చదువు ద్వారా దేశానికి ఉపయోగపడటం కంటే, ఈ సభలూ, కసరత్తులు అనుభవంతో దేశాన్ని ఉద్ధరించి పుణ్యం కట్టుకోడమే తక్షణ కర్తవ్యమంటూ ఈ వృద్ధనాయకులు ఉపన్యాసాల్తో మత్తుమందు సరఫరా చేస్తున్నంత కాలమూ ఈ యువసభ్యులు చదవరు. పరీక్షల కెళ్ళరు.
అందుచేత చిరంజీవికి పరీక్షల మీద ఆసక్తి పూర్తిగా చచ్చిపోయి, మైసూరు వెళ్ళి నాయక శిఖామణులను కలుసుకుని వాళ్ళ ఆశీస్సులను పొందాలనే కోరిక ఎక్కువయ్యింది.
వెళ్ళేముందు తండ్రికి చెప్పి వెళదామనుకున్నాడే గాని. ఆ తండ్రి మహాశయుడు ఎక్కడున్నాడో ఎంత ప్రయత్నించినా తెలిసింది కాదు.
అందర్నీ అడిగాడు_నాన్నెక్కడని.
ఎవరూ తెలీదన్నారు.
నాలుగు రోజులు గడిచినా తండ్రెక్కడున్నాడో తెలీలేదు. అవతల సభ రోజు దగ్గిర పడుతోంది. సభల కెళ్ళేముందు - తండ్రి నుంచి సలహా పుచ్చుకోడం అవసరం.
పైగా_
సుమతి విషయం ఎటు తేల్చిందీ చెప్పలేదు, కథ విని వూరుకున్నాడేగాని, తను ఏమనుకున్నదీ చెప్పలేదు. ఏ విషయమూ వివరించకుండా తండ్రి ఎక్కడికి పారిపోయినట్టు?
'కొంపదీసి నాన్న మంచివాడు కాలేదు గదా?'
"ఒరేయ్ జీవీ! నువ్వు సుమతికి అన్యాయం చేశావు కొడకా! నువ్వు ఆ పిల్లని పెళ్ళి చేసుకోవడం న్యాయం నాయనా! అది కానిచో తండ్రీ, నా ఆస్తిలో, ఇన్ని లక్షల పిచుకల్లో ఏ ఒక్క పిచుకా నీకు చిక్కనివ్వను పుత్రా! నా మొత్తం ఆస్తినీ ఏ స్వాములవారికో రాసేసి నేను కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేస్తాను తెలుసా! జాగ్రత్త! అని అనేస్తే___
అంటే ఏముందీ, నేను మొత్త గోవింద! లక్షలాస్తిని వదులుకొని తనేమి చేయగలడు?
పిచ్చిగానీ, ఇంత నీతిమంతమైన బతుకెక్కడేడ్చిందీ యింట్లో. పక్కనే బతికే వాడిని ఛీట్ చేయడంలో గల 'రుచి' వాడిని ఉద్ధరించడంలో వుంటుందా! వుండదుండదు. ఆయనంత ఫూలా! కాడు కాడు.
'మరి నాన్నెక్కడ?'
ఏదో రాజకీయ సంచారంలో వుండి వుంటాడు. ఎవడి కొంపో ముంచే నిమిత్తం రాజధాని కెళ్ళే వుంటాడు. అవునదే కరెక్టు!
నగర స్థాయినుంచి, రాష్ట్రస్థాయిలో పాలకుడవ్వాలనే దిక్కుమాలిన కోరిక నాన్నని పరుగులెత్తిస్తుందేమో! అందుకే నాన్న రాజధానికెళ్ళి వుంటాడు.
నిజానికి ఈ రాజకీయమే నాన్నని లొంగదీసుకుని వుండకపోతే, తన బతుకు దారుణమే గదా!
'రాజకీయమా! నీ దుంప తెగిపోను. వర్థిల్లు! మూడు కాయలు ఆరు పూలుగా వర్థిల్లవే ముండ! నాన్ననీ నన్నూ ఉద్దరించు, నీ కడుపు చల్లగా-మాలో మాకు కలతలు పెట్టకు. నాకింకా రెక్కలివ్వలేదు నువ్వు, ఇవతలేమో, నాన్నకి లక్షలిచ్చేసేవ్. ఇంత చేసి, నువ్వు ఇప్పుడు నాన్నని వదిలేస్తే, నాన్న లక్షలు గాలి కెగిరిపోతాయే తప్పించి నా వళ్లో పడవు. నువ్వు చల్లగా చూస్తే నాన్నలాగా నేనూ ఎదుగుతాను. ఎదిగెదిగి నాన్నని మించి నాన్న కందకుండా పోతాను! నా లక్ష్య సిద్ధికి అడ్డంపడి పాపం కట్టుకోవద్దు. నా రెక్కల్ని నాకు త్వరగా యివ్వు. నిజమే మనసు పడి సుమతిని చెడగొట్టేను. చెడ గొట్టడమే రాజకీయం గదా. అందుచేత నన్ను పనిష్ చేయకు. నాన్నకి మంత్రిపదవి యావ కలిగించు. అటువేపు లాక్కుపో. లక్షల మీద ఆయనకి మరింత మక్కువ కలిగించు. నాన్నని ఆ విధంగా నువ్వు బంధించి వుంచేస్తే, ఇవతల నా పనులన్నీ చక్కబరుచుకుంటాను. నాన్నని నువ్వు వదిలేస్తే___నాన్న కళ్ళు తెరుస్తాడు. నాన్న కళ్ళు తెరుస్తే రాజకీయమా! నాకు రెక్కలు రావు. నేనెదగ లేను, సింహాసనం వుండదు. లక్షలు నన్ను చేరవు. కాపాడు. కాపాడి, కాపాడి, కాపాడు. అనుకున్నాడు చిరంజీవి.
ఇంతనుకున్నమీదట, తండ్రికి చెప్పకుండానే అతను మైసూరు రైలెక్కాడు___
* * * *
రామదాసు సీతముందు మౌనంగా కూచున్నారు!
సీత గబగబా మాటాడుకుపోతోంది. ఆ విధంగా ఆమె ఎప్పట్నుంచో మాటాడుతూనే వుంది.
రామదాసుని చూసిన మొదటి క్షణం కొయ్యమై, ఆ క్షణం నుంచి జారుకుని రుద్రకాళియై, వెనువెంటనే భూదేవియై, ఆ పిదప మామూలు సీతగా మారి మాటాడుతూనే వుంది.
ఇన్నేళ్ళ నరకంలో తనే స్వర్గాన్ని నమ్ముకు బతికిందో, ఇన్నేళ్ళ వంటరితనంలో తనే తోడు నాశించి మురుస్తూందో అన్నీ, అంతా వివరంగా చెప్పింది.
కన్నీరెట్టుకుంది. గాద్గదికంగా మాటాడింది. ఆత్మస్థైర్యం మనిషిని కుదుపగా చాలా ధైర్యంగా తన కథని చెప్పింది.
తలెత్తి సూటిగా ప్రశ్నించింది. స్వగతం పలికింది. కన్నెర్ర చేసింది. జాలిపడి నవ్వింది. రామదాసు బతికే బతుకుని తిట్టే ప్రయత్నంతో కసి, చేతగాక తన బతుకుని తానే తిట్టుకుంది....తనని తాను తిట్టుకున్నందుకు బాధ పడింది.
ఆ తర్వాత, తను సాధించిన కొన్ని ఘనకార్యాలూ, తాను కలలుగంటూన్న బతుకూ, డైరీల ఆధారంతో__ ఆవేశంగా చదివి వినిపించి తృప్తి పడింది.
అంతలోనే మళ్ళా ఏడ్చింది.
ఒక్క గంట కాలంలో యిన్ని మార్పుల మధ్య అంత చరిత్ర విన్న రామదాసు అతి ధీనంగా అన్నాడు.
"నన్ను క్షమించు సీతా! దుర్మార్గుడ్ని నేను. ఇంత కథని దాచుకు బతుకుతూన్న నువ్వు దేవతవి? క్షమించు నన్ను!"
సీత మాటాడ్డం లేదు. ఆలోచిస్తోంది. ఇది నిజంగా పశ్చాత్తాపమే అయితే, ఈ పశ్చాత్తాపాన్ని ఇన్నేళ్ళుగా మరుగు పరచిన మహత్తర శక్తి ఏమై వుంటుంది? ఏమైవుంటుందో స్ఫురణకి రాగా జాలిగా నవ్వింది సీత!
