క్షణంపాటు నివ్వెరపాటుతో నిల్చుంది తను. అంతలో అతని భావం అర్థమై "థాంక్స్" అంది చిరునవ్వుతో.
"మరో మాట చెప్పనా?"
"ఏమిటి?"
"ఈ వూళ్ళో మీలాగా జిగిబిగి వున్న వారెవరూ లేరు."
"ఇక్కడి స్త్రీల అందచందాలు చూట్టమేనా మీ ఉద్యోగం?"
అతను కొద్దిగా తబ్బిబ్బయ్యాడు.
అతను యిబ్బంది పడిపోవటం గమనించి తనే అంది. "మీరు చేసిన కామెంట్ కి థాంక్స్. మీ అందమైన మాటలకి డబల్ థాంక్స్."
"థాంక్యూ! షెల్లీ మిమ్మల్ని చూసివుంటే యింకో మంచి పద్యం అందేది. కాళిదాసు చూసివుంటే మరో శాకుంతలం వెలిసేది. జయదేవుడి కంటపడివుంటే మరో అద్భుతమైన_ యిప్పుడున్న వాటి అన్నిటికి తలమానికంగా మరో అందమైన అష్టపది ఆయన కంఠాన వెలువడేది."
ఆ మాటలకి వారుణి పులకించిపోయింది. మధురమైన భావనకి జోహారులర్పించింది మనసులోనే.
"బాగా పొగడుతారు. మాటల గారడి చేస్తారు" అంది.
"ఇదంతా అతిశయోక్తి అనుకుంటున్నారా? నామీదొట్టు. కేవలం స్వభావోక్తి. మీరెప్పుడూ అద్దం చూసుకోలేదా? మీ ఆత్మీయులెవరూ మీ గురించి చెప్పలేదా?" క్షణమాగి అన్నాడు_ "చెప్పలేదంటే మీకెవరూ ఆత్మీయులు లేనట్లే_"
ఫక్కున నవ్వేసింది తను.
"చూడండి! ఆ ముక్కుని అలా అలా అందంగా కొనదేలి నువ్వు పువ్వులా మిలమిలలాడేలా తీర్చిదిద్దటానికి బ్రహ్మ ఎంత శ్రమించి వుంటాడో. బహుశా వీణాపాణి అయిన సరస్వతి తన కచ్ఛసిని స్త్రీగా పుట్టిస్తే యిలా వుంటారేమో! మీ నరాలన్నీ వలపవీణ తీగలై మీ కళ్ళు ప్రేమసితారా గమకాలై మీ రక్తంలో రాగఝరులు ప్రవహిస్తూ ప్రేమని పలికిస్తూ వుంటారు. క్షమించండి. లిటరేచర్ చదువుకున్నాను. కాస్త చనువు తీసుకున్నానా?"
అతనలా అంటుంటే తన ఎద పులకించింది. పూల బాణాలతో రివ్వురివ్వున సారించి గురిపెట్టినట్టుగా వుంది.
"ఐ లైక్ యూ" అన్నాడతను.
"థాంక్స్"
ఇలాంటి మాటలు ఎన్నిసార్లు విన్నారో మీరు?"
"ఊహూఁ ఏ మగవాడిని అడుగు దూరానికి రానివ్వలేదు. నిప్పురవ్వని చూసినట్లుగా జంకేవారు. ఇంకా నోరు తెరచి మాటాడటమా!"
"ప్రొఫెసర్స్...రీడర్స్__"
"నన్ను చూసి అగ్నిశిఖ అనేవారు. ఎక్కడ వైస్ ఛాన్సలర్ కి రిపోర్ట్ యిస్తానోనని భయపడేవారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ నన్ను చూసి బారెడు దూరంలో వుండేవారు."
"అయాం లక్కీ! నాకెందుకో మీరంటే అలాంటి భయం కలుగలేదు. సరికదా గౌరవం ఏర్పడింది." అతను నవ్వేడు.
"అయామ్ ఆల్సో లక్కీ! మీవంటి సహృదయులు అరుదుగా వుంటారు. ఈ ఎనిమిది నెలల పరిచయంలో మిమ్మల్ని బాగా స్టడీ చేశాను."
"ధన్యుడిని."
"మీది ఇంగ్లీషు ఎమ్మే కదా! తెలుగు దంచేస్తారే."
"నేను తెలుగు వాడినని మరచిపోకండి. ఏమంటే తెలుగు ఎమ్మేలకి గిరాకీ లేదని ఇంగ్లీషు చేశాను. కాని నా అభిమానమంతా తెలుగు సంస్కృతాల మీదే. లీజరవర్న్ లో నేను తెలుగు డిపార్ట్ మెంట్ కే వెళతాను."
"తెలుగదేలయన్న దేశంబు తెలుగు_ అవునా?"
"దేశ భాషలందు తెలుగు లెస్స."
అలా అలా కబుర్లు తెలుగుమీదికి మళ్ళాయి. అంతే ఆ రోజునుంచీ రోజుకి ఒక గంటయినా సాహిత్యంలో కాలక్షేపం జరిగేది.
హార్జీ, మాం, ఓహెన్రీ, షేక్ స్పియర్, షా, రస్సెల్, హేరాల్డ్ రాబిన్ సన్ ల సరసనే రాయలు, పెద్దన, నన్నయ, తిక్కన, పింగళి సూరన, రామకృష్ణుడు, ధూర్జటి, కృష్ణశాస్త్రి చోటుచేసుకునేవారు.
