ఇహ వినలేకపోయాను. వొళ్లంతా జలదరిస్తోంది. "అర్థమయిందిలే ఆపండి" అన్నాను.
"ఏం? కథ నచ్చలేదా?"
"నచ్చటం నచ్చకపోవటం అలా ఉంచండి. ఇలాంటి ఇతివృత్తంతో వేరే భాషల్లో సినిమా లొచ్చినట్లున్నాయే."
"వచ్చాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొత్త ఇతివృత్తాలంటూ ఏమీలేవు. ఇతర భాషల్లో కొంత వైవిధ్యంతో ఉన్న థీమ్స్ తీసుకుని అందులో ఒకటి, ఇందులో ఒకటి సీన్స్ తీసుకుని కథను అల్లటం. ఇలా అల్లటం కోసం సినీ పరిశ్రమలో చిత్రాతిచిత్రమైన కథల్తో కొందరు రచయితలు తయారవుతూంటారు. వాళ్లు సినీ సామ్రాజ్యాన్ని ఏలేస్తూంటారు. ఈ ఫీల్డులో ఇప్పుడు కథల కొరత దారుణంగా ఏర్పడింది. కొన్నాళ్లు పౌరాణికాలు, తర్వాత కుటుంబ గాధా చిత్రాలు, ఆ తర్వాత యాక్షన్ చిత్రాలు వాటిలో పైటింగులు, వయోలెన్స్, క్రైమ్ రకరకాల బ్రేక్ డాన్స్ లూ విపరీతమైన మోతాదులో సెక్సూ.... ఆ సెక్స్ కోసం ఇదివరకు కొంతమంది ప్రత్యేకంగా ఉండేవాళ్లు. అంగాంగ ప్రదర్శనలతో ఆదరగొట్టేసేవారు, ఇప్పుడు హీరోయిన్సే కావల్సినంత సెక్స్ సరఫరా చేస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉండేసరికి, వాళ్లలో ఒకరిద్దరికి తప్ప చాలామందికి గిరాకి పడిపోయింది. మధ్యలో లవ్ స్టోరీస్ అప్పుడప్పుడూ తళుక్కుమని మెరుస్తూ విజయ దుందుఖి మ్రోగించాయి. వాటికి అద్భుతమైన మ్యూజిక్కూ, మాంచి ఫ్రెష్ నెస్, అందచందాలూ ఉన్న హీరో హీరోయిన్లు దొరకటం, ఇంకా కొన్ని వనరులు కావాలి. లేకపోతే ప్లాప్ అయిపోతున్నాయి. ఇహ.... ఇప్పుడు యాంటీసెంటిమెంట్ స్టోరీకి గిరాకి వస్తోంది. ఒకప్పుడు యాంటి సెంటిమెంట్ స్టోరీనంటే ప్రజలు జడుసుకునేవాళ్ళు. వాటిని మంచి పవర్ ఫుల్ గా తియ్యగలిగితే గొప్ప ఆదరణ లభిస్తోంది.
"పవర్ ఫుల్ గా అంటే?"
"సెంటిమెంట్ ఇదివరకెలా పిండేవారో, యాంటి సెంటిమెంట్ ని అలా పిండగలగాలి."
నేనాలోచిస్తూ ఉండిపోయాను.
"ఈ చిత్రంలో నీది అద్భుతమైన పాత్ర. ఎక్స్ పోజింగ్ అనేది కావాలని చేసినట్లుగా కాకుండా చాలా సహజంగా కథలో కలిసిపోయి ఉంటుంది?"
"అంటే ఎలాగా?"
"హీరో హీరోయిన్ ల మధ్య ప్రణయ దృశ్యాలలా ఉంచు. ఓసారి హీరోయిన్ కి వంట చేస్తోంటే నిప్పంటుకుని బట్టలు కాలిపోతాయి. అప్పుడామెను రక్షించటానికి హీరో వచ్చి బట్టలు మొత్తం ఊడదీసి పారేస్తాడు. ఈ సీను పూర్తిగా నూడ్ గా చూపించాలనుకుంటున్నాను."
"ఇంకా."
"పిల్లలకు పాలివ్వటం. పూర్తిగా రొమ్ములు చూపిస్తాను. పిల్లలు తాగుతూండగా రొమ్ములు చూపించటం అయిదారుసార్లు రిపీటవుతాయి. సెన్సార్ వాళ్ళభ్యంతర పెట్టకుండా మాతృత్వమనే పాయింటుని అడ్డుపెట్టుకుంటాం!"
"ఓ సినిమాలో రాజ్ కపూర్ చేసినట్లుగా."
"యస్. అలాగ. నీ పేరు వాడవాడలా మ్రోగిపోతుంది. ఇతర హీరోయిన్లు అసూయపడే స్థితికి చాలా కొద్ది రోజుల్లో చేరుకుంటావు. నా తర్వాత పిక్చర్ కి కాలిషీట్ కోసం బహుశా నేనే చుట్టూ తిరగాల్సి వస్తుంది."
ఓ నిముషం గడిచాక "వొద్దు. నాకిష్టం లేదు." అన్నాను.
షాక్ అయినట్లు కనిపించాడు. "ఎందుకని?"
"నా మనసంగీకరించటం లేదు. అందులో గొప్పతనం ఉండవచ్చు పేరు ప్రఖ్యాతులు రావచ్చు. పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చు. కాని నాకు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఉంది."
"ప్రశాంతమైన జీవితం, డబ్బూ, హోదా లేకుండా ఆర్థిక ఇబ్బందుల్తో సతమతమవుతూ, ఆకలి దప్పులతో మాడుతూ ఉంటే ఎక్కణ్ణుంచి వస్తుంది?"
"ప్రయత్నిస్తాను."
"ఆల్ రైట్. మల్లీవారం రోజుల్లో కలుస్తాను" అంటూ లేచి వెళ్లిపోయాడు.
ఎప్పుడో, ఏదో సందర్భంలో చెప్పాను. స్త్రీకి ప్రపంచాన్ని జయించాలంటే మగాడిలా ఎన్నో హంగులు ఉండాల్సిన అవసరం లేదు. అందమూ, కొద్దిపాటి మేధస్సు ఉంటే చాలు.
* * *
ప్రక్కింటి వాళ్లొచ్చి పిలిచారు.... వైదేహి పెళ్లి అని.
వైదేహి అంటే మొన్నీ మధ్యనే రజస్వలయిన పిల్ల.
నిండా పధ్నాలుగేళ్లుండవు. అప్పుడే పెళ్ళేమిటి? నేనేదో పెద్దదాన్నయి పోయినట్టు నా గత జీవితం గుర్తొచ్చింది.
ఆ మధ్యాహ్నం వైదేహిని పిలిపించుకున్నాను.
పెద్దమనిషి అయినప్పట్నుంచి ఆ పిల్ల ముఖంలో ఓ కళ వచ్చింది. శరీరంలో మార్పులు తెలుస్తున్నాయి. ఇప్పుడు మరింత శోభతో వెలిగిపోతోంది.
"వైదేహి.... నీకు పెళ్ళా?" అన్నాను.
సిగ్గుపడుతూన్నట్లుగా నవ్వింది. కళ్ళలో మెరుపు.
"ఆ అబ్బాయేం చేస్తాడు?"
"పాలిటెక్నికో ఏదో ప్యాసయి ఉద్యోగం చేస్తున్నాడు."
"ఏం ఉద్యోగం?"
"తెలీదు."
"సంపాదన ఎంత ఉంటుందో తెలుసా?"
