Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 33


    "ఒక పర్యాయం నాన్నగారిని చూసి ఆ తర్వాత నోటీసిస్తే బావుంటుందేమో?" ఆశ చావక మళ్ళీ అడిగాడు.

    "ఊ హూ ఏం ప్రయోజనం లేదు. నువ్వు కాని పిల్లని చేసుకున్నావని యింటివైపే రానివ్వరు. నేను భార్య మాటవిని అత్తవారింటికి వెళ్ళానని గేటవతలే నిలబెట్టేస్తారు. అందుకే ఈ నోటీస్" తొణక్కుండా సమాధానమిచ్చాడు జానకిరాం.

    అయోధ్యరాం మాట్లాడలేదు. తండ్రి గంభీర వదనం తలుచుకుంటుంటే మనసంతా వికలమైపోయింది.

    "మరి వస్తాం!" అని సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరూ. అనుకున్న పని జరిగిందన్న తృప్తి ఇద్దరి ముఖాల్లోనూ నిండివుంది.

    నిట్టూర్చాడు అయోధ్యరాం. తనూ వాళ్ళతో చేతులు కలపాల్సి వచ్చినందుకు విచారించాడు. అసలే తను కులాంతర వివాహం చేసుకున్నందుకు కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు. ఇది మరో షాక్! కొడుకుల్ని కన్నందుకు ఆయనకు మనశ్శాంతి లేదు.

    ఏడుగురిని కన్నా ఒక్కరూ మనశ్శాంతి కలిగించలేదు. ఎదుకిలా జరిగింది? ఎక్కడుంది లోపం? అది ఈ తరం మహత్యమా? నవతరంలోని నూతనభావాలు యివేనా? తల్లిదండ్రుల మనసుల్ని నిర్ధాక్షిణ్యంగా హింసించటమేనా?"

    ఇక బంధాలకి అనుబంధాలకి, ప్రేమలకి, ఆప్యాయతలకీ స్థానం లేదా? అతని మనసు రకరకాల ఆలోచనలతో నిండిపోయింది.


                               *    *    *


    ఆరోజు సాయంకాలమే అడ్వకేట్ కనిపించి హెచ్చరించాడు శాస్త్రిగారిని. విషయం చెప్పకుండా నోటీస్ అందిందా? అని అడిగాడు. అసలు సంగతి తెలియని శాస్త్రిగారు మామూలుగా మాట్లాడారు.

    అయితే మరుసటిరోజు ఆయన స్కూల్లో వుండగానే నోటీస్ వచ్చింది. నిన్న లాయర్ అడగటం నేడు నోటీస్ అందటం అంతా ఆయనకి వింతగా అనిపించి ఏవిటా? అని విప్పి చూశారు.

    నోటీస్ పూర్తిగా చదివి "వెధవలు!" అని తిట్టుకున్నారు.

    మరి ఇక స్కూలులో వుండలేక హెడ్మాస్టరు దగ్గరకెళ్ళి పర్మిషన్ అడిగారు.

    ఆయన పురాణం చదివేసి "శాస్త్రిగారూ! మీకు వయసైపోతోంది. ఇంకా ఏడాదికి రిటైరైపోతారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది. మొన్న ఆ మధ్య వారంరోజులు సెలవు పెట్టారు.

    "ఇలా చేస్తే ఎలా? టెన్త్ క్లాసు సిలబస్ పూర్తి కావద్దా? వాళ్ళ పాఠాలు దెబ్బతినవా? ఈ సంవత్సరం బ్యాచ్ బాగా వుంది. మంచి రిజల్ట్స్ వస్తుందని అనుకుంటున్నాం. మీరే ఆలోచించండి. చూడండి అప్పుడే మీకు కోపం వస్తోంది."

    "కోపం ఎందుకులెండి"

    "మీరీలాగంటే నేనేం చెప్పగలను? మీరు స్థానికులు పలుకుబడి వున్నవారు__మేం ఎక్కడినుంచో వచ్చాం. ఆ తరువాత తమ యిష్టం..."

    శాస్త్రిగారికి హెడ్మాస్టరుగారి నర్మగర్భ వ్యాఖ్యలు శూలాల్లా దూసుకుని వెళ్ళాయి. మౌనంగా వెనుదిరిగారు.

    గడపదాటుతుండగా "పోనీ వెళ్ళిరండి, మీకు క్లాసులు లేవేమో కదా?" అన్నాడు.

    శాస్త్రిగారికి వెనుదిరిగి ముఖం మీదే కడిగేయాలని పించింది. కాసీ ఓపిక లేక అలాగే వెళ్ళిపోయారు.

    ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి కూడా అలాగే వుంది. పార్వతి కంగారుగా వుంది. స్వాతి నచ్చచెబుతోంది.

    "ఏమైంది?" గంభీరంగా అడిగారు.

    "ఏం లేదులెండి" మాట తప్పించబోయిందామె.

    "ఫర్వాలేదు చెప్పు"

    "ఈ వుత్తరం చూడండి"

    "నువ్వు చదువమ్మా! స్వాతీ!" చదివే ఓపిక కూడా లేనట్లుగా కుర్చీలో కూర్చున్నాడు.

    "మావయ్యా! ఈ ఉత్తరం కోసలరాం రాసిపెట్టి వెళ్ళాడు" అంది ఉపోద్ఘాతంలాగా.

    "కోసలరాం రాశాడా. అయితే ఫర్వాలేదు. ఇంకా జానకిరాం రాసిందేమో అనుకున్నాను. చదువమ్మా చదువు. ఏ జబ్బయినా అయితే భయపడాలి కానీ క్యాన్సర్ అయితే భయమెందుకు? దానికి మందొక్కటే, మృత్యువు."

    "మీరు లేనిపోనివి వూహించుకుని ఆవేశపడుతున్నారు."

    "ఫరవాలేదు. మనిషికి చావు తధ్యం! మిధ్య అయిన ఈ బ్రతుకుపై వ్యామోహం ఎందుకమ్మా? నా ఏడుగురు కొడుకులూ, ఏడుగురు కింకరుల్లా నా ప్రాణాలు హరిస్తున్నారు. చదువమ్మా, ఏం రాశాడు వాడు. మరీ అంత భయంకరంగా రాయలేడే వాడు."

    "ఈయన మనసు వూర్తిగా పాడైంది స్వాతీ! మళ్ళీ చదువుదు గానిలే! వెళ్ళి కాఫీ పట్రా."

    స్వాతి చప్పున వెళ్ళిపోయింది.

    "పార్వతీ! నువ్వు నిజంగా భయపడుతున్నావు. నా గురించి నాకేదో అవుతుందని ఆందోళన పడుతున్నావే?"

    పార్వతి కళ్ళు భయంతో రెపరెపలాడాయి.

    "ఇది చూడు__ఇది వకీలు విశ్వనాధం గారిచ్చిన నోటీసు. అలా అంటే నీకేం తెలుస్తుందిలే! నీ కొడుకులు కాదు కాదు. మన సుపుత్రులు అయోధ్యరాం, జానకిరాం కలిసి ఇప్పించిన నోటీసు!"

    "నోటీసా?" ఆశ్చర్యంగా అడిగింది. నోటీసేమిటండీ? ఎందుకిచ్చారసలు? ఏమైంది? ఏం కావాలని?"

    "మన అబ్బాయిలు జీవన గమనంలో వేగం అందుకున్నారు. అందుకే మనకి బాధ! చూడు ఈశ్వరయ్యకి ఒకే కొడుకు చంద్రశేఖరం! అయితేనేం తండ్రితో ఆస్తిపంచుకుని వేరు పోయాడతను. భార్యపోయి వున్న అతను ఒక్కకొడుకు ఆస్తిపంచుకుపోతే ఒక్కడూ ఇక్కడ యిమడలేక, ఈ ఇబ్బందులు పడలేక ఆస్తి అంతా దేవాలయానికి రాసి చెర్లో దూకి చస్తే అయ్యో అనుకున్నాం అప్పుడు."

    "ఇప్పుడామాటలన్నీ ఎందుకు?"

    "ఎందుకు? ఎందుకా? ఆ బాధ మనదికాదు కాబట్టి. అదే తమ్ముడో తండ్రో అయితే అంత తేలిగ్గా పోయేదా? ఇప్పుడు అది మనకు అనుభవంలోకి వచ్చింది."

    "ఇద్దరూ వేరు పడ్డారుగా, ఇంకా యేవిటి?"

    "ఏముంది? ఈ ఇల్లు నా పిత్రార్జితం! ఇదొక్కటే నా తాత తండ్రులు సంపాదించింది. ఇందులో వాళ్ళకి వాటా కావాలట."

    "రమ్మనండి. ఈ ఇల్లు పంచుకుని వాటా తీసుకుని కాపురం పెట్టమనండి." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS