజి 36


    నరసింహంగారు చెప్పిందంతా విని "నాన్నా" అంది వారుణి.
    ఆయన ఆ పిలుపుని గ్రహించారు. చప్పున "ఇప్పటికిప్పుడే నీ నిర్ణయాన్ని మార్చుకోమనను. ఏడాదిపాటు అతన్ని గమనించి ఏర్పరచుకున్న అభిప్రాయం క్షణంలో మారదు. మారితే నువ్వు వారుణివి కావు. నా కూతురువీ కావు. కానీ బాగా ఆలోచించుకో_" అన్నారు.
    "నాన్నగారూ!"
    ఆ పిలుపు విని కరిగిపోయారాయన. కూతురు తన నుంచి దూరమైపోయి అతనికి చేరువవుతుందని గ్రహించారు. అది ప్రకృతి నియమం. స్త్రీ పురుష లక్షణం అంతే అనుకున్నారు. వారుణీ! నువ్వు నిశ్చయించుకున్నావు సంతోషం!" అన్నారు.
    "నాన్నా! ఆయన వ్యక్తిత్వం మంచిది. ఏడాది పరిచయంలో ఏనాడూ వెకిలిగా ప్రవర్తించలేదు.ఎన్నడూ హద్దు మీరి ప్రవర్తించలేదు."
    "వారుణీ! మీ ప్రేమ కాలప్రవాహానికి నిలుస్తుందా?"
    "ప్రేమ పెళ్ళిగా మారుతుంది నాన్నా!"
    "పెళ్లయిపోగానే ప్రేమ తగ్గిపోతుందేమో."
    "లేదు నాన్నా! పెళ్ళయితే ప్రేమ వికసించాలి!"
    "దూరంగా వుండటం వేరు తల్లీ. కలిసి బ్రతకటం ప్రారంభించాక పరస్పరం లోపాలు తెలుస్తాయి. వాటిని క్షమించగల్గటం కష్టం. అప్పుడే అభిప్రాయ భేదాలు వస్తాయి. అవే కాపురాలని విడదీస్తాయి."
    "సారధి అలాంటి వ్యక్తి కాదు. నా అభిప్రాయాలని గౌరవిస్తాడు!"
    "గౌరవించకపోతే నీ అభిప్రాయాలు మార్చుకుంటావా?"
    క్షణంసేపు మాటాళ్లేదామె.
    "వారుణీ! నాకు నీ మనస్సు నీ వ్యక్తిత్వం తొలినుంచీ తెలుసు. అందుకే నీ ప్రేమని కాదనలేకపోతున్నాను అన్నా ప్రయోజనం వుండదేమో! నీ పెళ్ళిని ఆశీర్వదించాలానే నిర్ణయించుకున్నాను. అడ్డుపెట్టినా అది ఆగదు. ఇలా నాలాగా అతను నీ మనస్తత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడా? నువ్వు స్వేచ్చాజీవివి. వ్యక్తిత్వం గల మనిషివి. స్వయం నిర్ణయాలు తీసుకోగలవు. స్త్రీ పురుషులు సమానం అనే భావాలు నీలో జీర్ణించుకున్నాయి. తప్పులేనిదే తలవంచకూడదనే తత్వం నీది. పరిస్థితులతో రాజీపడలేవు నువ్వు. నిన్నలా పెంచాను నేను. నీ వ్యక్తిత్వం అలా విరిసింది. దానికి అతను ఆమోదిస్తాడా?"
    వారుణి మాటాళ్ళేదు.
    మనస్సులో సంఘర్షణ.
    పెళ్ళనేది చాలా పవిత్రమైంది. రెండు జీవితాలని శాశ్వతంగా ప్రేమతో బంధించే ముడి. ఒకసారి అడుగు వేశాక తీసుకోలేం. వెనక్కి రాలేని మార్గం అది. కష్టమో నిష్టూరమో కలసి సాగిపోవాలి! కానీ అలా అతకని సమస్యలతో చేసే సంసారం రౌరవాది నరకాల కన్నా హీనం. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు కాంట్రాక్ట్ పద్ధతిలో జీవిస్తున్నారు. ఎవరి పంథా వారిది_ విడిపోలేక, విడిపోతే సాంఘికంగా భద్రత లేక భర్తలతో వేగుతున్నారు స్త్రీలు. దానివల్ల సంతానంలో అవ్యక్త చిత్తులు, అస్థిర చిత్తులు, కౄరచిత్తులు, బలహీన మనస్కులు జన్మిస్తున్నారు. దాంతో సంఘ వ్యవస్థే కుళ్ళిపోతున్నది.
    దీనికి పరిష్కారమేమిటి?
    సరిగా లేని వివాహ వ్యవస్థా? భద్రతలేని సాంఘిక వ్యవస్థా? అన్యోన్యత వృద్ధిచేసుకోలేని దాంపత్యాలా? స్త్రీని గౌరవించలేని-పోనీ అర్థంచేసుకోలేని పురుషులా? ఎవరు దీనికి బాధ్యులు!"
    వారుణి ఆలోచిస్తోన్నది.
    "నాన్నా! ప్రేమ పెళ్ళికి, మామూలు పెళ్ళికి తేడా ఏమిటి?"
    నిట్టూర్చారు ఆయన.
    "చాలా వుందమ్మా! పెద్దలు నిర్ణయించే పెళ్ళిలో ఎంతో ఆలోచన వుంది. ఆర్షేయ పౌరుషేయాలు ఒకనాటి పద్ధతి. సంప్రదాయాలు, స్థితిగతులు యీనాటి పద్ధతి. తల్లిదండ్రుల గుణగణాలు, యోగ్యతలు, అబ్బాయి యోగ్యతలు, లక్షణాలు, జాతకాలు, ముహూర్తాలు యివన్నీ ఎన్నో చోటుచేసుకుంటాయి."
    "నాకూ సారధి కుటుంబం గురించి పూర్తిగా తెలుసు."
    నవ్వేరు ఆయన_జవాబు చెప్పలేదు.
    "కానీ సారధికి నేనంటే ప్రేమ. నా ప్రేమకోసం_ నా సంతోషం కోసం తనేమయినా చేయగలడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS