Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 34


    "అదికాదు. వాళ్ళకి ఈ యింటి విలువలో భాగం కావాలట. ఇది సులభంగా యాభైవేలు చేస్తుందట... వాళ్ళకీ మనకీ కలసి వాటాలు వేశారు. తలో ఐదువేలూ యివ్వాలట."

    "యిప్పుడు చెరో అయిదువేలూ, మనమివ్వాలా?" నిర్ఘాంతపోయింది.

    "ఊఁ"

    "ఎక్కడినుంచి తెస్తామండీ?"

    "తేలేకపోతే అప్పు తెమ్మంటారు."

    "అప్పుతో మనకేమవసరం?"

    "అలా అయితే, అమ్మెయ్యమంటారు."

    "ఈ యిల్లు అమ్మాలా? ఇది అమ్మేందుకేనా పెద్దలు కట్టించి యిచ్చింది?"

    "ఆ విశ్వనాధం గారినే పిలిపించి మాట్లాడతాను."

    "సరే మీ యిష్టం!"

    "ఇంకా కాఫీతేలేదేం అమ్మాయ్!"

    "ఇదిగో మావయ్యా!" అంటూ కాఫీ తెచ్చింది స్వాతి.

    "స్వాతీ! ఇక చదువమ్మా! ఇప్పుడు మీ అత్తయ్య కూడా అభ్యంతరం చెప్పదులే!"

    అత్తగారివైపు చూసింది స్వాతి_

    "చదువమ్మా!"

    శాస్త్రిగారు కాపితాగి కప్పుకింద పెట్టారు.

    స్వాతి చదవసాగింది_

    "పూజనీయలైన తలిదండ్రుల పాదపద్మాలకి కోసలరాం నమస్కరించి వ్రాయునది_

    "మీకు అందరూ కొరగాని కొడుకులే పుట్టారు. అందరూ దుఃఖాన్ని, బాధనే పంచి యిచ్చారు. ఎవరి సుఖం వాళ్ళు చూసుకున్నారు. అసలు కొడుకులు అంటేనే కష్టం కలిగించేవారు అని కొత్తగా వ్వుత్పత్తి అర్ధం చెప్పాలేమో మీరు.

    "లేదా, పుత్రులు అంటే పున్నామనరకం నుంచి తప్పించేవారని కదా అర్ధం. పున్నామ నరకాన్ని పుట్టుకతోనే లేక ఆ సంతానం బ్రతికివుండగానే అనుభవించేట్లు చేసి, ఆ నరక బాధనుండి తప్పించేవాళ్ళని అర్ధం తీసుకోవాలేమో!

    "మీకు విసుగ్గా వుందికదూ! పోనీలెండి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను స్టాంపు వెండరుగా జీవితాన్ని ప్రారంభించాను. ఈ కమీషన్ డబ్బులు ఇప్పుడు ఎక్కీతొక్కీగా కనిపిస్తున్నాయి. కానీ రేపు నాకు పెళ్ళాం పిల్లలు, సంసారం ఏర్పడితే ఈ డబ్బులు ఏ మూలకి చాలుతాయి. ఇవి పొలం పుట్రా వుండి సంసారం చేసుకునేవారికి చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా ఉపయోగపడతాయి అంతే!

    "బి.ఏ. చదివి వుండి ఇలా కావటం నాకిష్టంలేదు.

    "అందుకే మొన్న హైద్రాబాదునుంచి ఇనస్పెక్షన్ కి వచ్చిన రిజిష్ట్రారు ఒక మార్గం చెప్పారు. ఆయన కూతుర్ని పెళ్ళిచేసుకుంటే ఆయన అక్కడే ఉద్యోగం ఇప్పిస్తారట. పైగా కట్నం కూడా ఇస్తారు. మీరు దేనికీ ఒప్పుకోరు.

    "ఎందుకంటే అయనగోత్రం మన గోత్రం ఒకటే! సగోత్రీకుల పెళ్ళిళ్ళు మీరు అంగీకరించరు. అందుకే నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను. మీకు ముందుగా చెప్పలేకపోయాను మన్నించండి.

    "మీకీ వృద్దాప్యంలో కష్టం కలిగిస్తున్నందుకు మన్నించండి. ఏం చేయను! ఎడారిలాంటి ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఒయాసిస్. ప్రాణాలు దక్కించుకోవాలంటే అంతకంటే మరో శరణ్యం లేదు. మీకు కోపం తగ్గితే ఎప్పుడైనా వచ్చి చూస్తాను. లేదా ఇవే కడసారి నమస్కారాలు."

    ఉత్తరం చదవటం ముగించింది స్వాతి.

    శాస్త్రిగారు నిట్టూర్చారు_

    పార్వతి భర్తకేసి చూసి-

    "అందరూ ఇలా చేస్తున్నారేమిటో? ఇది వాళ్ళ కర్మా? మన కర్మా?" అన్నది బాధగా.

    "పార్వతీ! మనం స్వచ్చంగా నీతిగా వున్నాం. మరి ఇలాంటి పిల్లలు పుట్టారంటే నా రక్తదోషం అనుకోనా? నీ గర్భదోషం అనుకోనా?"

    "ఇది మన దోషం కాదండి_వాతావరణ దోషం. ఇప్పుడు గాలి చెడిపోయింది. నీరు చెడిపోయింది. చెడని అగ్నీ, ఆకాశం కూడా చెడిపోయాయి. పంచభూతాల్లో నాలుగు భూతాలు కల్తీ అయిపోయాయి.

    "మీరు వేదాంతం చెప్పుకుని తృప్తిపడతారు."

    "వేదాంతం కాదే పిచ్చిదానా? ఇక మనుషులలో నీతి, నిజాయితీ, ప్రేమ, విశ్వాసం, అనురాగం, ఆప్యాయత ఎక్కడ నుంచి వస్తుంది? అంతా స్వార్ధం...స్వార్ధం..."

    ఈ మాటలు శాస్త్రిగారు అనాలనుకున్నారు. కాని

    "నిజమేనేమో పార్వతీ! లేకపోతే ఈ రోజు ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. అవే కారణమేమో?"

    పార్వతి మాట్లాడలేదు.

    "స్వాతీ! వాడు హైద్రాబాదు అడ్రసు ఇచ్ఛాడామ్మా? ఆశీస్సులైనా పంపుదాం. ఎక్కడున్నా ఎలా బ్రతికినా వాళ్ళని మా పిల్లలనే అంటారు కదా! సుఖంగా నయినా బ్రతకనీ"

    "లేదు మామయ్యా! అడ్రసు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ రాస్తాడేమో?"

    "పోన్లే!" అని నిట్టూర్చారు.

    అంతలో శ్రీవిద్య వచ్చింది.

    తల్లీదండ్రీ, వదినా కూర్చుని వుండటం చూసి మవునంగా లోపలికెళ్ళింది శ్రీవిద్య.

    "పార్వతీ మనలో దోషం వుంటే శ్రీవిద్య మన గర్భవాసాన జన్మించేది కాదు. నిజమే! నువ్వు అన్నట్లు_ వాళ్ళలో, వాళ్ళ చుట్టూ దోషం వుంది. అందుకే మనల్ని విడిచిపోయారు. పోనీలే, ఎందరు చెడినా స్త్రీ చెడనంత వరకూ, భారతీయత, హైందవీయత చెడదు, మాసిపోదు."

    ఆ మాటకొస్తే సాంప్రదాయాన్ని నిలిపేది ఆడవాళ్లే మావయ్యా"! స్వాతి అంది.

    "అవునమ్మా పూజలనీ నోములనీ, ఆచారాలనీ వ్రతాలనీ మన సంప్రదాయాన్ని భద్రంగా కాపాడేది ఆడవాళ్లే"

    అంతలో శ్రీవిద్య వచ్చింది.

    "విద్యా" ప్రేమగా పిలిచారాయన.

    "ఏం నాన్నా!"

    'నువ్వెళ్ళి విశ్వనాధంతో ఒక మాటు రమ్మని చెప్పి రావాలమ్మా"

    "అలాగే నాన్నగారూ!" అని వెళ్ళిపోయిందామె.

    "ఈ రోజు రచన చెయ్యలేం స్వాతీ!" అన్నారు కోడలి వంక చూస్తూ బాధగా.

    "పోన్లెండి మామయ్యా! కొంచెం మనస్సు శాంతంగా వున్నపుడే చెపుదురుగాని" అంది స్వాతి తనూ లేస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS