శమంతకమణిగారు అపూర్వమైన వ్యక్తిలాగానే కనిపించింది. ఆ క్షణంలో ఆమె నభినందించకుండా ఉండలేకపోయాను.
"సుకుమార్! నీకెలా ఉంది? బాగా దెబ్బలు తగిలాయా?"
"కొంచం. ఇప్పుడు ఫర్వాలేదు."
"సుకుమార్ నీ దగ్గరకొచ్చి జుట్టు సవరించాలని ఉంది. అలా చెయ్యనా?"
"ఒక స్త్రీ అలా అనుకున్నదంటే మగాడికి అంతకన్న అదృష్టమేముంటుంది?"
లేచి నిల్చుని అతని దగ్గరగా వెళ్ళి క్రాపింగ్ సవరిస్తున్నాను.
తల నిమరటం.... ఇదివరలో కొంతమంది పురుషులు నన్నిలా చేసినప్పుడు నా ఫీలింగ్స్ వేరు. కాని ఆహ్వానం ఇటునుంచి వచ్చినప్పుడు ఓ పవిత్రత సంతరించుకున్నట్లయింది.
సుకుమార్ నేను నీ మనిషిని. నన్ను నీ దగ్గరకు తీసుకో. కౌగిలించుకో అని అంతరాత్మ ఘోషిస్తున్నది.
శరీరంలోకి అతన్నుంచి ఏదో శక్తి ప్రవహిస్తూన్నట్లయింది. ట్రాన్స్ మిషన్ అంటారు ఇదేనా!
అతను కూడా ఏదో మైకంలోకి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది.
అతని తల నా గుండెలమీద సేద తీర్చుకుంటోంది. కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఈ శరీరాలు ఎంత అసహ్యమైనవో అంత గొప్పవి కూడాను. రిలీఫ్ అన్నది ఎంత అవసరమో ఆ సమయంలో తెలుస్తోంది.
ఆ రోజంతటితో ఆగిపోయింది.
తర్వాత అయిదారు రోజులదాకా సుకుమార్ కనిపించలేదు.
మనిషి మనసు చాలా స్వల్ప వ్యవధిలో రకరకాలుగా మారుతూ ఉంటూంది. ఒక్కొక్కప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒంటరితనం భరించటం దుస్సహంగా ఉంటుంది.
అంతకు మునుపు ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉండేదాన్ని. మనుషుల్తో కలిసి ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఉండేదానిని.
సుకుమార్ తో మానసికంగా అంత దగ్గరకొచ్చాక ఒంటరితనం భరించలేకపోతున్నాను. ఫ్లేటోనిక్ లవ్ అనే దాన్ని గురించి కొంతవరకూ విని ఉన్నాను. వేదాంతంలో అనుభవానికి ప్రాముఖ్యత లేకుండా థియరీలలో చెవులు హోరెత్తించేసి చివరికెలా నిస్సారంగా మిగిలిపోతుందో అనుభవం, స్పర్శ కోరుకోని ప్రేమ నిస్సారమైన భ్రమగా మిగిలిపోతుంది.
అతనిల్లెక్కడో కనుక్కోలేదు. పెళ్ళయిందో లేదో తెలుసుకోలేదు. అతన్ని లైక్ చేశానంతే. మిగతా విషయాల్ని గురించి నా మనసు పట్టించుకోలేదు.
సుకుమార్ గురించి ఎదురుతెన్నులు చూస్తూ రోజులు గడుపుతుంటే ఒకరోజు ఇంటిముందు కారాగిన చప్పుడయింది. శమంతకమణి వచ్చిందేమోననుకున్నాను. తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరొస్తారోనని చూస్తున్నంతలో ప్రకాష్ బాబు లోపలి కడుగుపెట్టాడు.
ఆ రోజు శమంతకమణి ఇంట్లోని పార్టీలో పరిచయమైనా సినీ నిర్మాత.
లేచి నిలబడి "రండి" అన్నాను మర్యాదగా.
"ఏమిటా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ నీకోసం వెదుక్కుంటూ వచ్చాడని ఆశ్చర్యపోతున్నావా?" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
"ఆశ్చర్యపోలేదు" అన్నాను నవ్వి.
"ఎందుకని?"
"సామాన్యమైన స్త్రీకి కూడా అపురూప సంఘటనలు జరగటం సృష్టిలో ఉన్న విశేషం. అందుకని...."
కొంచమాగి "ఇంతకీ ఎందుకొచ్చాననుకుంటున్నావు?" అన్నాడు.
"మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తూందండీ."
"అసలు నేను రాకుండా మా ప్రొడక్షన్ మేనేజర్తో కబురు చేద్దామనుకున్నాను. ఇలాంటి పిలుపుకోసం పడిగాపులు కాచే అమ్మాయిలెందరో ఉన్నారు. కానీ నీలోని పెంకెతనం, ఆ రోజు కొంత పసిగట్టాను. అలా చేస్తే రావేమోననిపించింది."
నేనేం మాట్లాడలేదు.
"కొత్తగా సినిమా తీస్తున్నాను. హీరో చాలా ప్రముఖుడే ఉంటాడు హీరోయిన్ గా నిన్ను బుక్ చేద్దామనుకున్నాను."
అదిరిపడ్డాను. ఉన్నట్లుండి ఇంత ఆఫరొచ్చేసరికి ఏం చెప్పాలో తోచలేదు.
"మాట్లాడవేం?"
"నాకు నటన చేత కాదండీ. డ్యాన్సులూ అవి అస్సలు రావు."
"వాటి విషయం మేము చూసుకుంటాం. ఇదంతా స్పీడుయుగం. నీ ట్యాలెంట్ ని ఎలా వెలికి తియ్యాలో, అవన్నీ నిమిషాల మీద బయటకు విరజిమ్మబడతాయి. నీలో ఉన్న నీకు తెలీని అందాలు కూడా సినీ కెమేరా బయటకు విరజిమ్మేస్తుంది. నువ్వు చెయ్యలేనివి కూడా నీ యాక్షన్ గా రూపొందిస్తారు మా డైరెక్టర్లు. ఈ రోజున రెండు గదులింట్లో కాపురం ఉన్నదానివి రెండేళ్ళలో రెండంతస్థుల మేడలో ఉంటూ లక్షలు లక్షలు సంపాదిస్తూ విలాసాలతో ఊగుతూ ఉంటావు. ఏమంటావు?"
నేనే మాట్లాడకుండా ఆలోచిస్తూ ఊరుకున్నాను.
"అందం అందరికీ ఉండదు. ఉన్న అందాన్ని సార్థకం చేసుకోటం ఏ కొద్దిమందికో చేతనవుతుంది. ఓ రంగుల ప్రపంచంలో వెలుగులు వెదజల్లుతూ జీవించే వరం నీకు లభిస్తుంది."
మనిషిలో ఏ ఆకర్షణా లేకుండానే ఏవేవో శక్తులు అటూ యిటూ యీడ్చుకుపోతూ ఉంటాయి. ఇహ ఆకర్షణ ఉన్నప్పుడు తమవైపు యీడ్చుకు పోటానికి ఎన్ని శక్తులు బలంగా పని చేస్తూంటాయో.
* * *
ప్రకాష్ బాబు చెప్పినట్లు మర్నాడే ఇంటికి కారొచ్చింది.
