ఒంటరిగా నిండు ఆకాశంలో ధృవనక్షత్రంలా మిగిలిపోయారు శాస్త్రిగారు.
* * *
తలవంచుకుని నడుస్తున్నదల్లా "జానకీ!" అన్న ఆప్యాయతతో కూడిన పిలుపు విని చివ్వున తలెత్తి చూసింది... ఎదురుగా చిరునవ్వుతో స్వాతి...
"స్వాతీ! నువ్వా? ఎప్పుడొచ్చావ్?" సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది.
"ఇప్పుడే__ఇంటి నుండే వస్తున్నాను"...
"మా ఇంటినుంచా!"
"అవును" విచారంగా అంది...
"అమ్మ ఏమైనా దురుసుగా మాట్లాడిందా?" కంగారుగా ప్రశ్నించింది. తల్లి నోటికి జానకి కూడా భయపడుతుంటుంది.
"నేనేదో... మిమ్ముల్ని కలపాలని ఆశతో వచ్చానమ్మా. కానీ ... మీ అమ్మ పడనిచ్చేలా లేదు. నీ వుద్దేశ్యమూ అదేనా? నీ నిర్ణయం నిదానంగా తెలియచేయి. నేను మామగారి క్కూడా చెప్పకుండా వచ్చాను స్నేహితురాలింటికి వెళ్ళి వస్తానని"__
జానకి సజల నయనాలతో స్వాతి వంక చూసింది.
"ఇంతమందిని యింత తీవ్రంగా బాధ పెట్టి తను బావుకునేదేముంది? భర్త మనసు కష్టపెట్టి సుఖపడేదేముంది? తల్లి మూర్ఖత్వానికి తనెందుకు బలైపోవాలి? తనకు వ్యక్తిత్వం లేదా? ఆలోచించలేదా?"
"ఏవిటమ్మా ఆలోచిస్తున్నావు? బావగారి మనసెంత కోమలమైందో నీకు తెలియదు. అయినా ఆయనేం తప్పు చేశారని? నీకోసం బాధపడని క్షణం లేదు, నీ నుండి విడిపోయి ఆయనేం సుఖ పడుతున్నారు?"
జానకిలో దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహిస్తోంది. నడిరోడ్డులో ఈ ప్రహసనం బావుండదనుకుంది స్వాతి. "నే వస్తానమ్మా మరీ, పార్వతి పరమేశ్వరుల్లాంటి పెద్దవాళ్ళు, వాళ్ళ మనసు క్షోభ పెట్టకు. చిన్నదాన్ని - నీకు చెప్పాల్సిన దాన్ని కాదు" గబగబా అనేసి వెళ్ళిపోయింది స్వాతి.
* * *
రాత్రి దాదాపు తొమ్మిది గంటలయి వుంటుంది.
శాస్త్రిగారు బయట మంచ మేసుకుని పడుకున్నారు.
ఆయన ఆలోకానలు అనంతంగా సాగిపోతున్నాయి.
స్వాతి, శ్రీవిద్య లోపలిగదుల్లో పడుకున్నారు. పార్వతి వసారానానుకుని వున్న గదిలో పడుకుంది.
పట్టాభి వచ్చి తండ్రి మంచంపై కూర్చున్నాడు.
శాస్త్రిగారు ఆలోచనల హారం తెగిపడింది. మసక వెన్నెలలో మనిషి సరిగా కనిపించక 'ఎవరు?' అనడిగారు.
"నేనే నాన్నా !"
"ఏం పట్టాభి?"
"ఆ డబ్బు దొంగ దొరికాడు నాన్నా, చెక్ మార్చిన తరువాత నేను నాలుగు వేలిస్తే తీసికెళ్ళి ఇంటిలో నాలుగు వందలు తక్కువిచ్చి ఆఫీసులో ఆ నాలుగొందలూ కట్టేశాడు. పోలీస్ ఎంక్వయిరీలో అంతా బయటపడింది. అతనూ తప్పు ఒప్పుకున్నాడు__
"రేపు ఫైనల్ ఎంక్వయిరీ చేసి, ఏజంట్ గారి ముందు నా సొమ్ము నాకిప్పిస్తానన్నారు. అయితే, అతన్ని కేసు లేకుండా వదిలెయ్యమన్నారు. కానీ... కంపెనీ వాళ్ళు అతన్ని తీసేశారు"__
"పోన్లే పాపం!, అక్కడికయినా మేలే కదా! యింతకీ ఎలా దొరికాడు?
"అతను అంతంత మాత్రం సంసారి. అతని భార్య యిది జరిగిన రెండో రోజు బంగారు కొట్టుకెళ్ళి బంగారం కొంటూ వుంటే పోలీసులు పట్టేశారు. నా క్లాస్ మేట్ జనార్ధన్ కేస్ పెట్టేశాడు. కేసు బుక్ చేయక పోయినా విషయం అంతా చెప్పాను. శ్రద్ధగా కేసు పరిశీలించాడు. వాడికి థాంక్సు చెప్పాలి. అతడే లేకపోతే యీ కేసు తేలేది కాదు"
"మన మనసు మంచిదైతే అన్నీ మంచిగానే జరుగుతాయి బాబూ!"
"నాన్నా"
"ఏం రా?"
"నా జీవితంలో యిది చాలా ముఖ్యమైన సంఘటన. మంచే జరిగింది నాకు, ఇప్పుడే ఒక విషయం అడగాలనుంది. అడగ మంటారా?
"ఏ విషయం బాబూ ?"
"నాన్నా ! యిది నా జీవిత సమస్య! ఇందులో మరొకరి జీవిత సమస్య కూడా యిమిడి వుంది. మీరు బాగా నిదానంగా శాంతంగా ఆలోచించాలి"
"ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నావా? ప్రశాంతత, నిదానం యివన్నీ నువ్వు చెప్పే విషయంపై ఆధారపడి వుంటాయి. గుండె పగిలే వార్త చెప్పి శాంతంగా వుండమంటే అది సాధ్యమా!"
"నాన్నా! యీ విషయం మీకప్పుడే చెప్పకూడదనుకున్నాను. మీకై మీరు ప్రస్తావన తెచ్చినప్పుడు అడిగి తెలుసుకుందామనుకున్నాను. కానీ పరిస్థితులు త్వర పెడుతున్నాయి"
ఆయన అయోమయంగా చూశారు కొడుకు వంక.
"జానకిరాం, అయోధ్య, కోసలరాం అందరూ దూరమయ్యారు"...
"ఇప్పుడా విషయాలు దేనికి?" బాధగా అన్నారాయన...
"విషమ పరిస్థితులలో అలా ప్రవర్తించారనుకుంటున్నాను. మీకెంత బాధాకరంగా వుందో వాళ్లు అలాగే ఫీలయ్యారు"
"ఇంతకీ ఏమంటావు?" విసుగ్గా చూశారాయన.
"నా పెళ్ళి విషయం ఆలోచించారా?"
ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం యివ్వలేదాయన.
కొంచెంసేపాగి "పట్టాభీ! నీ పెళ్ళి యీ సంవత్సరం చేయాలనే అనుకుంటున్నాను. నా ఆరోగ్యం అందుకు సహకరించలేదు. మనసు చెదరిపోయింది. సంసారంలో కలతలు నన్ను బాగా కృంగదీశాయి. నీకు తెలీందేముంది?"
బాధగా కళ్ళు మూసుకున్నారాయన.
"నీ విషయం కాస్త వెనుకబడిన మాట నిజమే ఈ సంవత్సరం మాఘంలో నీకూ శ్రీవిద్యకూ చేయాలనే అనుకున్నాను."
"మరి ఇప్పుడేమనుకుంటున్నారు?"
"శ్రీవిద్య విషయం హైదరాబాదు నుంచి ఉత్తరం రాశారు. అబ్బాయి ఎ. జి. ఆఫీసులో సూపరిండెంట్ గా వున్నాడుట. ఎం.ఏ. పాసై సెలక్షన్ లో వచ్చాడుట. కట్నం అదీ అక్కర్లేదంటున్నారు"...
"మొదట్లో అలాగే అంటారు లెండి. ఆ తరువాత లాంఛనాలనీ, గుడ్డూగూసనీ బాగానే గుంజుతారు..." పట్టాభి కోపంగా అన్నాడు...
