ఓ పావుగంట తర్వాత స్టూడియోలో ఉన్నాను.
ప్రకాష్ బాబు ఎదురొచ్చి సెట్లోకి తీసుకెళ్ళాడు.
సరిగ్గా అప్పుడే ఓ దృశ్యం షూట్ చెయ్యటానికి రెడీగా ఉన్నారు.
అసిస్టెంట్ డైరెక్టరుగావును 'సైలెన్స్' అని అరిచాడు.
అంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం.
ఆ సెట్ వ్యవహారం ఓ రౌడీ వేషంలో ఉన్నవాడు హీరోయిన్ మీద పడుతూండటం.... రేప్ సీన్ అని అర్థమైపోయింది.
ఆ రౌడీ హీరోయిన్ మీద పడి రెచ్చిపోతున్నాడు. పైట పట్టుకుని లాగి ఊడదీసి పారేశాడు. మొహంలో మొహం పెట్టి ముద్దులు పెట్టుకునే భంగిమలు ప్రదర్శిస్తున్నాడు. చేతులెక్కడెక్కడో వేసి పారేస్తున్నాడు. చీరె కుచ్చిళ్ళు లాగి పారేస్తున్నాడు. జాకెట్ వెనకనుంచి కత్తితో కోశాడు. ఆమె పెనుగులాడుతోంటే బలవంతంగా ఈడ్చి మంచం మీద పడేస్తున్నాడు. మీద పడి కాళ్ళ దగ్గరా, తొడల దగ్గరా, భుజాల దగ్గరా, ఇంకా కొంచం క్రింద భాగాన నానా గందరగోళం చేస్తున్నాడు.
మధ్య మధ్య 'కట్' అన్న కేక, కొంతసేపటి తర్వాత 'యాక్షన్' అన్నకేక.
యాక్షన్ అనగానే రేప్ సీను మొదలవుతూందన్న మాట.
"షాట్ ఇంకా బాగా రావాలి. ఈ సీను పిక్చర్ కి హైలైట్ కావాలి" అంటున్నాడు డైరెక్టరు.
"నేనెంతయినా కోపరేట్ చేస్తానుగాని ఈ సీను ఇవాళే ముగించుకోండి. రేపు మళ్ళీ అరక్ వ్యాలీ వెళ్ళిపోవాలి. చంద్రోదయావాళ్ళది ఓ సాంగ్ మిగిలిపోయింది" అన్నది హీరోయిన్.
అన్నట్టుగానే పాపం ఒళ్లు దాచుకోకుండా చక్కగా కోపరేట్ చేస్తోంది.
కొంతసేపటికి షాట్ తియ్యటం పూర్తయింది.
"బాగా వచ్చింది బాగా వచ్చింది" అని మురిసిపోతున్నారందరూ.
హీరోయిన్ అలిసిపోయిన శరీరంతో ఓ ప్రక్కనున్న వాలు కుర్చీలోకి వెళ్ళి కూర్చుంది. ఎవరో అమ్మాయి ప్లాస్క్ లోంచి ఏదో జ్యూస్ గ్లాసులో పోసి ఆమె కిచ్చింది. కొంచం కొంచం సిప్ చేస్తూ అలసట తీర్చుకుంటోంది.
డైరెక్టర్ ఆమె దగ్గర కెళ్ళాడు. "సారీ చాలా శ్రమ పెట్టాను" అన్నాడు.
ఆమె నవ్వింది. "రేప్ సీనుల్లో నటించటంకన్నా నిజంగా రేప్ చేయించుకోటమే పదిరెట్లు తేలిక."
"అనుభవ పూర్వకంగా చెబుతున్నారేమిటి?"
"ఎన్ని అనుభవాలు లేకపోతే ఈ దశ కొచ్చానంటారు?"
"అలాంటి అదృష్టం నాకు దక్కలేదు."
"ఈ దశలో.... ఇప్పుడు సమయం మించిపోయింది."
దగ్గర్లోనే నిలబడి ఉండటం వల్ల మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ప్రకాష్ బాబు నా దగ్గర కొచ్చాడు. "రా హీరోయిన్ గార్ని పరిచయం చేస్తాను." అంటూ ఆమె దగ్గరకు తీసుకెళ్ళాడు.
"ఈమె...." అంటూ నా గురించి పరిచయం చేశాడు.
ఆమె గర్వంగా ఉంటుందేమో అనుకున్నాను. కాని చాలా ఆప్యాయంగా "రండి" అంటూ నా ప్రక్కన ఓ కుర్చీ వేయించింది.
ప్రకాష్ బాబు, డైరెక్టర్, ఇతరులు వేరే విషయాలు చర్చించుకోవటానికి కొంచం దూరంగా వెళ్ళటం వల్ల మా ఇద్దరికీ కొంత ఏకాంతంగా ఉండే అవకాశం దొరికింది.
"ప్రకాష్ బాబు నెక్స్ ట్ పిక్చర్ లోకి మిమ్మల్ని బుక్ చేసుకున్నారా?" అనడిగింది.
"ఇంతవరకూ అలాంటిదేం జరగలేదు. మొన్న ఏదో సందర్భంలో పరిచయం కలిగింది. అప్పట్నుంచీ అడుగుతున్నారు."
"మీరు చాలా అందంగా ఉంటారు. చాలా అద్భుతమైన ఫీచర్సున్నాయి. బహుశా ఈ ఫీల్డులో బాగా రాణించవచ్చు."
నేనేం మాట్లాడలేదు.
"మీరేమనుకుంటున్నారు? చేరదామనుకుంటున్నారా?"
ఆమె అంటే నాకు చాలా గౌరవం కలిగింది. హృదయం విప్పుకోవాలనిపించింది.
"జీవితంలో నా అన్న వారెవరూ లేరు. ఎవరు తటస్థపడితే వారు తమవైపు లాక్కుపోదామని చూస్తున్నారు. గమ్యం నిర్ణయించుకోలేక తడబడిపోతున్నారు."
"ఏ దారి నిర్ణయించుకుంటే సుఖం, శాంతి లభిస్తున్నాయని అన్వేషిస్తున్నారా? లేకపోతే ఏదన్నా పేరు ప్రఖ్యాతులూ, డబ్బూ లభిస్తున్నాయని అన్వేషిస్తున్నారా?"
"అన్నీ కావాలన్న ఆరాటముంది."
"అన్నీ దొరకటం అసంభవం. అప్పుడప్పుడూ దొరికాయన్న భ్రాంతి కలిగి, తొందర్లోనే చెరిగిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎంతపైకి పోయినా సుఖమూ, శాంతీ అనేవి దొరకవు."
"మరి కొంతమంది అన్ని విధాలా సంతోషంగా ఉన్నట్లు కనబడతారు."
"అది సంతోషం కాదు. జీవితంలో కొంత సాధించానన్న గొప్ప, నిండుతనం, అహంకారం."
మళ్ళీ ఆమె చెప్పింది. " ఈ ఫీల్డులో కొచ్చేవారు.... అంటే నటీనటుల గురించి నేచెప్పేది. మిగతా శాఖల గురించి కాదు. సినిమాలో చేరదామనొచ్చేవారు రెండు రకాలుగా ఉంటారు. ఈ ఫీల్డు మీద వ్యామోహం కొద్దీ తామంతట తామే వచ్చి కాళ్ళరిగిపోయేలా తిరుగుతూ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించేవారు. రెండోది ఎక్కడో తళుక్కుమని తారసపడి, వాళ్ళంతట వాళ్ళు ఆహ్వానించబడేవాళ్ళు. ఈ రెండు రకాల్లోనూ పైకొచ్చిన వాళ్ళున్నారు. పడిపోయిన వాళ్ళూ ఉన్నారు."
"పైకొచ్చిన కొద్దీ డబ్బు సంపాదన పుష్కలంగా ఉంటుంది. ఈ సత్యానికి తిరుగులేదు. సంపాదించిన వాళ్ళంతా నిలబెట్టుకుంటున్నారా అంటే అది వేరే విషయం. అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మునుపటి నటీనటుల కన్న ఇప్పటి వాళ్ళు గడుసువాళ్లులే. డబ్బు విలువ తెలుసుకుని చాలా ముందు జాగ్రత్తతో దాచేసుకుంటున్నారు."
