Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 34


    బాబోయ్! అంతపని మాత్రం చెయ్యకండి. ఇక్కడికే సిగ్గుతో చస్తున్నాను. సిగ్గు వదిలించుకుందామంటే భయంతో ఛస్తాను," అన్నదా పులి మరింత వొణికిపోతూ___
    అప్పటికా క్షణంలో సీత, రామదాసు పట్ల జాలిని ప్రదర్శించింది.
    కానీ, అరగంట గడిచీ గడవగానే ఆ జాలి తొలగి భయపడక తప్పిందికాదు....సీతకు.
    పులి పులిగా కనిపించి కేవలం సాధువునని హామీ నిస్తూ ప్రసంగం చేసింది. ఏం చేయాలో తోచక ఆ ప్రసంగమంతా వింటూనే వుంది పిల్ల.
    ".... ....సీతగారూ! నేను రెండు రోజుల్లో వెళ్ళిపోతానండి నాకు భయంగానే కాదిప్పుడు, మీమీద చెప్పలేనంత 'యిష్టం' వుంది.. చాలా ప్రశాంతంగా వినండి సీతా! నాకు స్నేహితుల్లేరు. తల్లీ తండ్రీ వున్నారు. అయితే వాళ్ళనుంచి స్నేహం పొందలేను. మంచి స్నేహితుల్నెవరైనా ఎంచుకుందామా అంటే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో నాకు తెలీడంలేదు. ఇదిగో, మిమ్మల్ని నమ్మేను చివరికి.... మిమ్మల్ని నమ్మేను. అందుచేత సీతగారూ! మీరు నాకు మంచి స్నేహితులు. స్నేహితులేగాదు_ మీరేమీ అనుకోనంటే, అవును నేనెప్పటికైనా చెప్పక తప్పదు. నేను మిమ్మల్ని ప్రేమించాను. ప్రేమిస్తున్నాను. నా గురించిగూడా చెబుతాను వినండి. నేనొక్కన్నే సంతానం కొంచెమో గొప్పో ఆస్థి వుంది. పర్లేదు నాకు ఉద్యోగం లేకపోయినా, నా భార్య పిల్లల్ని పోషించుకోగలను.
    నేను రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను. చెప్పానుగదూ. మళ్లా వచ్చి మిమ్మల్ని తప్పకుండా పెళ్ళిచేసుకుంటాను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేకపోతే ఇంకీ జన్మలో ఎవర్నీ చేసుకోలేను, చేసుకోను. మీరు లేవకండి. నేనే మీ మంచం దగ్గిరకి వస్తున్నాను. ఏం మాట్లాడకండి వ్యతిరేకంగా మీరిప్పుడేదైనా చెబితే, ఇప్పుడున్న నా భయానికది తోడై నా గుండె ఆగి చచ్చిపోతాను. తన్ను హత్య చేయకండి ప్లీజ్. మీరింకేమీ మాట్లాడొద్దు. నాక్కొంచెం చోటివ్వండి. థాంక్స్ లేవకండి మరి మనం చేసేదంటూ ఏ తప్పులేదు. నా మంచితనం మీద నమ్మకముంటే వుందనే అనుకుంటున్నాను. అదుగో, లేవకండి సీతా! ఐప్రేయూ నాట్ టు లీవ్ మి ఎలోన్! ఐప్రేయూ సీతా! ఐ లవ్ యు!."
    అతను సీతని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. సీత విలవిల్లాడిందిగాని, ఎదురు చెప్పేందుకు దేవుడా సమయాన ఓపిక యిచ్చేడు కాదు. రామదాసు దుర్మార్గుడో అనుకుంటున్నట్టు సత్యహరిశ్చంద్రుడో తేల్చుకునేందుకు గూడా అవకాశమిచ్చేడు కాదు దేవుడు.
    చిట్టచివరికి రామదాసే గెలిచాడు సీతని!___పచ్చి నెత్తురుతాగే పరమకిరాతకుడు. చేయలేని పనినొకటి రామదాసు అతి సునాయాసంగా చేసిపారేశాడు.
    ఒక గొప్పింటి సంబంధం తండ్రి తీసుకొచ్చాడు. నోరెత్తకుండా అంగీకరించడమే గాకుండా లేటెస్ట్ డిజైన్లో శుభలేఖలు అచ్చొత్తించి వాటిని స్వయంగా అతనే పంచేడు.
    గంగాధరంగారు వూరు వెళ్ళి వాళ్ళింటిముందు రిక్షా దిగి 'నమస్కారం' బాబాయి గారు! నమస్కారం పిన్నిగారూ? నమస్కారం సీతగారూ!___ఇదిగో శుభలేఖ! అని ఎంతో ప్రాధేయపడుతూ శుభలేఖ ఇచ్చాడు రామదాసు.
    అతని వల్ల సీత చెడిపోయిన వైనం తెలీని ఆ తల్లితండ్రులు అతని వినయానికి సంతోషించి సీతచేత కాఫీ యిప్పించి తప్పకుండా పెళ్ళి కొస్తామని చేతిలో చేయివేసి చెప్పారు రామదాసుకి___ఆ వెర్రిబాగుల దంపతులు!
    రామదాసు కాఫీని చాలా తాపీగా, కడు నిబ్బరంగా, నిశ్చింతగా తాగుతుండగా....ఇంతలేసి కళ్ళతో చూస్తూ.... ఏం చేయాలో తోచక.... గుబులు గుబులుగా.... తలుపు చాటున నిలబడింది సీత!
    కాఫీ ముగించి రామదాసు వెళ్ళిపోయాడు.
    రామదాసు పెళ్ళి, భాగ్యవంతుల పిల్లతో అతి వైభవంగా జరిగింది. పెళ్ళికి తప్పకుండా వస్తామని హామీ యిచ్చిన గంగాధరం దంపతులు రాకపోయినందుకు రామదాసు చింతించలేదు. పై పెచ్చు___ సీత ద్వారా తన పాడు కథ వాళ్ళకి తెలిసిపోయివుంటుందని ఊహించి 'హమ్మయ్య' నేను తప్పుకున్నానింక, అని గాలి పీల్చుకున్నాడు.
    మళ్ళా ఇన్నేళ్ళకి నేడు చిరంజీవి పాడు పని చేసి తండ్రిని మురిపించేసరికి, తండ్రికేదో షాకు తగిలినట్టయింది.

                                              11

    రాజకీయాలలో చిరంజీవి 'అ ఆ' లు నేర్చుకోడం పూర్తిచేశాడు! అందుచేత వల. తలల్లో ప్రవేశించాడు.    
    దీనికి తగ్గట్టు తను 'అఖిలభారత యూత్' పార్టీలో సభ్యుడుగా నమోదుకాబడ్డాడు. ఈ యూత్ పార్టీ మహా సభల్ని అర్జంటుగా మైసూర్ లో ఏర్పాటుచేయడం వల్ల, చిరంజీవి రొమ్ము విరుచుకుని, చేత కొంత రొక్కంతో, మనిషంతా దర్పంతో మైసూరు వెళ్ళిపోయాడు.
    ఈ పార్టీ సభ్యుల్లో ఎక్కువగా విద్యార్థులే వుంటారు. అయితే, వాళ్ళకి విద్యపట్ల అంత అమోఘమైన అభిప్రాయం వుండదు. తాతలూ, తండ్రులూ సంపాయించి పెట్టిన డబ్బు వాళ్ళనలా తయారుచేసింది. ఈ తరహా ఉత్సాహవంతులయిన విద్యార్థులనూ, ఆ తరహా కార్యక్రమాలకు ఆకర్షితులను చేయడానికి మాత్రం కొందరు వృద్ధనాయకులు కంకణం కట్టుక్కూర్చున్నారు! ఈ వృద్ధ నాయకులే యూత్ పార్టీ పెద్దలూ, కార్యకర్తలూను.
    చదువుకుని బాగుపడదామనే సదుద్దేశం చేరీ చేరడంతోనే చచ్చిపోతుంది. సంవత్సరం పొడుగునా సభలూ, అక్కడి తీర్మానాలూ, వాటి ఆచరణలూ వగైరా వారి వత్తిడి పనుల్లో మత్తెక్కి తిరిగే విద్యార్థికి చదివేందుకు గానీ, పరీక్షలకెళ్ళేందుకు గానీ తీరుబడి ఎక్కడిది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS