ఒక్క నవలల విషయం తప్ప కవిత్వ విషయాలన్నీ దొర్లేవి.
15
సంవత్సరం గడిచిపోయింది.
వేసవి సెలవులు వచ్చాయి. అత్తయ్య ఊరికి వెళ్ళిపోదామంది. నాన్నగారు కూడా రమ్మని రాశారు. అమ్మకి చూడాలని వుందట.
కానీ తనకీ వూరు వదలబుద్ధి కావటం లేదు. ప్రతిరోజు జరిగే సూర్యోదయం, సూర్యా సమయంలాగా ఒక్కసారయినా అతన్ని కలుసుకోలేకపోతే, అతనితో మాటాడకపోతే ఆరోజు దుర్దినంలాగా అనిపించేది.
మేఘాన్ని చూసిన నెమలిలా మనసు నాట్యం చేసేది.
ఏప్రిల్ నుంచి జూలై-అబ్బ! అన్నిరోజులు, గంటలు, నిమిషాలు ఎలా గడిపేది! అతన్ని చూడకుండా ఎలా వుండేది? వూరికి వెళ్ళటానికి మనసు మొరాయించింది.
అయినా తప్పదు. తను ఏ సాకు చెప్పినా అత్తయ్య వినదు. నాన్నగారు ఒప్పుకోరు. అమ్మ అంగీకరించదు.
ఆ రోజు సాయంకాలం_
ఇక రేపు ప్రయాణం తప్పనిసరి_
గుండె గుబులు గుబులుగా వుంది.
"రేపు వెళుతున్నారా ?"
చప్పున కనులెత్తి చూసింది. కన్నీటి పొరలతో అతని రూపం స్పష్టంగా కనిపించలేదు.
"వారుణిగారూ!" అతని గొంతులో తడబాటు. ఏదో ఎన్ని యుగాలనుండో కలసివున్న అనుబంధం_ "మీరు రేపు వెళ్ళిపోతే_ నాకు యీ ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తోంది. నేనూ ఓ షెల్లీనై_ ఓ కృష్ణశాస్త్రినై మీపై గేయాలు రాయాలనిపిస్తోంది. గుండె గుబులు గుబులుగా తీయతీయని రాగాలు ఆలపిస్తోంది." అతనో క్షణం ఆగేడు.
"సారధిగారూ!" తన గొంతు తనకే వింతగా వుంది.
"నన్ను చెప్పనివ్వండి. ఐ లవ్ యూ! ఇరవై ఆరేళ్ల వయస్సులో ఏ యువతీ నా గుండెనిలా కదిలించలేదు. మీకంటే అందగత్తెలని చూశానేమో కానీ ఎద స్పందించలేదు. ఇలా మనస్సు లోతులని స్పృశించింది మీరు ఒక్కరే! మీ కభ్యంతరం లేకపోతే_"
ఆ మాటలు పూలజల్లు కురుస్తున్నట్టుగా వినిపించాయి. అవన్నీ వింటూంటే వలపు వసంతం కురిసినట్టుగా వుంది. ప్రేమపల్లకీ ఎక్కినట్టుగా వుంది.
"నేను పెళ్ళిచేసుకుంటాను. మీరు సరేనంటే, మీ నాన్నగారితో చెప్పండి. ఆయన వచ్చినా సరే. లేదా నేనే వస్తాను. రాజు రత్నాన్ని వెదుకుతూ వెళ్ళాలిట! మీకు వర్ణాంతర వివాహం అభ్యంతరం లేదనుకుంటాను. మేమూ శాకాహారులమే! అంతా ఒక కుదురులోని వారమే మనం! ఆచార వ్యవహారాలు కాస్త విభేదిస్తాయి అంతే!"
తను పెదవి కొరుక్కుంది ఆలోచనగా.
"నాకు కానీ కట్నం వద్దు."
తన మనస్సు తేలికపడింది.
"లాంఛనాలు వద్దు. వివాహంలో ఆడంబరాలు వద్దు. సింపుల్ గా-ఆఖరికి సివిల్ మేరేజ్ అయినా సరే! మీ చేయి అందుకో గలిగితే చాలు."
అతనార్తిగా చేయి చాచాడు. చేయి అందివ్వకుండా వుండలేకపోయింది తను.
చప్పున ఆ చేతిని అలాగే తీసుకుని తుమ్మెద మల్లెపువ్వుపై వాలినంత సుకుమారంగా తన పెదాలకి ఆన్చుకుని "థాంక్యూ! ఐ యాం బ్లెస్ డ్" అన్నాడు.
"మా నాన్నగారితో చెబుతాను!"
అస్పష్టంగా కదులుతోన్న ఆ పెదాలవంకే చూస్తూ వుండిపోయాడు.
16
కూతురు చెప్పిందంతా విన్నారు నరసింహగారు.
