మసక చీకట్లు ముసురుకుంటున్నాయ్.
పేక మూసేశారు.
అయిదుగురు అలాగే కూర్చున్నారు. శేఖర్ చౌదరి దగ్గరిగా జరిగి మెల్లిగా అన్నాడు . " జనార్ధన్ అయిదు వేలు తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. రికార్డంతా ఒకే అయింది. రేపు బ్యాంకులో డబ్బు కట్టేస్తే వారం రోజుల్లోగా లక్షా యాభయివేలు శాంక్షనవుతుంది."
ఉలికిపడ్డాడు చౌదరి. :ఏమిటేమిటి? జనార్ధన్ మెడ్రాస్ వెళ్ళాడా?"
ఆప్రయట్నంగా అతను గట్టిగా అనగానే అంతా నోరు వెళ్ళబెట్టారు. శేషయ్య చప్పున "కుక్కతోక ఎప్పుడూ వంకరే" అన్నాడు.
"మామా! ఎద్దేవా వద్దు, కర్తవ్యం , కర్తవ్యం!"
నాయుడూ, ధర్మారెడ్డి మౌనం వహించేరు.
శేషయ్య దీర్ఘాలోచనలో మునిగారు. "చౌదరిగారు దిగాలుపడి పోయారే" అన్నాడు కొద్దిసేపాగి.
"అయిదువేలు పోయినందుకు కాదు, వీడికి బుద్దేవుడు వస్తుందా అని, ఇప్పుడెం చెయ్యాలి! ఛ! ఛ! నా ప్రాణానికి తెచ్చావెం మామా!"
"చౌదరీ! భయపడవద్దు. మార్గం చెబుతాగా." ఓ పట్టుపట్టాడు నశ్యం. అది అపుడే టౌను నుంచి వచ్చింది మంచి పొగరుగా ఘాటుగా వుంది."
అయన బుర్రలో ఏదో మెరిసిందనీ, ఆపద నుంచి బయట పడొచ్చనీ అర్ధమైంది అందరికీ.
"రాత్రి మీటింగ్ పెడదాం మొదటిసారి కాబట్టి అంతా లంచాలు అడుగుతున్నారందాం. ఇచ్చేవాడు వాడు వెంటనే ఇస్తాడు. లేనివానిది రేపు లోనులో తగ్గించి తీసుకుందాం. దానికి అంతా ఒప్పుకుంటారు. అంతో ఇంతో తక్కువైతే చౌదరి సర్దేస్తాడు. రేపు లోను రాగానే యిచ్చేదాం."
'ఆలోచన బాగానే ఉంది మామా! మరి జనార్ధన్ లేందే లోన్స్ శాంక్షన్ కావే!"
"నోర్మూయ్ రా వెధవ. నువ్వు సెక్రటరీ! నీ బుద్ది అంతే! సంతకాలు అన్నీ అయ్యాయిగా రేపు మనం వెళ్లి అర్జెంటుగా ప్రెసిడెంటు మద్రాసు వెళ్ళాడు అని చెబుదాం. సంతకాలున్నాయి కాబట్టి శాంక్షన్ చేస్తారు. కాదంటారా రైలెక్కి రేపు జనార్ధన్ ని తీసుకువస్తాను. తెలుసుగా ఎక్కడుండేది , పాండిబజార్ లో కాసేస్తే దొరికిపోతాడు. "
నిట్టూర్చాడు చౌదరి.
"ఎలా అయినా కరణం బుద్దే బుద్ది."
"లేకపోతే గుడి ముంగిట్లో ముగ్గు వెయ్యటమనుకున్నావా?"
"ఊహు ముగ్గులో దింపటం."
"భడవా! రాత్రికి మీటింగ్ ఏర్పాట్లు చూడు. అన్నట్లు ముందుగా జయన్నని, సోముని పిలిపించి మాటాడాలి. చౌదరి! ఆ పని నువ్వేచేయ్!"
తలూపేడు చౌదరి.
"భోజనాలు చేసి అందరం చౌదరి యింటి వద్ద కలుద్దాం. షేర్లు తీసుకున్న అందరూ అక్కడికే వస్తారు."
"అంతా ఎందుకు? డైరెక్టర్లని రమ్మని విషయం చెబుతే వాళ్ళు వాళ్ళని ఒప్పిస్తారు." అన్నాడు మునసబు ధర్మారెడ్డి.
"అదీ పాయింట్!" అన్నాడు నాయుడు.
"పోనీ అలాగే చేదాం! కుదరకపోతే అందర్నీ రమ్మందాం!"
"మా భేషుగ్గా కుదురుతుందోయ్" అన్నాడు శేషయ్య.
దాంతో సమస్య పరిష్కారమైపోయినట్టుగా నిట్టూర్చాడు చౌదరి.
15
"సచ్చిదానంద !" అన్నాడు స్వామీజీ.
"మీ దయ స్వామీజీ! నాకు సంతానం లేదు. నా తమ్ముడు యిలా అయ్యాడు. వాడు బుద్దిమంతుడై ఓ యింటివాడయితే నాకు అంతకంటే ఏం అక్కర్లేదు. డబ్బు విపరీతంగా సంపాదించాను. అధికారమూ అనుభవించినా. ఇంకేం కావాలి! ఈ బ్రతుకు యిలాగే సుఖంగా వెళ్ళిపోతే చాలు."
