"అయినా ఆమె ఏమి అందం! ఆహా! ఆహా!"
"నువ్వు చూశావా శేఖర్?"
"ఆహా! మావా! ఓ రోజు తలంటు పోసుకుని నుదుట కాసంత ఎర్రటి బొట్టు పెట్టుకుని, తెల్లచీర కట్టుకుని తలారుకుంటూ కనిపించింది. ఎలా వుందో తెలుసా! మగువ మన్మధ కేళికా మందిరము నుండి వెడలె అన్నట్టుగా వుంది. అప్పుడు ఆ మందిరంలో చౌదరి వుండి వచ్చాడా అనిపించింది.'
"శేఖర్!" చౌదరి గొంతు తడారిపోయింది.
"అవును మావా! అప్పుడు కెమెరా లేకపోయింది అనిపించింది. నా మాట విను. బాబాజీని మనింటికి మకాం మార్పించు. పదిరోజులు పూజ చేయించు. రోజు తీర్ధం పంపించు. బాబాజీ తీర్ధం కాదనలేదు కదా! పదకొండోరోజు రాత్రి పదకొండుగంటల కల్లా నీ యింటికి కాలు అందెలు గల్లుగల్లు మనగా కలహంస నడకలతో వచ్చేస్తుంది."
కొండప్ప నాయుడి కళ్ళల్లో ఆశ మెరిసింది. బాబా రోజు పాలకీ, పళ్ళకీ నేతికీ అయ్యే ఖర్చు ఒక్కోసారి అమ్మో అనిపిస్తోంది. పొమ్మనలేడు, ఉంటే భరించలేడు అందుకే చూచాయిగా శేఖర్ తో ఓసారి అన్నాడు, ఆ బరువు ఎలాగైనా తగ్గించు అని అది గుర్తుంచుకున్నట్టు శేఖర్ చౌదరిపై పట్టిస్తూ ఉంటే అతనికి ఆనందంగా వుంది.
"కరెక్ట్! శేఖర్ చెప్పింది రైటు" అన్నాడు నాయుడు.
మాటల మధ్యలో శేషయ్య షో చేశాడు.
నాయుడు కౌంట్ తీరిపోయిందన్నాడు, ముక్కలు లెక్కెట్టకుండానే శేషయ్య కిమ్మనలేదు. అది అతనికి అలవాటే.
"చౌదరి ! బాబాజీని రేపే మాకాం మార్పించు ," శేషయ్య వైపు అదోలా చూశాడతను.
"ఖర్చుకీ వెనకాడుతున్నావా?"
"ఖర్చుకా! ఆ మాటకొస్తే అతనింట్లో ఖర్చు ఎవరిట్లో వుంది? ఒక్కసారి జనార్ధన్ మద్రాసు వెళితే వేలకువేలు అవుతాయి."
ఆ మాటలకి వులికిపడ్డాడు శేఖర్.
ఆ వులికిపాటు గమనించాడు శేషయ్య. అతనికి కారణం అర్ధం కాలేదు.
"చౌదరీ మామా! యింటికి వెళదాం పద!"
"కుర్చోనియ్ శేఖర్!" అన్నాడు రెడ్డి.
"నీకేం మీరు ముగ్గురూ చాన్సు మార్చి ఛాన్సు షో చేస్తున్నారు. మామ ఒక్కసారయినా షో చెయ్యలేదు."
"డబ్బు పోతుందని బాధా!"
"ఉండదా మరి?"
"శేఖర్! డబ్బు ఎక్కడికి పోతోందిరా!" నవ్వుతూ అడిగేడు శేషయ్య.
మీ ముగ్గురి జేబుల్లోకి!"
"అంతే కదా! ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. మన అయిదుగురం పంచ పాండవుల్లా వున్నాం. మన కులాలు వేరు అయినా అన్నదమ్ముల్లా ఈ వూర్ని పంచుకుని బతుకుతున్నాం - మన మతం ఒకటే - ఊరిని సాధ్యమైనంత దోసుకోవటం - ఆ డబ్బు మనం సమానంగానో ఎలానో ఎలానో తినేస్తున్నాం. ఈ డబ్బు మనల్ని దాటి వెళ్ళటం లేదు. అలాంటప్పుడు ఎవరు గెలిస్తేనేం!"
నాయుడు నవ్వేడు ఆ మాటలకి. "బావుంది. మనం పాండవులం అయితే ద్రౌపది ఎవరు!" అన్నాడు.
"ఇంకెవరు భార్గవి - అన్నాడు శేఖర్.
"తప్పు - తప్పు - సుభద్ర అర్జునుడికిలా ఆమె చౌదరికే!
"ఊరి వుమ్మడి ఆస్తి భార్గవి - ఈయన యతి వేషం వేశో - యతినో - బాబానో ఆశ్రయించో సుభద్రా పరిణయంలో లాగా భార్గావి ప్రణయంలో విజయం సాధిస్తే కదా?
చౌదరి గుర్రుగా చూశాడు. "సరే! రేపే బాబాకీ మాకం మార్పు."
"హమ్మయ్యా!" నిట్టూర్చాడు శేఖర్.
"ఏం!" అడిగాడు ధర్మారెడ్డి.
చౌదరి షో చేశాడు తొలిసారిగా.
"అదిగో చూశావా! బాబాజీగారిని ఆహ్వానిస్తూనే మూడు కౌంట్లు కొట్టేశాడు." అన్నాడు నాయుడు.
చౌదరి మాట్లాడలేదు.
