Previous Page Next Page 
వారధి పేజి 32


    "మీ అమ్మకి  తన ఆస్తిపాస్తులు  ఎవరెత్తుకుపోతారో  అని ఎప్పుడూ భయమే!" అన్నాడు. అప్పుడే గదిలోకి  వచ్చిన తండ్రి నవ్వుతూ.

    "అక్కడికి  మీ తండ్రీకూతుళ్ళకి  డబ్బు అంటే చేదు అన్నట్లు  మాట్లాడుతున్నారు" అంది  మూతి తిప్పుతూ  అనూరాధ  తల్లి రాజమ్మ.

    గేటుతలుపు చప్పుడుకాగానే  ముందు హాలులోకి ఆత్రంగా  పరుగు తీసింది  అనూరాధ. గేటు తెరచుకు  వస్తున్న  వంటవాడిని  తోక ఆడిస్తూ  ఆహ్వానించింది  టైగరు.

    "ఆ పిల్లడి రాకకోసం  అమ్మాయి  ఇంత ఆర్భాటం  చేస్తున్నదేమిటి?" అంది రాజమ్మ  అసహనంగా.

    "ఈడుపిల్లడు. చూడముచ్చటగా  ఉన్నాడు. ముఖం చూస్తే  తెలివైన  పిల్లడులాగే  అనిపిస్తున్నాడు. రాధ స్నేహం చేసుకోవాలనుకొంటే  తప్పేముంది? ఆ పిల్లడిని  చూస్తే  నువ్వూ  ఇష్టపడతావు" అన్నాడు రాఘవయ్య.

    "నా కిదేం  నచ్చలేదు  సుమండీ! మంచీ చెడ్డా  తెలుసుకోకుండా  ఎవరో పిల్లడు ఇల్లు చూస్తానంటే  ఎర్రగా బుర్రగా ఉన్నాడని  ఇంట్లో  జొరపెట్టడం! ఎటునుంచి  ఏది వచ్చినా...."

    "సరిలేవే. ఇంతవరకూ  ఆ పిల్లడు  రానేలేదు. చాలా సిగ్గరిలాగున్నాడు? అసలు రాకపోవచ్చు. అనవసరంగా  మనకీ  వాదన  లెందుకు?" అన్నాడు రాఘవయ్య  అక్కడినుంచి  వెళ్ళిపోతూ.

    రెండు మూడు రోజులు  వరుసగా   ఆ పిల్లడి కోసం  ఎదురు చూసింది అనూరాధ. పాటలు పోటీల్లో  తను గెల్చుకొన్న  బహుమతులు, పుస్తకాల నుండి  తను కత్తిరించిపెట్టుకొన్న  బొమ్మలు  అన్నీ అతడికి  చూపాలని సిద్దంచేసి  ఉంచింది. కాని  అతడు రాలేదు.

    అటుతరవాత  ఇంట్లో  అందరితోపాటు  అనూరాధ  కూడా  ఆ విషయం  మరిచిపోయింది. పదిహేను  రోజులనాడు  ఎర్రయ్య  వచ్చి మాటల సందర్భంలో  "చిన్నమ్మగారూ! ఆ కుర్రాడు  మరునాడు వచ్చేడా?" అని ప్రశ్నించేడు.
 
    "రాలేదు" అంది అనూరాధ.

    "అయ్యగారూ, మీరూ  పలకరించగానే  సిగ్గుపడి  పోయి  ఉంటాడు" అన్నాడు ఎర్రయ్య.

    'అంతే అయిఉంటుంది' అనుకొంది అనురాధ.

    పదినిమిషాలు  ఆలోచించేక  ఆనాటి రాత్రి ఎలెక్ ట్రిక్ లైట్ల  వెలుగులో  తను చూసిన  అందమైన  అమ్మాయి  పేరు జ్ఞాపకం వచ్చింది. వరదరాజుకి, ఆ పిల్ల పేరు అనూరాధ. చాలా చక్కని పేరు. పేరులాగే  మనిషికూడా అందంగా ఉంటుంది. అన్నిటికంటే  ముచ్చటగా  ఉంది ఆ నవ్వు. తను తిరిగివస్తుంటే  ఆ పిల్ల ఏదో మాట  తండ్రితో  చెప్పి కిలకిలమని  నవ్వింది. చింత తోపులోనించి  చిలుకలదండు  కిలకిలమంటూ  ఎగిరినట్లు  అనిపించింది తనకు. వెనుతిరిగి  చూసేడు  చక్కని  పలువరస. నవ్వుతూంటే  కుడి బుగ్గమీద  ఇంత లోతుగా  సొట్ట  పడింది.

    'అమ్మకికూడా  నవ్వితే  సొట్ట  పడేదిట. ఒక్కొక్కసారి  తను నవ్వుతున్నప్పుడుకూడా  బుగ్గ కొంచెం  లోతుకి పోతుంది. అయినా  అది  ఆడవాళ్ళకయితే  అందంగా  ఉంటుందికాని  గడ్డాలు, మీసాలు  పెరిగే మగవాళ్లకేం  బాగుంటుంది?'

    ఆలోచిస్తూనే  హాస్టలు ముఖం  పట్టేడు  వరదరాజు. మరునాటి  నుంచి చదువులో  మునిగిపోయేడు.



                            *    *    *     

   
    అర్ధసంవత్సరం పరీక్షలు  పూర్తి అయ్యేయి. సెలవుల్లో  ఇంటికి పోయి  తిరిగివచ్చేడు  రాజు. పరీక్షల మార్కులు  అందుకొన్న  నాడు వరదరాజు  మనసు  సంతోషంగా  గంతులు  వేసింది. ఎప్పుడూ  అతడికి  తన క్లాసులో మంచిమార్కులే వస్తుండేవి. కాని  కాలేజీలో  చేరిన  మొదటితోజుల్లో కలిగిన  భయాందోళనల వల్ల  ఆ క్లాసులో  మంచిమార్కులు  తెచ్చుకోలేనేమో  అని అనుమానించేడు. 

    పనిపెట్టుకు  బజారుకు వెళ్ళి తమ ఊరివాళ్ళకోసం  వెతుకులాడేడు. పట్నానికి  నాలుగుమైళ్ళ  దూరంలో  ఉన్న ఆ ఊరికి  టపా అయితే  వెళుతుంది కాని సాధారణంగా పట్నం  పల్లెలమధ్య  ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చేపోయేవారిద్వారానే  జరుగుతాయి. పోస్టులో  వేసిన ఉత్తరం  కన్న మనిషి చేతిలో  పెడితే  ముందుగా  చేరుతుంది. రోజూ  ఎవరో ఒకరు వచ్చిపోతూనే  ఉంటారు.

    వరదరాజు కొంతసేపు ఇటు అటు తిరిగి చూడగా  అప్పన్నగారి  బండివాడు  రాములు కనిపించేడు. "రాజు బాబూ! బండి పోతున్నది ఇంటికి వస్తావా?" అంటూ  పలకరించేడు.

    "ఇంటినుండి  వచ్చి ఇంకా  నాలుగు  రోజులు కాలేదు. ఇంటికి రానుకాని  ఈ ఉత్తరం  అన్నయ్యకి  ఇయ్యాలి" అన్నాడు  జేబులో  భద్రంగా మడిచి  ఉంచిన  కాగితాన్ని  అందిస్తూ.

    "మరింకేటి  సెప్పమంటావు?" ఉత్తరం  అందుకొని  పాగాలో  దోపుకొంటూ  అడిగేడు  రాములు.

    "అన్నీ అందులో  రాసేను. కులాసాగా ఉన్నానని  చెప్పు."

    రాములు  బండి  గ్రామాభిముఖంగా  పోతూంటే  'ఆ ఉత్తరం చదువుకొని  అన్నా వదినా  ఏమనుకొంటారా?' అని ఆలోచిస్తూ  ఏటి  ఒడ్డున  నడకసాగించేడు  వరదరాజు.

    వదినమీద  కోపం  పోయేక  తన సాయంకాలపు  విహారాన్ని  తిరిగి నీటిఒడ్డుకే  మార్చుకొన్నాడు  వరదరాజు. గలగల పారుతూండే  ఆ నీటిని, ఏటిపై  ఎండలో  మిలమిల  మెరుస్తూండే  వంతెనయొక్క  ఉక్కు  స్తంభాలని, వంతెన  ఆవలి  చివరనుండి  మొదలయే పంట  చేలని, అవే  జీవనంగా  బ్రతికే పల్లెవాసుల్ని  తలచుకొంటుంటే  వరదరాజు  మనసులో  చిత్రవిచిత్రమైన  ఊహలు  కలుగుతూంటాయి.

    వరదరాజు  తాత   చిన్నతనంలో  ఆ ఏటిమీద  వంతెన  ఉండేది  కాదు. గ్రామవాసులు  కాయా  కసరూ  అమ్ముకొనేందుకు  మోకాలిబండి  నీటిలోంచి  పంచలు పైకి  ఎత్తికట్టి  పట్నం  చేరేవారు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS