Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 36


    నవ్వారాయన. "తప్పేదేముంది? నలుగురితో మనమూను. మంచి సంప్రదాయం, చక్కని అమ్మాయి అయితే చాలన్నారు. అబ్బాయి చూసి సరే నంటే మిగతా విషయాలు వచ్చి మాట్లాడతారట. ఆ విషయం ఆలోచిస్తున్నాను" కాసేపు ఆగారాయన.

    నా విషయం ఏమిటన్నట్లుగా చూశాడతను.

    "ఇక నీ గురించీ ప్రయత్నం చేస్తూనే వున్నాను. రెండు సంబంధాలు వచ్చాయి. జాతకాలు బాగున్నాయి. ఇద్దరూ బి.ఏ. చదివారు. ఒకమ్మాయి వుద్యోగం కూడా చేస్తోంది. మరి నువ్వు వెళ్ళి ఆ యిద్దర్నీ చూసిరావాలి. ఎవరు నచ్చితే వాళ్ళని కుదుర్చుకోవచ్చు.

    "పెళ్ళి చేసుకునే వాడివి నువ్వు. నీ అభిరుచికి అనుగుణంగా ప్రవర్తించాలనే నా అభిమతం"...

    "నాన్నా !

    "మీరన్నారే పెళ్ళి నా యిష్టప్రకారం జరగాలని. అలాగే జరిగేట్టయితే యీ రెండు సంబంధాలూ నాకిష్టం లేదు. మనం వెళ్ళి చూడక్కర్లేదు"...

    "ఎందుకు? చదువుకున్న అమ్మాయిలు యిష్టం లేదా?"

    "కాదు__"

    "మరేమిటి ?__"

    అతని గొంతుక్కేదో అడ్డుపడ్డట్లయింది. కొంచెం తటపటాయించి మెల్లగా అన్నాడు. "నేను స్వాతిని ప్రేమిస్తున్నాను. ఆమె అంటే నాకు చాలాయిష్టం. మొన్న జరిగిన సంఘటనతో ఆమెకీ నేనంటే, అభిమానం, గౌరవం వున్నాయనుకుంటున్నాను. "మీకిది బాధగానే వుంటుంది."

    ఆయనకి పిడుగుపాటులా వున్నాయా మాటలు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. పై వాళ్ళందరూ తలా ఒక రకంగా బాధిస్తే యితగాడు మరో రకంగా చిత్రహింస ప్రారంభించాడు, అనుకున్నారు నలుగుతున్న - మనసుతో.

    "బాధలేదురా!, ఇంకా ప్రాణం పోకుండా నిలచి వున్నందుకు చింతిస్తున్నాను."

    "కొంచెం నన్ను చెప్పనివ్వండి నాన్నా. కోదండం చనిపోయాక ఆమె జీవితం అంధకారమయమై పోయింది. వాడు చనిపోయాడని ఆమె కూడా జీవచ్చవంలా బ్రతకాలా? కోరికలూ, సుఖాలూ చంపుకోవాలా?, మగవాడు చనిపోతే __ ఆడదాని జీవితం మోడుగా వుండాలా!"

    "వద్దురా! దేశంపై బడి విధవరాళ్ళ నందరినీ పెళ్ళి చేసుకో! వీరేశలింగం లాగా దేశోద్దారకుడివికా__" "ఆమె జీవితం బాగు చేయాలి మనం. చదువుకున్న వారు, శాస్త్రాలు తెలిసినవారు _ విధి నిషేధాలు తెలుసుకున్నవారు మీరు. విధవా వివాహం నేరమా? నిషిద్ధమా?"__

    ఒక్కో ప్రశ్న ఆయన హృదయాన్ని తూట్లు పొడుస్తోంది.

    "చూడండి నాన్నా! ఆమె ముఖం బాగా పరిశీలించి చూడండి. వయసు మళ్ళిందా? సుభాలనుభవించిందా? ప్రపంచం చూసిందా? ఆమె నూరేళ్ళ జీవితం వృధా అయిపోవటం నేను భరించలేను. ఆమె జీవితం మళ్ళీ చిగురించాలి.

    "ముఖాన తిలకం దిద్దితే కావ్య కన్యలా కనిపించదా? గాజులు తొడిగితే నవ వధువులా వుండదా? పూలు ముడిస్తే ముత్తయిదువ కాదా? చెప్పండి నాన్నా!

    "ఆమెకి తల్లీ తండ్రీ లేరు. సోదరుల్లేరు మిమ్ముల్ని నమ్ముకుని కోదండానికి చేసుకోమని అత్తయ్య చనిపోయింది. పెళ్ళయి కాపురానికి వచ్చీరాగానే వాడు పోయాడు. ఆనాటి నుండి ఆమె విధవా జీవితాన్నే గడుపుతోంది.

    "ఈ జీవితం ఆమె పాలిట శాపం కాకూడదు నాన్నా__

    "దీర్ఘంగా ఆలోచించండి. శాంతంగా యోచించండి" ఆవేశంగా అన్నాడు పట్టాభి.

    అంతదాకా స్తంభం చాటున వున్న పార్వతి బయటికి వచ్చింది.

    "పట్టాభీ"

    తలెత్తి చూశాడు తల్లి వైపు.

    "నువ్వు నీ మార్గాన్నే ఆలోచిస్తున్నావురా! స్వాతి యీ మాటలు వింటే బావిలో పడి ఛస్తుంది"

    "ఏంకాదు చాలా సంతోషిస్తుంది. మోడువారుతున్న జీవితం తిరిగి చిగురించబోతున్నందుకు పులకించి పోతుంది. నా ధైర్యానికి సాహసానికి మెచ్చుకుంటుంది" ధీమాగా అన్నాడు.  

    "నీకేం పోయేకాలం వచ్చిందిరా!, ఎలా పుట్టార్రా మీరు నా కడుపున. ఒక్కడు కాకుండా ఒక్కడైనా మంచివాడు పుట్టలేదేంరా! నా కడుపున"

    "ఇప్పుడు నేనేం చేశానమ్మా! ఒక మంచి పని చేస్తానంటే ఎందుకంతా గింజు కుంటున్నారు. రోజులు మారాయి. మీకు తెలియదేమో!"

    "ఛీ! ఛీ! నేను గొడ్రాలినైనా బావుండేది. కు పుత్రత్వం కంటే, ఆ పుత్రత్వం మేలు అన్నారు మా మానాన్న. కు పుత్రులు వుంటారా అనుకునేదాన్ని. కానీ భగవంతుడు నా కడుపునే పుట్టించాడు పరీక్షగా చూసుకోమని"...

    "అమ్మా" బాధగా పిలిచాడు.

    "అమ్మట అమ్మ ! ఆ అమ్మకు ఓ భర్త వున్నాడని మీరు ఆలోచిస్తున్నారా? ఎవరిష్టం కొద్దీవాళ్ళు వ్యవహరిస్తున్నారు. పెద్దాళ్ళయ్యార్రా, మీరిప్పుడు స్వతంత్రులయ్యారు"__

    "అమ్మా! అమ్మా! నేనేం తప్పు చేయటం లేదమ్మా. మీనుండి విడిపోవటమూ లేదు......

    పార్వతి ఆవేదన ఆగటంలేదు.

    "నీ చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే, నువ్వు సంధిలో వుంటే నిన్ను తిరిగి యీ లోకంలోకి తేవటానికి మీనాన్న ఎంత శ్రమపడ్డారో నీకు తెలుసురా? అప్పుడే అడగరాదట్రా ఇవన్నీ ఎందుకని?"  

    "అమ్మా కన్నతల్లి ఆవేదనా, కన్న తండ్రి ఆరాటం మర్చిపోయే వాడినా?"...

    "మర్చిపోకపోతే ఇవన్నీ ఏమిట్రా? అప్పుడు కొంగుపట్టుకుని అమ్మా, అమ్మా, అని తిరిగావు. నాన్న కలిపి పెడితే గాని ముద్ద దిగేదికాదు నీకు. ఇప్పడవన్నీ ఎందుకురా! అమ్మనీ నాన్ననీ కూనీ చేయమన్నా చేస్తారు మీ సుఖం కోసం......"

    మంచం మీద నుంచి లేచాడు పట్టాభి. అతడి ముఖం మాడిపోయింది. చిరుగాలి వీస్తున్నా చెమటలు పోస్తున్నాయి.

    "కూర్చోరా! నా పగిలిన గుండెలు చేసేరోదన వినరా! ఇన్నాళ్ళు దాచుకున్న వేదన వినరా! ఎంత స్వతంత్రించి నా యింత బరి తెగిస్తావట్రా"...

    "అమ్మా! ఆమె జీవితం బాగుపడాలనే యిదంతా"...

    "కాదురా! కాదు. వివేకం మర్చిపోయావు .వదినంటే తల్లి తర్వాత తల్లిరా! ఇది లక్ష ణులుండాల్సిన దేశం! నీలాంటి రాక్షసులుండాల్సిన స్థలంకాదురా. వెళితే శాశ్వతంగా మాకు ముఖం చూపించకుండా వెళ్ళిపో! ఆ వెధవలు వెళ్ళిపోయారుగా. అలాగే నువ్వు చావు. పీడ విరగడైందనుకుంటాం."

    "అమ్మా నీకెందుకింత ఆవేశం? ఆమె ఉద్దేశం తెలుసుకుని__ __ఆమెకు యిష్టమైతేనే"__ __

    "నోర్ముయ్! అప్రాచ్యుడా! నువ్వూ చావరా! అసలు కొడుకులే పుట్టలేదనుకుంటాం. అవ్వ! అవ్వ! ఏమి ధైర్యం? ఏం ధైర్యం? అన్న భార్యని పెళ్ళి చేసుకుంటానంటావా? అది వింటే విషం పుచ్చుకుంటుంది. లోకం నీ ముఖాన పూస్తుంది మమ్మల్ని వూస్తుంది. ఏం బ్రతుకులురా మీవి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS