అతని వాదనకి నవ్వొచ్చింది జయన్నకి. వెంటనే జాలి కూడా కలిగింది. వెళ్ళేప్పుడు బాగుపడేట్టు! అనుకున్నాడు.
సోము ఇంకేదో అనబోతే వారించాడు జయన్న. బాగా రాత్రి కావటంతో ఒక్కొక్కరే లేచి వెళ్ళారు. ఆఖరికి యిద్దరూ మిగిలారు. చాపలపై మేను వాల్చారు.
14
నలుగురు మంచివాళ్ళు కూడితే సత్కాలాక్షేపం. అదే నలుగురు దుష్టులు కూడితే జరిగేది వ్యర్ధ కాలేక్షేపం. వాళ్ళ నోటికి హద్దు అదుపూ వుండదు. ఆ విజ్రుంభణ ముందు ఏదీ ఆగదు.
నలుగురూ చేరారు రచ్చబండ వద్ద, పేక ముక్కలైంది!
"ఊ! జనార్ధన్ టౌను కెళ్ళాడన్నమాట!"
నాయుడి ప్రశ్నకు సమాధానంగా "ఆ" అన్నాడు చౌదరి.
"ఇప్పటికి ప్రయోజకుడైనాడు, " అన్నాడు ధర్మారెడ్డి.
"అసలు అప్రయోజనమైంది ఏముంది? సృష్టిలో అంతా ప్రయోజనకరమైనవే! మనం వాడుకోవటంలో వుంది. పాషాణం ప్రాణం తీస్తుంది. ప్రాణాన్నీ ఇస్తుంది. భగవంతుడు సూర్యభగవానుడిలా వెలుగునిచ్చే విద్యుచ్చక్తి ప్రాణాల్ని తీస్తుంది. ఆ మాట కొస్తే ఆ సూర్యనారాయణమూర్తి ఎండ దెబ్బ కొట్టి ప్రాణాల్ని తీస్తాడు కదా!" శేషయ్య వ్యాక్యానించాడు.
"స్మామిజీ ఏమంటున్నాడు?"
"బాబాజీగారా! యిప్పటికేమో సుష్టుగా భోంచేస్తున్నాడు. పూజలు చేస్తున్నాడు. ప్రజలు వట్టి గోడ్లయ్యా తిండికి లేదంటారు . ఎక్కడ నుంచి తెస్తారో రోజూ స్వామి పూలూ పళ్ళు తెస్తారు.
"ధర్మారెడ్డి! అదంతే , మనూళ్ళో అంతా బీదరకం వాళ్ళేనా? అందరికీ జూదం అలవాటుంది. అదేక్కడి నుంచి తెచ్చి ఆడుతున్నారు?"
శేషయ్య మాటలకి అతనేం అన్లేదు.
అంతలో శేఖర్ వచ్చాడు వూరి నుంచి ఆ వుదయం యిద్దరూ టౌన్ కి వెళ్ళారు. అతన్ని చూడగానే "జనార్ధన్ ఏడీ?" అని అడిగేడు శేషయ్య.
"అయన అక్కడే వున్నారు!" ముభావంగా అన్నాడు శేఖర్.
"వెధవ చేష్టలు వెధవ బుద్దులూనూ - ఏం కొంప మునిగిందని పరుగెత్తుకుని వచ్చావు? బుద్ది లేదూ ? వాడి నోక్కడినే వదిలోచ్చావా?" చివాట్లేశాడు శేషయ్య కిక్కురు మనలేదు శేఖర్.
అంతలో నాయుడు షో చేశాడు.
శేషయ్య కౌంటు బాకీ పెట్టేడు.
"బాబాజీ గారిని పేకాటలో గెలిచే మార్గం అడగాలి."
"మంత్రమా?"
"మంత్రమా! తంత్రమా! నువ్వు గెలుస్తున్నావుగా!"
"నువ్వు అప్పు పెట్టవుగా!"
"అప్పైనా తీర్చేదా గదా!"
"తీర్చినప్పటి సంగతిలే!"
"అయినా బాబాజీనీ యింట్లో మకాం పెట్టెక నీకు బాగానే జరుగుతోందిలే!"
"ఏం జరిగింది!"
"అది నీకే తెలుసు. అన్నట్లు బాబాజీతో చౌదరికీ ఓ మంత్రం వేయించాలి!"
ఉలికి పడ్డట్టయి "ఎందుకు!" అన్నాడు చౌదరి.
"నే చెప్పనా?" అన్నాడు శేఖర్.
అతని వైపు చూశాడు చౌదరి.
"భార్గవి లొంగిరావడానికి" కిసుక్కున నవ్వేడు.
భార్గవి ప్రసక్తి రాగానే వెచ్చని ఆవిర్లు వచ్చేయి చౌదరికి. నలబై ఏళ్ళ వయసులోనూ అతనికి రోమాంచితం అయింది.
"దేవీ ప్రసన్నతకు జపం చేయలేమా!"
"అన్నిటికీ కష్టపడటంలా! యిష్టపడే చోట కష్టపడితేనేం?"
