Previous Page Next Page 
వారుణి పేజి 35


    మొదటినుంచీ ఆయనదదో తరహా వ్యక్తిత్వం. తల్లిదండ్రులైనంత మాత్రాన మనం వాళ్ళ భవిష్యత్తుని శాసించకూడదు. ఏ వ్యక్తి తన అభిరుచితో అద్భుతవ్యక్తి అవుతాడో ఎవరికి తెలుసు? తను లెక్చరర్ అవుతానని తన తండ్రి అనుకోలేదు. ఆయన తాలూకా ఆఫీసులో మామూలు లోయర్ డివిజన్ గుమాస్తాగా రిటైర్ అయ్యారు. ఆయన శక్తిమేరకు తనని ఎసెసెల్సీ చదివించి, తన్నీ అలాగే తాలూకాఫీసులో చేర్పించాలని చూశారు. అప్పుడు గాంధీగారి హిందీ ప్రచారం ముమ్మరంగా వుండేది. తన తండ్రిగారు గాంధీజీ శిష్యులు. అహింస, సత్యవాక్పాలన అదివరకే వుండేవి. దానికితోడు స్వరాజ్య సమరం. అంచేత నరసింహంగారికి హిందీ బాగా నేర్పించారు. ఆ ముమ్మరంలో చాలామందికి హిందీ నేర్పాడు. ఎన్నో పరీక్షలు పాసైపోయాడు. దానితో అనుకోకుండా జిల్లా పరిషత్ లో హిందీ పండిత పదవి వచ్చింది. తృష్ణ అనేది దాగదు. దాంతో పరీక్షలు పాసైపోయి విచిత్రంగా తెలుగెమ్మే పూర్తిచేసి లెక్చరరైపోయాడు. తండ్రిగారు ఆ స్థితి చూడకపోయినా, ఆ సుఖం ఆయనకి దక్కింది.
    అంచేత ఎవరి "రాత" ఎలా వుంటుందో ఏమో అన్నది ఆయన ఆలోచన. దాంతోటే ఎవరినీ నిర్బంధించలేదు. దానికితోడు కూతుళ్ళు ఎక్కువ కావడం కొడుకు ఒక్కడే కావటంతో ఆయనో విధంగా మనస్సన్న్యాసి అయ్యాడు. కూతుళ్ళందరికీ చదువులు చెప్పించాడు. ఒకరు భాషాప్రవీణ అయితే యింకొకరు హిందీ భాషాప్రవీణ. మరొకరు తెలుగెమ్మే. వారుణి అలాగే కెమిస్ట్రీ ఎమెస్సీ చేసింది.
    కూతురు తన ప్రేమ వ్యవహారం చెప్పగానే ఆయన క్షణంసేపు మాట్లాడలేదు. అంతకుముందు కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. గంతకుతగ్గ బొంత అన్నట్టుగా చేశారు ఆయన. ఇప్పటికీ ఎవరూ అసంతృప్తి వ్యక్తంచేయలేదు. వారుణికంటే చిన్నపిల్ల_ఆఖరమ్మాయి శిరీషకి మేనరికం సిద్ధంగా వుంది. వారుణికి ఎవరయినా లెక్చరర్ ని చూసి, యిద్దరికీ ముడిపెట్టెయ్యాలని చూస్తున్నారాయన.
    కానీ లెక్చరర్ అనేసరికి ఇరవై ముప్ఫై వేలు కట్నం రేటు పలుకుతోంది. అక్షరాభ్యాసం నాటి ఖర్చు మొదలుకొని కాన్వొకేషన్ కి వెళ్ళొచ్చిన ఖర్చుల దాకా జతచేసి దానికి బ్యాంక్ వాళ్ళ పద్ధతిలో ఎప్పటికప్పుడు వడ్డీ వేస్తూ కట్నం అడుగుతున్నారు తల్లిదండ్రులు.
    దానికి ఆయన చింతించలేదు. ప్రస్తుతకాలం అలా వుంది. డబ్బుకి అలా విలువ వుంది. అందుకే తన పదివేల బడ్జెట్ లో "దొరికే" వరుడి కోసం అన్వేషిస్తున్నారాయన.
    ఇంతలో వారుణి యింతపని చేసి కూర్చుంది.
    ఇద్దరూ డాబాపై కూర్చున్నారు.
    అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు నరసింహంగారు.
    ఉదయించబోతున్న చంద్రుడి లేలేత కాంతికోసం కాచుకు కూర్చుంది వారుణి.
    "పాపా!" ఆప్యాయంగా పిలిచారాయన. నిజానికి ఆయన ఏనాడూ పిల్లలని కేకెయ్యలేదు. అమ్మా, తల్లీ, పాపా అంటూ ఆప్యాయంగా పిలుచుకున్నారు. పంచకన్యలు పవిత్రమూర్తులుగా తనింట్లో వెలశారన్నది ఆయన భావన. "నువ్వు చాలా చిక్కు సమస్య తెచ్చిపెట్టావమ్మా తల్లీ! ఏం చెయ్యను?"
    "నీకో కథ చెబుతా వినమ్మా!"
    అజంతా గుహల గురించి విన్నావా! వాటిని నిర్మించటానికి ఎనిమిది వందల ఏళ్ళు పట్టిందట. తరానికి పాతికేళ్ళు. అలాగా ఆ గుహల నిర్మాణానికి ముప్ఫైరెండు తరాలవారు శ్రమించారు. ఎన్నో కుటుంబాలు అలా తరతరం ఆ గుహలని నిర్మించటానికి అంకితమైపోయారు. తొలుత నిర్మాణానికి కంకణం కట్టుకున్న ఆ పూర్వుల భావపరంపర చెడకుండా, వెలితిపడకుండా, ఆ గుహల అందచందాలు అలా అలా 8 వందల ఏళ్ళు కాపాడారంటే వాళ్ళెంత త్యాగం చేశారో గుర్తు చేసుకో.
    ఇది యీ మానవ వ్యవస్థ కూడా అలాంటిదే. ఎప్పుడో మనువు ఏర్పడి ధర్మాల్ని నిర్వచించాడు. ఇదీ కట్టుబాటు అన్నాడు. ఇది సాంఘిక ఆచారం అన్నాడు. ఇది కుల వ్యవహారం అని నిర్దేశించాడు. ఇలా బ్రతకాలి అని శాసించాడు.
    ఇన్ని వేల సంవత్సరాల నుంచీ ఆ నియమాలు ఆ కట్టుబాట్లు అలాగే అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి. ఎక్కడో నూటికో కోటికో ఒక్కడు యీ నియమ నిబంధనలని ఉల్లంఘించినా యీ వ్యవస్థకేం నష్టం కలగలేదు. ఆ ఉల్లంఘించినవాళ్ళే ఆ నష్టమో కష్టమో అనుభవించారు.
    నువ్వు వాళ్ళలో చేరతానంటే బాధగా వుందమ్మా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS