చిరునవ్వు నవ్వాడు స్వామీజీ, రాత్రి చూళ్ళేదా వాళ్ళందరికీ మంత్ర విభూది యిచ్చినాము కదా! అందరూ కిక్కురు మనకుండా మీ మాటలకి ఒప్పేసుకున్నారు కదా!
"అదే స్వామీ నా ధైర్యం. మీరైతే సులభంగా నా తమ్ముడిని దార్లోకి తెస్తారని ఆశపడుతున్నాను.'
"ఇదొక్కటేనా నీ కోరిక?"
"ఆ అవును ఇదొక్కటే స్వామీజీ."
"ఒక్కటే అయితే తీరుస్తాం! కానీ నీ మనసులో ఇంకో కోరిక కూడా వుందే?"
'లేవు స్వామీజీ!" తడబడ్డాడు చౌదరీ.
"ఇంకోటుంది చూడు! స్త్రీ సంబంధమైనది. " చీకట్లో రాయి విసిరేడు స్వామీజీ.
తడబడ్డాడు చౌదరి.
"చిక్కాడురా దొంగ!" అనుకున్నాడు స్వామీజీ . ఇదిగో! మా వంటి మహాత్ముల దగ్గరనా యీ దాగుడు మూతలు. మేం సర్వజ్నులం! మాకు అన్నీ తెలుసు. నీ కోరిక తీరుతుందిలే."
చౌదరి కళ్ళల్లో మెరుపు! ఆశగా, చూశాడు. "బాబాజీ!" అంటూ సాష్టాంగపడ్డాడు.
బాబాజీ చౌదరి తల నిమిరాడు.
"లే! నీ కోరిక తీరుతుంది."
"సంతోషం బాబాజీ!"
'అయితే ఒకటి చేయాలి!"
"ఈ విషయం గురించి నువ్వు మరిచిపోవాలి. ఎవరితో అనకూడదు."
"చిత్తం స్వామీజీ!"
"ధ్యానానికీ, పూజకీ ఏర్పట్లకి నీ భార్యతో సహా రా తర్వాత నిత్యం పూజలో ఆమెని యిక్కడే వుండాలని చెప్పు."
"చిత్తం బాబాజీ!"
"నీ కోరిక త్వరలోనే సిద్దిస్తుందిలే!"
మళ్ళీ సాష్టాంగ పడ్డాడు.
శిరస్సు నిమురుతూ ఉండిపోయాడు బాబాజీ.
* * * *
సొసైటీ పని అనుకున్న దానికంటే తేలిగ్గానే ముగిసింది. అప్పు అంతా శాంక్షనయింది. జనార్ధన్ బదులుగా చౌదరి వెళ్ళేడు. వెంట శేఖర్ వున్నాడు.
అంత డబ్బు ఒక్కసారిగా కళ్ళ చూసేసరికి శేఖర్ కి మతిపోయినట్లయింది. చౌదరికి కళ్ళు కుట్టేయి.
ఇంత డబ్బూ ఆ వెధవల ఎదాన కొట్టాల్సిందేనా?"
శేఖర్ ప్రశ్నకి నవ్వుకున్నాడు చౌదరి. "ఎవరి సొమ్ము శేఖర్ యిది? గవర్నమెంటు సొమ్ము! మనం మధ్య మనుషులం. అంతే! కమీషన్ ముడుతోంది గదా చాలదూ?"
శేఖర్ ఏమి అనలేదు.
"మొత్తం అయిదువందల మందికి శంక్షనైంది కదూ!"
"అవును!"
"అందులో వంద దొంగ సంతకాలే!"
"అవును నేనే ఫోర్హ్జరీ చేశాను."
"సర్లే! ఎవరయితేనేం?"
శేఖర్ మౌనం వహించాడు.
"ఇందులో అందరికీ వాటాలుండాలి!"
"అ"
"మిగతా డైరెక్టర్లకి తెలియకూడదు!"
"సరే!"
"కష్టం మనది, లాభం అందరిదీనూ."
నిట్టూర్చాడు శేఖర్.
"ఈ బినామీ కలెక్షల్ని వాయిదా వేస్తూ రావాలి ఎప్పుడు పాపం పండితే అప్పుడు డైరెక్టర్లు కట్టుకుంటారు. "
"ఆ"
"ఎప్పటి మాటోలే అది, ఈరాత్రికి యిక్కడే వుండి రేపు వెళదామా?
"వద్దు మామా! ఇంత డబ్బుతో లాడ్జీలో వుండడం క్షేమం కాదు. ఊరికి వెళదాం." భయంగా అన్నాడు శేఖర్.
"అయితే ఓ జీపు మాటాడు. భధ్రంగా ఇల్లు చేర్దాం."
