మారిన విలువలు
దివ్వేదుల విశాలాక్షి

నాలుగేళ్ళ తరువాత ఆ ఇంట్లో తిరిగి నవ్వులు వినిపించేయి. వీధి లోంచి ఒక్క పరుగున వచ్చి అక్క మెడను వాటేసుకుంది శాంత. చేతిలో పుస్తకాన్ని పక్కగా పెట్టి , "ఏమిటే, శాంతా, ఈ హంగామా?" అని ప్రశ్నించింది జానకి.
"ఫో అక్కా! నువ్వెప్పుడూ అంతే. ఈ లోకంలో జరుగుతున్న ఏ విషయం నీకు పట్టనట్టు మాట్లాడుతావు." అన్నది బుంగమూతి పెట్టి శాంత.
"ఏ విషయం నువ్వు చెప్పెందే నాకెలా తెలుస్తుందే? నీసంతోషకారణం తెలుసుకొందికి నాకేమైనా దివ్యదృష్టి ఉందా?' జానకి చెల్లెల్ని సముదాయించింది.
శాంత నవ్వుతూ దాచి పెట్టుకున్న న్యూస్ పేపర్ని అక్క కళ్ళ ముందు ఆడించింది.
"ఓ, అదా సంగతి! అమ్మాయి గారి రిజల్ట్స్ వచ్చేయన్న మాట! ఏది ? ఏదీ, చూడనీ' అంటూ శాంత చేతిలోని పేపరు అందుకొన్నది జానకి.
పేపరు పేజీలు తిరగేస్తూనే , 'అమ్మా, అమ్మా! శాంత రిజల్డ్స్ వచ్చేయ్" అని కేకవేసింది.
పొయ్యి కింద మంట కిందికి లాగి, ఆత్రంగా వరండా లోకి వచ్చింది సుందరమ్మ. జానకి కేక విని సగం పిండిన బట్టలు నూతి గట్టున అలాగే వదిలి పరుగు పరుగున వచ్చింది వదిన గారు కనకం.
'అంత సంతోషం అక్కా చెల్లెళ్ళు మీ ఇద్దరే పంచేసుకోకపోతే మాక్కొంత చిదిపి పెట్టరాదు" అన్నది కనకం.
"పెట్టిందికే కదా పిలిచింది , వదినా? ఇంతలోనే అంత తొందరైతే ఎలా? శాంత పరీక్ష పాసయింది."
'ఆడపిల్ల -- దాని పరీక్ష మాటకేం గాని, ప్రకాశంది ఏమయింది? ఈ ఏడేనా గట్టెక్కేడా?' ఆత్రంగా ప్రశ్నించింది సుందరమ్మ.
'చూసేవా, అక్కా, అమ్మ పక్షపాతం! నేను పరీక్ష పాసయ్యేనంటే, ఎలా ఈసడించి పారేసిందో? అమ్మకి ఎంతసేపు కొడుకుల చదువులు, వాళ్ళ మంచి చెడ్దలే కాని కూతుళ్ళ సంగతి అక్కరలేదు" అన్నది శాంత నిష్టూరంగా.
"అదేమిటే , శాంతా! నువ్వు పరీక్ష పాసయ్యేవంటే నాకు సంతోషం కాదుటే, తల్లీ! అన్నయ్య చూడు, నీ కంటే రెండేళ్ళు పెద్దవాడు. మూడేళ్ళయి ఈ క్లాసు లోనే సుళ్ళు తిరుగుతున్నాడు. ఈసారైనా మాట దక్కిస్తాడెమో అని ఆశపడ్డాను." అన్నది సుందరమ్మ దిగులుగా.
"పోనీలెండత్తయ్యా! పిల్లలిద్దరి లో ఒక్కరైనా పాసయ్యేరు అదే సంతోషం" అన్నది కనకం.
"ఆడపిల్ల చదువుకేముందమ్మా!ఈ రోజు కాకుంటే రేపు పెళ్ళి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించుకొని బ్రతకవలసిన మగాడికి చదువు లేకపోతె ఎలా?"
"అవన్నీ పూర్వకాలంలో మాటలత్తయ్యా , ఈ రోజుల్లో మగేమిటి, అడేమిటి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మీ పెద్దబ్బాయితో పాటు మీ అమ్మాయి గడించటం లేదూ? శాంత అక్కలాగే ఉద్యోగం చేస్తుందేమో? ఎవరు చూడోచ్చేరు?" అన్నది కనకం ఉత్సాహంగా.
పెద్ద బాలశిక్షతో చదువుకు స్వస్తి చెప్పిన పల్లెపడుచు కనకానికి ఉద్యోగం చేస్తున్న ఆడపడుచు జానకి అన్నా, తెలివిగా చదువుకొంటున్న చిట్టి మరదలు శాంత అన్నా ఎంతో అభిమానం, గౌరవం తనకు అర్ధం కాని ఏవో విషయాలు ఆ అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకొంటుంటే , కుతూహలంగా కళ్ళింత చేసుకొని, వింతగా వారిని చూస్తుంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో తమ ఇంటి ఆడపిల్లల తెలివి తేటల్ని గురించి చెప్పుకోడం అంటే ఆమెకు ఎంతో సంతోషం.
"మా ఆడపడుచులు చదువు సంధ్యల్లో , తెలివి తేటల్లో ఏ మగవాళ్ళ కి తీసిపోరు." అనేది గర్వంగా.
కనకం మాటతో సుందరమ్మ ఉలికి పడ్డది. 'అయ్యో నాతల్లీ! జానకి పోలిక ఎవరికీ వద్దమ్మా. మా శాంత తల్లి సలక్షణంగా పెళ్ళి చేసుకొని , పిల్లా పాపాతో హాయిగా ఉంటుంది." అన్నది సుందరమ్మ. అపశకునం మాట విన్నందుకు మనసులోనే చెంపలు వేసుకుంటూ.
కనకం ముఖం చిన్నపోయింది. "నేనా ఉద్దేశ్యంతో అనలేదు, అత్తయ్యా!" అన్నది నెమ్మదిగా.
జానకి చేతిలోని పేపరు విడిచి గదిలోకి వెళ్ళిపోయింది. శాంత ఆనందం, కుండెడు వేడి పాలలో చల్ల చుక్క పడినట్లు విరిగిపోయింది. సుందరమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
గడిచిన కాలపు స్మృతులు ఆ ఇంటి చుట్టూ గాలిలో కలిసి తిరుగుతూనే ఉంటాయి. ఏపాటి చోటు దొరికినా ఆ ఇంటి మనుషులు శ్వాస ద్వారా వారి శరీరంలో ప్రవేశించి వారిని బాధపెట్టేందుకు వెనుతీయవు. సుందరమ్మ మాట వాటికీ తిరిగి ప్రాణం పోసింది.
* * * *
వారం రోజులై వచ్చే బంధువులతో, పచ్చని పందిళ్ళతో , కలకలలాడు పసుపు గుమ్మాలతో, సంతోష సదనం లా ఉన్న ఆ ఇల్లుఒక్కసారిగా కదన రంగమై కూర్చుంది. అలకపాన్పు పై పెళ్ళి కొడుకు అమాంతం లేచి కూర్చున్నాడు. అడ పెళ్ళి వారు, మగ పెళ్ళి వారు ఎదురు బోదురుగా నిలిచి కత్తుల్లాటి చూపులతో పోడుచుకున్నారు. ఈటెల్లాటి మాటలు విసురుకొన్నారు. తిట్లు, శాపనార్ధాలు, బాంబుల్లా ఇరుపక్షాల మధ్య పడి "ధనాధన్" మని పేలాయి. రెండు వైపులా పరువు ప్రతిష్టలు ఆకోపాగ్ని జ్వాలల్లో మండి మసిపారి, ఆ నుసి పెళ్ళి పందిరి దాటి పెరటా, వాకిటా నిండిపోయింది.
ఆవేశాలు కాస్త చల్లారేక ఆడుకున్న మాటలకు ఒక అర్ధం అంటూ ఏర్పడింది.
"నిర్ణయించుకున్న ప్రకారం మూడు వేల రూపాయలు చెల్లించుకున్నారు. ఆడపిల్లని కన్న అపరాధానికి అంతకన్న ఎక్కువ జరిమానా చెల్లించు కొనే శక్తి నాకు లేదు" అన్నాడు పెళ్ళి పెద్ద.
"ఏమిటండి, బావగారూ! లక్షలడిగేడా? కొట్లడిగేడా? ఒక వెయ్యి రూపాయలకే ముఖం చూసుకొంటే ఎలా? ఈనాటి ముచ్చట ఇంకో నాడు వస్తుందా? రేపు అల్లుడు మోటారు సైకిలెక్కి , మీ అమ్మాయిని వెంట బెట్టుకొని మీ ఇంటి కొస్తే, ఆ సంతోషం మీది కాదుటండి? ఏదో కోపంలో అలా అన్నారే గాని, ఆమాత్రం ముద్దూ ముచ్చటా మీకు మాత్రం తెలియదా." అన్నాడు పెళ్ళి కుమారుడి తండ్రి.
"ఓ తప్పకుండా! అల్లుడు మోటారు సైకిలు కొంటానంటే నేను మాత్రం వద్దంటానా? మీరన్నట్లు నాకు మాత్రం ముచ్చట కాదా? నే మనవి చేసుకొంటున్నదల్లా , మాకు తోచింది మేము కట్నంగా పెట్టేము. ఆ పైది మీరు భర్తీ చెయ్యండి. మీకేం లేదా, పోదా?"
'సరి ,సరి! మా పిల్లడికి పెట్టుకోమని మీరు మాకు చెప్పాలా? మీ ముచ్చట మీరు కన్యాదాతగా తీర్చమంటూన్నాము." వియ్యపురాలు వీణ మీటినట్లు ఒక మాట విసిరింది.
"ఎక్కడికమ్మా ఈ లచ్చట్లు, ముచ్చట్లు? మాకు కలిగింది మేము పెట్టేం. పెట్టిన దానితో తృప్తి పడాలి కదా? అంతా కడిగి పెట్టిందికి ఈ పిల్ల ఒక్కతే కాదు కదా? ఇంకో ఆడపిల్ల పెళ్ళి కేదుగుతున్నది. ఆడపిల్ల వాళ్ళని అలుసు చేసి మరీ జలగల్లా పీక్కు తింటామంటే ఎలా?" అన్నది పిల్ల తల్లి.
ఆవిడ అన్న మాటతో మళ్ళీ నిప్పు రాజుకున్నది. పెళ్ళికొడుకు అలక పాన్పు మీద మండిగం వేసుక్కూర్చుని "వాహవ్వా" చిత్తగిస్తున్నాడు. తనవాళ్ళు నెగ్గుతున్నారనిపించినప్పుడు ఆనందం, ఎదురుదెబ్బ తిన్నప్పుడు విచారం చూపులతోనే వ్యక్తం చేస్తున్నాడు. అతడు అలిగి ఉన్నాడు కదా! అందుచేత మాట్లాడ కూడదనుకొని మౌనంగానే తన సహాయం తనవారికి అందజేస్తున్నాడు.
'అయితే, బావగారూ! మోటారు సైకిలు కొనుక్కొని, పలుగు, పారా సంచిలో వేసుకొని, తెల్లవారుఝామున మళ్ళ గట్లంట షికారు చిత్తగిస్తారన్నమాట" అన్నాడు చిట్టి బావమరిది.
'అసలు బావా! పట్నంలో కొన్న మోటారు సైకిలు మీ గ్రామం ఎలా తీసుకుపోతావు? ఆ నాటు దారిలో అది నడుస్తుందీ?' చిన్న మరదలు సందేహం వెళ్ళబుచ్చింది.
"నీకేం తెలుసే పిల్లా! మోటారు సైకిలు కొన్న మామగారు ఆ మాత్రం రోడ్లు వేయించలేడా? అదీ అతనే చూస్తాడు. అంతే కదు మరిదీ?' ఇంకొక వరస వదిన గారు హాస్యం చేసింది.
పెళ్ళి కొడుకు మూతి బిగించాడు. పెరటా, వాకిటా వాగ్యుద్దాలు జోరుగా సాగాయి. మగ పెళ్ళివారు "ధూం ధాం' అంటూ పెళ్ళి పందిరి వదిలి వెళ్ళిపోయేరు. పెట్టెలు, మూటలు సర్దుకొని విడిది విడిచి స్టేషను దారి పట్టేరు.

వీళ్ళు రెండు ఫర్లాంగు ల దూరంలో ఉండగానే, నన్ను అందుకోండి చూద్దాం- అన్నట్లు పరుగు తీసింది పెళ్ళివారు ఎక్కవలసిన రైలు. తిరిగి రాత్రి పన్నెండు గంటలకు కాని వారి గ్రామం వైపు పోయే రైలు లేదు. పగలంతా ఊరల్లా తిరగేరు. కనిపించినవారి దగ్గరల్లా ఆడపెళ్ళి వారిని చెడామడా తిట్టేరు. కడుపులు కాలుతుంటే ,విందు భోజనాలు తలుచుకొంటూ, అయ్యంగార్ హోటల్లో సాంబారు మెతుకులు కతికారు.
