"అలాగేనండి. మీ మేడ చూడాలన్న కోరిక అంతర్గతంగా ఈ నాలుగు నెలలపాటూ నా మనసులో నిలిచేఉంది" అన్నాడు రాజు.
"నాన్నా, అప్పటికీ, ఇప్పటికీ ఈ కుర్రాడు కొంచెం మారినట్లు ఉన్నాడు కదూ" అంది అనూరాధ కారులో.
"కాస్త పెద్దవాడయేడు" అన్నాడు రాఘవయ్య.
మరునాడు ఆదివారం. నాలుగు గంటలకే రాఘవయ్యగారి పెద్ద మేడ ముందు నిలిచేడు వరదరాజు.
"రా....రా....పిల్లోడా. ఆనాటికి ఇప్పుడా రావడం!" రాజుని గుర్తుపట్టి ఆహ్వానించేడు ఎర్రయ్య.
"ఇంతకుపూర్వం ఒకసారి వచ్చేను" అన్నాడు రాజు.
"మరి చిన్నమ్మగారు రాలేదన్నారే!"
"ఇంటిలోకి పోలేదు."
"ఏం ?"
"గేటుదగ్గిర మనిషి అడ్డగించేడు."
"ఎవరు__మా మాధవుడా ?"
"అతడే అనుకొంటాను."
గాజుగ్లాసు నేలమీద పడి పగిలిన చప్పుడులా గల్లుమని నవ్వేడు ఎర్రయ్య.
"ఆడితో అంతే. ఏ మాట చెబితే అంతే ఎనకా ముందూ సూడకుండా అట్టాగే నడుసుకొంటాడు" అన్నాడు.
గేటు దాటుతూంటే టైగరు ముందుకి వచ్చింది. అదివరలో ఎర్రయ్య చెప్పిన మాట గుర్తుకువచ్చి కాళ్ళు వెనక్కి లాగేయి. అది నెమ్మదిగా వచ్చి వరదరాజు కాళ్ళు వాసన చూసింది. దాని వెనకనే అనూరాధ కనిపించింది.
"మరేం భయంలేదు. నేను దగ్గిర ఉండగా అదేం చెయ్యదు" అని వరదరాజుకి అభయమిచ్చి, "టైగర్" అంటూ దానిని వెనక్కి పిలిచింది. అది తోక ఆడించుకొంటూ అనూరాధ దగ్గిరకి వెళ్ళిపోయింది.
ముందు హాలులో సోఫాలో కూర్చొని పైపు కాలుస్తున్నాడు రాఘవయ్య.
"రావయ్యా, వరదరాజూ!" అంటూ ఆహ్వానించేడు.
ఆ మెత్తని కుర్చీలో ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో వరదరాజుకి బోధపడక అక్కడే నిలిచిపోయేడు.
"ఈ రోజు కాలేజీకి సెలవా?" ఏదో అడగాలన్నట్లు అడిగేడు రాఘవయ్య.
"అదేం ప్రశ్న నాన్నా? ఆదివారంనాడు కాలేజీకి సెలవు వుండదా?" అంది అనూరాధ నవ్వుతూ.
"పోనీ, ఇంకో ప్రశ్న. నీకు పరీక్షలు పూర్తి అయేయా?"
"ఇదీ అంతమాత్రంగానే వుంది. అందరికీ పరీక్షలు పూర్తి అయేకే సాధారణంగా సెలవులు ఇస్తారు. ఇప్పుడు కాలేజీలుకూడా తెరిచేరు."
"సరే....పరీక్షలో మార్కులెలా వచ్చేయి?"
ఈ సారి ప్రశ్న అనూరాధ సమ్మతిని పొందింది. అంత తెలివిగా కనిపించే వరదరాజు చదువులో ఎలా వుంటాడో తెలుసుకోవాలనే కోర్కె ఆమెకు కూడా కలిగింది.
"ఇది సరిగ్గా విద్యార్ధిని అడగవలసిన ప్రశ్న" అంది.
అప్పటివరకూ ఆ తండ్రికూతుళ్ళ మాటలను చిత్రంగా వింటున్న రాజు తనకు జవాబు చెప్పే అవకాశం రాగానే దానిమీద విరుచుకుపడబోయేడు.
"నిలబడే వుండిపోయేవు. కూర్చో. కూర్చుని చెప్పు" అన్నాడు రాఘవయ్య.
"ఫరవాలేదండి" అన్నాడు రాజు అనూరాధవైపు చూస్తూ. ఆమె కూడా తండ్రి కూర్చున్న సోఫాకు ఆనుకొని నిలబడే వుంది.
వివరంగా తనకు వచ్చిన మార్కులు చెప్పేడు వరదరాజు.
"నీ సంగతి చూస్తే యూనివర్శిటీ ఫస్టుకొట్టేసే బాపతులాగుందే" అన్నాడు రాఘవయ్య కళ్ళు ఎగరేస్తూ.
"అదేం లేదండి. కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం అంటే నాకు సరదా. అందుకని...."
"మా అమ్మాయికి పరీక్ష హాల్లో కలుపెట్టేసరికి, వచ్చినవి మరిచిపోయి బండిసున్నాలు తెచ్చుకోవడం అంటే సరదా" అన్నాడు రాఘవయ్య కూతురువైపు చూసి నవ్వుతూ.
"ఛీ....పో ....నాన్నా!" అంది అనూరాధ మూతి బిగించి.
"నాన్నగారు అబద్ధం చెబుతున్నారని నాకు తెలుసు" అన్నాడు రాజు.
"ఎలా తెలుసు ?" రాధ రెట్టించింది.
"బండిసున్నాలు పొందేవారి కళ్ళు అంత చురుకుగా, అందంగా ఉండవు" అన్నాడు వరదరాజు ఆమె కళ్ళపట్ల తన మెప్పుదలను తెలియజేస్తూ.
"సరి....సరి....నువ్వూ ఆ కళ్ళు చూసి మోసపోయేవన్నమాట!" పకపక నవ్వుతూ కూతుర్ని గేలి చేసేడు రాఘవయ్య.
"ఇలా అన్నీ అబద్ధాలు చెబుతూంటే నేను వెళ్ళిపోతాను. ఆ పిల్లడికి ఇల్లు మీరే చూపించండి" అంది అనూరాధ కోపంగా.
"ఊరికే సరదాకి అన్నానమ్మా! ఆ సంగతి ఈ అబ్బాయి కూడా గ్రహించుకున్నాడు చూడు.... ఆ....సరే, ఇతణ్ణి తీసుకుపోయి మీ అమ్మకి పరిచయం చేసి ఇల్లంతా తిప్పి తీసుకురా ఎక్వేరియమ్ లో నిన్న తీసుకువచ్చిన కొత్త చేపల్ని కూడా చూపించు."
