వర్షాకాలం రెండుమూడు నెలలూ వారి రాకపోకలు ఏటి హెచ్చుతగ్గులపై ఆధారపడిఉండేవి. ఎదురుగా పట్నంలో డబ్బుపోసి కొనేందుకు మనుష్యులు సిద్ధంగా ఉన్నా అక్కడకు చేర్చే మార్గం లేక కూరగాయల్ని మురగపెట్టుకోవలసి వచ్చేది. ఒకరిద్దరు ఆశ పోతులు తెగించి వరదరోజుల్లో ఏరు దాటబోతే చావుతప్పి కన్ను లొట్టపోయింది అన్న సామెతలా ఏటిలో కూరలు వదిలి ప్రాణాలతో ఒడ్డుచేరేరు.
ఆ ఊరికి ఎవరూ ముఖ్యోద్యోగులు వచ్చేవారుకారు. పన్నుల వసూళ్ళకి వచ్చే సర్కారు ఉద్యోగస్థులతో గ్రామ ప్రజలు తమ బాధలు వెళ్ళబోసుకొంటే వారు చేతిలో డబ్బు పడేవరకూ అవునవునంటూ కాలక్షేపం చేసి ఏరు దాటగానే ఆ మాట మరిచిపోయేవారు.
అటువంటి సమయంలో జరిగిన ఒక హృదయ విచారక సంఘటన వల్ల సర్కారువారికి కనువిప్పు కలిగి ఆ వంతెన నిర్మాణానికి పునాదిరాయి పడింది. అది వర్షాకాలం రానున్న తరుణం. కొండలమీద నల్లని మేఘాలు కూడుకొంటున్నాయి. ఏ క్షణాన్నయినా వర్షాలు మొదలుకావచ్చు. కొండల్లో నాలుగు చినుకులు పడినా ఆ ఏటికి వరద వస్తుంది. అవకాశం ఉన్నంత వరకూ సరుకు సిద్ధంచేసి పట్నానికి కావిళ్లు వేసేరు. పది పదిహేను మంది చరుకు పాలు ఎక్కువయిన రైతులు.
ఏ కొండకోనలో వర్షం కురిసిందో వారు నడి ఏరులో ఉండగా ఎర్రనీరు సుళ్లు తిరుగుతూ ముంచుకు వచ్చింది. ఇటు దగ్గిర, అటు దగ్గిర అనుకొంటూ కాళ్ళు తొక్కుకుంటున్న రైతులు ఎటూ చేరలేక, నీటి వడికి కాళ్ళకింద ఇసుక కోరుకుపోగా నడివాలుకి కొట్టుకుపోయేరు. కొద్దోగొప్పో ఈత వచ్చినవాళ్ళు గ్రామానికి ఆమడదూరంలో ఏ తీగో, ఏ డొంకో ఆధారంచేసుకొని ఒడ్డుకి చేరేరు. మిగిలినవాళ్ల అజా పజాకూడా తెలియలేదు.
ఈ సంఘటనతో ఊళ్లో హాహాకారాలు రేగేయి. పేపర్ల వాళ్లు వచ్చి గ్రామస్థుల్ని ఓదార్చి గవర్నమెంటు పరువు రచ్చ కెక్కించేరు. ఏడాది తిరిగేసరికి ఏటిమీద వంతెన నిలిచింది.
"ఈ వంతెన ఇందరి ప్రాణాల్ని తీసుకొని వెలిసింది" అని ఆనాటి గ్రామంలోని ముసలి, ముతక దానిమీద నడిచేందుకు ఇష్టపడే వారుకారు.
ఈ రోజు ఆ సంఘటన కథగా మారిపోయింది. గ్రామస్థులంతా రాత్రీ పగలూ ఏ సంకోచం లేకుండా వంతెనపై రాకపోకలు సాగిస్తూంటారు. పట్నంలో పల్లెకి పొత్తు కలిపింది ఆ వంతెన. వరదరాజువంటి గ్రామవాసుల పిల్లలెందరో ఈనాడు పట్నంలో ఉండి చదువుకొంటున్నారు. పట్నంలో వ్యవసాయంలో పెద్దచదువులు చదివిన కొందరు తాము చదివిన చదువు ఆచరణలో పెట్టాలనే కోర్కెతో అందుబాటులో ఉన్న ఆ గ్రామానికి చేరుకొంటున్నారు.
కాలేజీ ఆడపిల్లలు ఏరు దాటి ఆవలిఒడ్డున వచ్చిన తోటల్లో పంటచేల పక్కగా విందుభోజనాలు జరుపుకోడం, విహారాలు సాగించడం పరిపాటే.
జిలుగు వెలుగుల అలంకరణలు, నవ్వులు, కేరింతలతో ఆ పిల్లల్ని చూసి, మాసికలు వేసిన తమ ముతక చీరల్ని చూసుకొని రైతుపడతులు ఇంటిదగ్గర మూతులు బిగించడంకూడా అలవాటే.
ఒకదాని సరసనే ఇంకొకటి నిలిచిఉన్నా పట్నాన్ని, పల్లెని వేరుచేస్తూ సంతతం పారుతూనే ఉంటుంది ఆ ఏరు. 'ఈ రెండు రకాల జీవితాన్ని ఏకం చెయ్యడమే నా ధ్యేయం' అన్నట్లు నిటారుగా నిల్చి ఉంటుంది ఉక్కువంతెన.
వరదరాజు ఏటి కావలిఒడ్డున ఏనాడో జరిగిపోయిన సంగతులను ఆలోచిస్తూండగానే చీకటిపడసాగింది. ఇంక వెళ్లిపోయే సమయమయిందని లేచి, బట్టలకు అంటుకొన్న ఇసుక దులుపు కొంటూంటే వెనకనుంచి ఎవరివో మాటలు వినిపించేయి. ఆ కంఠ స్వరాలు ఎక్కడో విన్నట్లు అనిపించి క్షణకాలం ఆగేడు.
"అదిగో....ఆ అబ్బాయిల్లాగే ఉన్నాడు నాన్నా!"
"నాకూ అలాగే అనిపిస్తున్నది."
"పేరేదో చెప్పేడు, జ్ఞాపకముందా?"
"వరదరాజు."
వారి మాటల్లో తన పేరు రావడంతో వెనుతిరిగి చూసేడు రాజు. ఆ అందమైన మేడ యజమాని, అతని కూతురు!
నాలుగడుగులు వేసి "నమస్కారమండి" అన్నాడు వరదరాజు నమ్రతగా.
"ఓ....నువ్వే అన్నమాట? ఇంకా అవునా కాదా అనుకొంటున్నాము."
"నేనేనండి. ఆ రోజు మీ తోటలో కలుసుకొన్నాము."
"ఇక్కడేం చేస్తున్నావు?"
"ఏం లేదండి. సాయంకాలం చల్లగాలికి ఇటు వస్తుంటాను."
"మా మేడమీద మోజు పోయిందన్న మాట." నవ్వుతూ అన్నాడు రాఘవయ్య.
"అలాగేం లేదండి."
"మరి వస్తానని ఆ రోజు రాలేదేం?" అనూరాధ అందుకొంది.
మరునాడే మాగ్రామం వెళ్ళిపోయేను. తిరిగి వచ్చేక ఒకసారి మీ ఇల్లు చూడాలనే వచ్చేను. కాని మీ కాపలావాడు నన్ను కాలు ముందుకి వెయ్యనియ్యలేదు."
"అదేం అలా? ఎర్రయ్య ఎదురుగానే కదా నాన్నగారు ఇల్లు చూపించమన్నది!"
"అప్పుడు గేటుదగ్గిర ఎవరో కొత్తవాడు ఉన్నాడు. నాన్నగారూ, మీరూ ఇంట్లో లేరని చెప్పేడు"
"ఓహో, ఇది మాధవుడి పని అన్నమాట. అయినా ఆ తప్పు మాదేలెండి. నాన్నగారు ఊర్లోలేరు. అయిన వాళ్ళనీ కానివాళ్ళనీ ఇంట్లోకి వదలవద్దని అమ్మ వాడికి ఆజ్ఞ జారీచేసింది."
"పోనీ. ఇప్పుడు మించిపోయిందేమిటి, రేపు సాయంకాలం రా" అన్నాడు రాఘవయ్య.
