Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 32


    "సుమతి నన్ను ప్రేమించింది నాన్నా!"
    "అలా చెప్పు. ప్రేమించిందా నిన్ను. బావుంది. మరి నువ్వు ఆ పిల్లని ప్రేమించావా" అతను అడ్డంగా తలూపాడు.
    "మంచిపని చేశావు. ప్రతి దిక్కుమాలిన ఆడపిల్లనీ ప్రేమించేందుకేనా నువ్వు పుట్టింది? వెల్ డన్ మైడియర్ సన్! వెల్ డన్! పోనీ ఆ పిల్లదొరేయ్!__నీ ఎరికలో ఎవరైనా ప్రేమించినట్టున్నారా?"
    "ఉన్నారు నాన్నా!" మన సీతాపతిగాడు లేడూ! వాడైతే రాస్కెల్, నా ఎలక్షన్ని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయితో చీటికీమాటికీ మాట్లాడి వచ్చేవాడు. వాడు పచ్చి దుర్మార్గుడు నాన్నా!"
    రామదాసు నవ్వుకున్నారు. నవ్వుకుని అన్నారు.
    "ఒరేయ్! మనం దుర్మార్గం గురించి మాట్లాడుకుందాం. అయితే, సీతాపతి సుమతిని ప్రేమించేదంటావ్"
    "అవును."
    "నువ్వు సుమతితో కలిసి తిరిగేవాడివి కాదా?"
    మళ్లా అతను అడ్డంగా తలూపాడు.
    "పాపం రా జీవీ! తండ్రిని. కన్నతండ్రిని ఛీట్ చేస్తే మహా పాపం! రేపొద్దున ప్రజల్ని చీట్ చేద్దాం. అది మన డ్యూటీ! కానీ, కన్నవాణ్ణి నువ్వు నన్ను చీట్ చేస్తే పాపం కదా! నాకు నిజం చెప్పు! జరగబోయేదేదో జరిగే తీరుతుంది. నీ ప్రయోజకత్వమేమిటో నాకూ తెలియాలి గదా! అందుచేత నిజం చెప్పు!"
    చిరంజీవికి తండ్రిలోని మార్పు చాలా అసహజంగా కనిపించింది. ఇష్టం లేకపోయినా నిజం చెప్పక తప్పింది కాదు."
    "తిరిగాను" అన్నాడు కొడుకు.
    ఆ మాట విని ఆనందించారు తండ్రి.
    "మంచిది. అలా నిజం చెబుతూంటే నాకు ముచ్చటగా ఉంటుంది. తిరిగావు బాగుంది. ఆ పిల్ల యిప్పుడు గర్భిణిట తెలుసా?"
    "ఎవరు చెప్పారు నాన్నా?"
    "ఎవరు చెబితేనేమిటిగాని, నేనడిగింది నిజమా?"
    "నిజమే!"
    "సుమతికి పుట్టబోయే శిశువుకి తండ్రెవరు?"
    "నేను."
    "మరి; ఇప్పుడు పిల్లని నువ్వు పెళ్ళి చేసుకోడానికి సిద్ధమా?"
    "నాకిష్టంలేదు నాన్నా!"
    "ఎందుచేత?"
    "వాళ్ళ దగ్గిర డబ్బులేదు. సుమతి భార్యగా రావడం సుమతి అదృష్టమే కాని, నేను సుమతికి భర్తనయితే అది నా దౌర్భాగ్యమే! ఈ పెళ్ళితో నేను ఎదగలేను నాన్నా!"
    రామదాసుగారు పకపకా నవ్వేశారు. నవ్వి, అలిసిపోయిన గొంతుతో అన్నారు.
    "నన్ను మించిన బిడ్డవు. తండ్రిని మించిన కొడుకునిచ్చి పుణ్యం కట్టుకున్నావురా దేవుడా! నీకు జై!"
    "నాన్నా!"
    "అవును నాయనా! నువ్వు అభివృద్ధిలోకి వచ్చే సూచనలు గమనించి నేను మురిసిపోతున్నాను. మన సుఖం కోసం మనం లక్ష తొంభై వెధవ పనులు చేస్తే చేసి వుండొచ్చు. అంత మాత్రాన మనం చేసిన వెధవ పనికి తలొంచి శిక్షేమిటని అడిగితే మన సరదాలు ఏం గాను? మన గొప్పతనం ఏంగాను?"
    "ఇవాళ నువ్వెందుకో తమాషాగా మాటాడుతున్నావ్ నాన్నా!"
    "ఇది ఏమందు ప్రభావమూ కాదు చిన్నా! నా చిన్నతనాన్ని నీతో పోల్చుకు చూచుకుని, 'ఎంతెంత పనులివి' అని ఆనందిస్తున్నాను. ఒరేయ్ జీవీ! నీకు ప్రసాదం తెలుసట్రా?"
    "ప్రసాదమా? ప్రసాద మొచ్చేడా నాన్నా? వాడే సుమతి విషయం చెప్పాడు! సుమతికి ప్రసాదమంటే చెడ్డ యిష్టం నాన్నా?" అందుకే వచ్చాడు కాబోలు! అన్ని విషయాలు వాడే చెప్పాడు నీకు?....".
    రామదాసు గుడ్లప్పగించి కొడుకునీ, అతని ఖంగారునీ చూస్తుండిపోడం వల్ల చిరంజీవి అక్కడితో ఆగిపోయాడు.
    అప్పుడు రామదాసు అన్నాడు___
    "తోక కనిపిస్తే చాలు___గాడిదో గుర్రమో ఠక్కున చెప్పటం నాకూ అలవాటేరా! ప్రసాదం ఎలాంటివాడు?"
    "మంచివాడే అనుకో కొంచెం తిక్క రాస్కెల్!"
    "తిక్క రాస్కెలా?"
    "అవున్నాన్నా! అందరిదీ ఒకదారి, వాదిదో దారీను. వాడికి వాళ్ళమ్మా నాన్నా లేరు. వాళ్ళక్క వుంది. సిరిమల్లెలో టీచరమ్మట! వాళ్ళక్కే అతన్ని పెంచిందట. అందుచేత వాళ్ళక్క కోసం వీడేమైనా చేయగలడు. వాళ్ళక్క చెబుతున్న నీతి పాఠాన్ని తూ.చ. తప్పకుండ పాటిస్తాడు వెధవ! ప్రేమించడం బూతని చెప్పి వుంటుంది___ఆ మాట ప్రకారం, సుమతిని ప్రేమించటం మానుకున్నాడు. విడ్డూరంగా లేదు నాన్నా?"
    "వాళ్ళక్క సిరిపల్లెలో టీచరమ్మా? వాళ్ళక్క మాట ప్రసాదానికి వేదవాక్కా? బాగుంది. వాళ్ళక్క పేరేమిట్రా జీవీ?"
    "సీత? సీతక్కంటాడు రవిగాడు గూడాను. రవిగాడు ప్రసాదానికి రూమ్మేటులే! ప్రసాదంతో స్నేహం చేస్తూ వాడి రంగులన్నీ వీడు వంట బట్టించుకున్నాడు ఫూల్!"
    రామదాసు సీత పేరు వినీ వినటంతోటే హతాశులయ్యేరు!
    "నువ్వెళ్ళి పడుకోరా జీవీ! వెళ్ళిపో యిక్కడ్నుంచి," అన్నారు.
    చిరజీవి చేతులూపుకుంటూ వెళ్ళిపోయాడు.
    రామదాసుకి సీత పేరు వినీ వినడంతోనే, గుండెల్లో పోటెక్కువయింది. తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఆ బాధకీ వొళ్ళంతా మెలికలు తిరిగిపోతూండగా 'నన్ను క్షమించు సీత! క్షమించ'మని మూలిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS