10
పాత పెంకుటింట్లో ఒక గదిలో అద్దెకుండి చదివేవాడు రామదాసు.
ఇల్లు గలాయన బడిపంతులు.
అతి మంచివాడాయన. అందర్నీ అతిగా నమ్మేసే గంగిగోవు. ఆయన పేరు గంగాధరం.
గంగాధరం గారికి కూతురు సీతంటే పంచప్రాణాలూను.
సీతని పూవులా పెంచి, చదివించి, యోగ్యుడైన వరుణ్ణి వెతికి, ఆకాశమంత పదింట్లో, భూదేవంత మంటపంలో సీతనిచ్చి పెళ్ళిచేసి, వాళ్ళకి పుట్టే బంగారు బొమ్మల్నెత్తుకుని ముద్దులాడి వగైరా వగైరా ఆశల పట్ల గంగాధరానికి అమితమైన ఆసక్తి.
సగం రోజులు ఈ ఆశల్తోటే గడిపేవాడా పెద్ద మనిషి.
సీత ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ రామదాసు సీత వాళ్ళింట్లోనే వుంటూ, బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుకుంటున్నాడు.
పుట్టీ పుట్టటంతోనే రాజకీయాలూ, ఎత్తుగడలూ వెంటబెట్టుకు పుట్టాడు రామదాసు.
గంగాధరాన్ని బాబాయంటూ, వాళ్ళావిణ్ణి పిన్నీ అంటూ వరసలతో పిలుస్తూ సీతని మాత్రం, 'సీతగారూ' అని మాత్రం పిలుస్తుండేవాడు రామదాసు.
బాబాయి, పిన్నిలను గెలిచాడు. వాళ్ళిద్దరి దగ్గర్నుంచీ గౌరవాన్నీ, ఆదరాన్నీ సంపాయించుకున్నాడు.
'రాముడు మంచివాడు. ఇంటిదగ్గర తలవంచి మళ్ళా కాలేజీలోనే తలెత్తే కుర్రాడు రాముడు. అతని చదువేమిటో అతని కథేమిటో తప్పించి ఇతర వ్యవహారాలకి పోయే కుర్రాడు కానేకాడు.' అని బాబాయి, పిన్నిలు అనుకోడం రామదాసుకి బాగా తెలుసు.
మంచీ చెడులపట్ల రామదాసు ఒక థియరీని తయారు చేసుకున్నాడు ఆ రోజుల్లోనే....
దుష్టపాత్రలకి సుఖాల్లేవని అతనికి తెలుసు, దుష్టుడని తెలుస్తే మంచినీళ్ళివ్వరు తోటి మనుషులు. (వాళ్ళూ దుష్టజాతివారైనా!) దూరం దూరమని ఈగని తోలినట్టు తోలిపారేస్తారు.
మంచి చేయకపోయినా, మంచి (స్వభావం) ముసుగులో దాక్కోడం వల్ల చాలా సుఖాలుంటాయని అతను భావించాడు.
ఎన్ని రకాలుగా ఆలోచించినా, దుష్టుడికంటే మంచి వెధవ ప్రమాదమైనవాడు. దుష్టుడు ప్రజల్ని భయపెట్టి సాధించలేని కార్యాలెన్నింటినో, మంచి వేషం కట్టిన మనిషి అతి సులువుగా సాధించగలడు. చాలా పవర్ ఫుల్ విషాన్ని పాలల్లో కలిపేసి 'తాగమ్మా పాలు' అని మంచివారంటే అవతలివాడు కళ్ళు మూసుకుని తాగేస్తాడు. తాగిం తర్వాత మరింక కళ్ళు తెరిచే పనే వుండదు. ఈ పని దుష్టుడిచేత కాదు. దుష్టుడు ప్యూర్ పాలనే యిచ్చినా, శంకించి తాగని మూర్ఖులు చాలామంది బతుకుతున్నారాయె!
ఇన్నీ గమనించినమీదట రామదాసు మంచి వేషం కట్టాడు. చాలాకాలం సీతను చూసీచూడనట్టు గడిపాడు. బి.ఏ. పరీక్షలు పూర్తి చేసింతర్వాత ఇంటికెళ్ళే ముందు అతను చేయవలసిన పనిని చాలా హుందాగా చేసేసి, చేతులు రెండూ దులుపుకున్నాడు.
బాబాయి పిన్నీ పొరుగూరు వెళ్ళిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నాడు రామదాసు.
రామదాసు గదికి తలుపులు రెండున్నాయి. ఒకటతను వీధిలోకి వెళ్ళేందుకూ మరొకటి ఆ యింట్లో పిన్నీ వాళ్ళ వాటాలోకి వెళ్ళేందుకూను.
రెండో తలుపు (పిన్నీ వాళ్ళ వాటాది) అస్తమానం మూసే వుంటుంది. మొదట్లో ఆ తలుపుకి గొళ్ళెం పెట్టి జాగ్రత్త పడ్డాడు బాబాయి. తర్వాత్తర్వాత రామదాసు విషం కలిపిన పాలు సిద్ధం చేసిన్నాటినుంచీ, ఆ తలుపుకి గొళ్ళెం తొలిగించి "నీలాంటి మంచి కుర్రవాళ్ళకి తలుపులూ, గొళ్లాలూ భావ్యం కావునాయనా!" అనేశాడు బాబాయి.
గనక, ఆ తలుపుని ఇష్టమైనపుడు తెరిచే ఏర్పాటుకి ఏ ఆటంకమూ లేకపోయింది.
ఆ రాత్రి____
వేసవైనా అదృష్టవశాత్తు వర్షం గొడవ వచ్చింది. ఆ రాత్రి చాలా చీకటిగానూ వుంది. సరిగ్గా ఆ రాత్రే కరంటూ పోయింది.
రాత్రి చీకటిగా వుంది.
చీకటి రామదాసుని కుదిపి చూసింది.
రామదాసు పడుకున్న మంచంమ్మీదే పిడుగు పడినట్టు గావుకేక పెట్టాడు. ఆ ఒక్క కేకకే పక్క వాటాలో వున్న సీత ఉలిక్కిపడి నిద్రలేచి స్విచ్ వేసింది వెలుతురుకోసం. దీపం వెలగలేదు. అందుచేత తనక్కడే నిలచి___
"ఏవఁయ్యింది?" అని అడిగింది.
రామదాసు గొంతులో గుండె నిలిచింది.
"ఒకసారి తలుపు తెరవండి సీతగారూ!"
ఈ గదిలో నాకేవిఁటో భయంగా వుంది," అన్నాడు.
"భయమా? ఇంకా నయం! మగధీరులు మీకేఁటి భయం?"
అని నవ్వుకుంటూ పిచ్చి పిల్ల తలుపు తెరిచింది.
ఆకలితో వున్న పులి ఆ గదిలోకి, సీత గదిలోకి చేరింది. చాలా అమాయకంగా గర్జించింది?
"నిజమండీ బాబూ! నేనొక్కణ్ణి ఆ గదిలో పడుకునేందుకు భయపడి చచ్చేను. అవునూ, మీకు భయంలేదా!....ఎక్కడున్నారండీ? వెధవది. సమయానికి కరెంటు గూడ పోయింది. మాటాడండి సీతగారూ. నాకు దడగా వుందండి!"
సీత అప్పుడుగూడ హాయిగా నవ్వేసింది. నవ్వు ఆగిపోయిం తర్వాత చేతిలో కొవ్వొత్తితో ప్రత్యక్షమయ్యింది.
"ఇంత భయమైతే ఎలానండి దాసుగారూ?" అన్నదామె.
"ఇంక భయంలేదు లేండి మీ గదిలోకి వచ్చేశానుగా ఇంకేం భయం నాకు?"
"అంటే? ఇక్కడే. ఈ గదిలోనే పడుకుంటారా?"
"మరేం చెయ్యమంటారు? ఇంతింట్లో మనిద్దరమే వున్నామాయె! అలాంటప్పుడు మీరో గదిలో, నేనో గదిలో అయితే యింక చెప్పక్కర్లే___ఉదయం లేచాక నా శవాన్ని చూస్తారు. కాదనకండి!" పులి యింకా అమాయకంగానే వేడుకోవటంతో పిల్ల మళ్లా నవ్వేసి___
"సర్లెండి. పడుకోండి. నిద్ర పట్టేందుకు కథ గూడ చెబుతాను. దెయ్యం కథ చెప్పన్లేండి. రాజుగారి కథ చెబుతాను. అదుగో ఆ మడత మంచం వాల్చుకుని పడుకోండి....ఉదయం నాన్నా వాళ్లు వస్తే మీ భయం గురించి వాళ్ళకి చెప్పమంటారా మరి?"
