కాని వ్యక్తిగత జీవితం దగ్గర కొచ్చేసరికి ఆరని కుంపటిలా అయి కూర్చుంటుంది. పత్రికలన్ని వాళ్ళ సొంత విషయాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటాయి.
"హీరోల సంగతి ఒదిలేయ్. వాళ్ళకూ చాలా ఇబ్బందులున్నా మగాడిగా కొంతవరకూ చలామణీ చేసుకొంటారు."
"హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం. పేరూ, ఇమేజ్, విపరీతంగా డబ్బూ పెరుగుతూంటాయి. కాని వాళ్ళకు వయసూ, యవ్వనం, మనసూ, కోరికలూ వుంటాయి. ప్రేమ కోసం తహతహ ఉంటుంది. కాని.... వాళ్ళకు సమవుజ్జీలెవరు దొరుకుతారు? ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే విపరీతమైన గాసిప్స్. ప్రతి వాళ్ళకీ వాళ్ల ప్రయివేట్ లైఫ్ గురించే కావాలి. సకాలంలో అంటే, మాంచి వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఇమేజ్ పోయి, స్టార్ వాల్యూ పడిపోతుంది. అది కూడా శాక్రిఫైజ్ చేసుకుని పెళ్లి చేసుకుందామంటే వాళ్లిష్టపడ్డవారు దొరకరు. వాళ్లని వాడుకోటానికి ప్రతివారూ సిద్ధమే గాని, గౌరవప్రదమైన వివాహబంధంలోకి రావటానికి ఎవరూ సుముఖత చూపించరు. ఆమె పైకి రాక ముందు చొరవగా దూసుకొచ్చిన అసిస్టెంట్ డైరక్టరో, డైరక్టరో, ఏ ముసలి ప్రొడ్యూసరో, ఇదివరకు భార్యాగట్రా వున్న ఏ బిజినెస్ మేనో.... వీళ్లతో జీవిత భాగస్వామినిగా ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద హీరోలు ఒక్కోసారి భర్తలుగా రూపొందటం జరుగుతుంది. కాని వాళ్లకిదివరకే భార్యాపిల్లలూ, ఓ సంసారం.... ఈ వ్యవహారమంతా వుంటుంది. ఏ ఒకరిద్దరికో తప్ప హీరోయిన్లలో ఎవరికి సరిఅయిన భర్త దొరకాడో చెప్పండి. తన అందచందాలతో, నటనా కౌశలంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన మధుబాల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. మహానటి మీనాకుమారి ఆ ముసలి డైరక్టర్ని పెళ్లి చేసుకుని రాజీపడలేక త్రాగి త్రాగి జీవితాన్నేవిధంగా ముగించుకున్నది? నర్గీస్.... పాపం తన అమర ప్రేమ మొదట్లోనే బెడిసి గొట్టగా, జీవితాన్ని ఎలాగో మలుపు త్రిప్పుకుని నిలద్రొక్కుకుంది. సావిత్రి గురించి ప్రతివారికి తెలుసు. అసలామెలోని గొప్పతనానికి, అనుభవించిన జీవితానికి పొంతన ఏమన్నా ఉందా? ఇప్పుడున్న వాళ్లలో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని ఏడాది తిరక్క ముందే డైవోర్సులు తీసేసుకుంటున్నారు? ఎందుకు? ఎందుకిదంతా జరుగుతోంది? వాళ్ళకి సవ్యమైన వివాహబంధంలో వుండి ఆనందించాలని ఉండదా? రెండో భార్యలుగా ఉండటం వాళ్లకు సరదానా? అంతస్థుకు తగని వాళ్లకు ఉంపుడుగత్తెలు గానో, పేరుకు భార్యలుగానో, లేకపోతే ఎఫయిర్ పెట్టుకుని జీవించటం అభీష్ణమా? అంతకన్నా తప్పటం లేదు. విధిలేక అలా జరుగుతుంది. పోనీ సెక్స్ జీవితం తీసుకుందామా అంటే ఓ సామాన్య గృహిణికి అలవోకగా అందే సెక్స్ కూడా వాళ్ళకు లభించదు. టైముండదు. ప్రైవసీ దొరకదు. స్థావరం దొరకదు. ఏ హక్కూ లేకుండానో పెత్తనం చెలాయించే అక్కకో, తల్లికో, ఒక్కసారి ఏ చెంచాగాళ్లకో లొంగిపోయి కోరికల్ని వాయిదా వేసుకుంటూ, అణగద్రొక్కుకుంటూ, ఎప్పుడో ఓసారి ముక్తసరిగా తీర్చుకుంటూ బతకాల్సి వస్తుంది. కొంతమంది విశృంఖలమైన జీవితాలు గడిపిన వాళ్లు లేకపోలేదు. వాళ్ల జీవితాలు అంతకన్నా వికృతంగా తయారయాయి. ఇవన్నీ ఇందులోని లోటుపాటులు. ఇహ ట్యాలెంట్లన్నీ అణిచేసుకుని సామాన్యమైన గృహిణిగా ఉండదలిస్తే....
"ఏమిటి మాట్లాడుతున్నారు?" అంటూ ప్రకాష్ బాబు దగ్గరకొచ్చాడు.
ప్రకాష్ బాబు ఆమెతో "ఏమిటి సతికి నూరిపోస్తున్నావు? సినిమా ఫీల్డు గురించా?" అన్నాడు.
"లేదు మీ గురించి."
"మంచిగానా? చెడ్డగానా?" అంటూ ముందుకు వొంగి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె నవ్వి బుగ్గ తుడుచుకుంటూ "అదిగో నా ముసలి మొగుడు గుమ్మం దగ్గర నిలబడి కోపంగా చూస్తున్నాడు. ఇంటికెళ్ళాక చంపేస్తాడు" అన్నది.
"మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు అని ఏ ఆడదన్నా అన్నదంటే.... అది అతన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడుకుంటుందన్నమాటే."
"అబ్బో! జీవితాన్ని కాచి వడబోసినట్లు మాట్లాడుతున్నారే."
"ఎన్ని చూడకపోతే ఇంత వాళ్ళమయ్యాం. ఇందాక రేప్ సీను చాలా గొప్పగా చేశావు. ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. మళ్ళీ...."
"రెస్ట్ గాక ఏముందిలే. స్టీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని నేను పడుకోటం, గోడవైపు తిరిగి ఆయన పడుకోటం."
"సరే. మళ్ళీ అరకు వ్యాలీ నుంచి వచ్చాక డేట్స్ ఫిక్స్ చేస్తాను అంటూ సతీ రా బయట కారు రెడీగా ఉంది" అని గుమ్మంవైపు నడిచాడు.
"వస్తానండీ" అన్నాను ఆమెతో వినయంగా.
"వీడేదో పెద్ద మొనగాడయినట్లు. వీడి పెళ్ళాం వీళ్ళ ఆడిటర్ వెంకటాచలంతో తిరుగుతున్నట్లందరికీ తెలుసు. ఏమీ తెలియనట్లు యాక్షన్ చేస్తూంటాడు" అన్నది చిన్నగా.
ప్రపంచంలోని వాతావరణాలన్నీ ఇలా ఉంటాయా? రాను రానూ నాలో గందరగోళం ఎక్కువైపోతోంది. వికలమైన మనసుతో బయటకు నడిచాను.
14
రెండు రోజులు గడిచాక ప్రకాష్ బాబు వచ్చాడు.
"ఏమాలోచించావు?"
"ఏమీ ఆలోచించలేదు."
"ఒక గొప్ప అవకాశం నిన్ను వెదుక్కుంటూ వస్తూంటే ఇలా మాట్లాడటం బాగాలేదు. ఈ పాత్రకు నువ్వు సరిగ్గా సరిపోతావనుకుని ఇంతగా అడుగుతున్నాను. లేకపోతే ఇన్నిసార్లు తిరిగేవాణ్ణి కాదు. డబ్బు కూడా బాగానే ఇస్తాను. ఒక్క చిత్రంతోనే తారాపథాని కెళ్ళిపోతావు.
"నా పాత్రేమిటో తెలుసుకోవచ్చా?"
"తప్పకుండా" అంటూ అరగంటసేపు వివరించాడు.
ఆడది ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతుంది. భర్తకూ ఆమెకూ మధ్య శృంగార జీవితం. వీళ్ళని చూసి రెండో పెళ్ళాంతో కాపరం చేస్తున్న మామగారిక్కూడా వుషారొచ్చి పెళ్లాంతో విజృంభిస్తాడు. అత్తాకోడళ్లకిద్దరికి ఒకేసారి కడుపొస్తుంది. ఒకే హాస్పటల్లో పురుళ్లకోసం ఇద్దరూ ప్రక్క ప్రక్క గదుల్లో జాయినవుతారు. కాని అత్తగారు పిల్లాణ్ణి కని చనిపోయింది. ఆ పిల్లాణ్ణి కూడా ఈ అమ్మాయే సాకాల్సి వస్తుంది. తన పిల్లాడికి పాలిస్తూ, ఆ పిల్లాడు ఏడుస్తోంటే రెండో రొమ్ముతో వాడికి పాలిస్తుంది. తర్వాత కొన్నాళ్లకు ఆ మరిది పెద్దవాడవుతాడు. మొగుడు కారు యాక్సిడెంట్ లో చనిపోతే ఆ ప్రాంతపు ఆచారం ప్రకారం బలవంతంగా మరిదినే ఇచ్చి పెళ్లి చేస్తారు.... వాడితో...."
