Previous Page Next Page 
వారుణి పేజి 32


    అక్కడ క్షణమైనా నిలువలేకపోయింది వారుణి.
    నారాయణ, సుబ్బరత్నమ్మ లేచివెళ్ళారు. ఫణి తన గదికి వెళ్ళిపోయాడు. సావిత్రి వంటింట్లోకి వెళ్ళింది. పద్మ తన స్టడీ రూంలోకి సరోజతోపాటు వెళ్ళింది. సారధి ఒక్కడూ మిగిలిపోయాడు హాల్లో.


                                           14


    ఉప్పెనలా ముంచుకొచ్చింది దుఃఖం. ఏమాశించింది తను?
    అనురాగమూర్తి అయిన భర్త ప్రేమారాధనలు.
    తనతోపాటు తననికూడా సమానంగా చూడగలిగిన మనస్థత్వం. తను ఊహ తెలిసినప్పటినుంచీ తన మనసులో ఒక రసరమ్యమూర్తిని ఊహించుకుంది.
    శ్రీరామచంద్రుడిలా ఏకపత్నీవ్రతుడు_
    శ్రీకృష్ణుడిలా రసికుడు_
    సత్యభామా విధేయుడిలా భార్యని అనురాగంగా చూసేవాడు. తనవాడు కావాలని కోరుకుంది.
    తను అందగత్తె_ చదువుకున్నది.
    తను దారంట నడుస్తూంటే వేల కళ్ళు ఆశగా, ఆబగా చూసేవి. కానీ తను ఆ కళ్ళతో మండిపోయే ఆ కళ్ళని ఎప్పుడు కోరుకోలేదు.
    ప్రేమాలయాలై వలపులోగిళ్ళలో_ ప్రణయభావాలు ఊసులాడగలిగి ఒక జనమంతా చేసిన తపస్సుకి ఫలితంగా ఈ స్త్రీ దక్కిందని అపురూపంగా చూసుకునే కళ్ళని కోరుకుంది.
    తొలిసారి ఉద్యోగంలో చేరిన రోజు యిప్పటికీ క్షణక్షణమూ, అక్షరాక్షరమూ గుర్తుంది.
    తనది కెమిస్ట్రీ డిపార్టుమెంటు_ డ్యూటీలో జాయినవగానే ప్రిన్సిపాలు డిపార్ట్ మెంట్ హెడ్ ని పిలచి అందరికీ పరిచయం చేయమన్నారు. తమ డిపార్ట్ మెంట్ హెడ్ రాజుగారు. ఆయనకి పెద్ద బొజ్జ వుండేది. కదిలితే భరతనాట్యం చేస్తూండేది. ఆయన తనని స్టాఫ్ రూంకి తీసుకెళ్ళి ఒక్కొక్కరినే పరిచయం చేశారు.
    అందరి కళ్ళల్లో ఒక వినూత్న సౌందర్యాన్ని చూస్తోన్న భావన. ఆ కళ్ళలో ఆశలు వాంఛలు విషసర్పాల్లా బుసలు కొట్టాయి.
    తన నాసిక గరుడాశ్వారులా వుండేది. ఈ సర్పాలేం చేయగలవు? ఒక చూపుతో ఆమడదూరం పరుగెత్తుతాయి. అందునా విషయ మగపురుగులు. ఒక్కో డిపార్ట్ మెంటుకి తీసుకెళ్ళి పరిచయం చేశారాయన.
    ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ మోస్ట్ సారధి. ఆయనకి తనని పరిచయం చేస్తూంటే ఎక్కడో ఎన్నడో తప్పిపోయిన ఫ్రెండ్ దొరికినట్టనిపించింది. తన జీవిత రథసారధి యితనే అవుతాడని ఆ క్షణాన అనుకోలేదు. క్లుప్తంగా నమస్కరించి గౌరవంగా తనవైపు చూసిన ఆ కళ్ళల్లో తనకి ఆరాధనా ధావాలే కనిపించాయి. పరిచయం స్నేహంగా మారింది.
    పక్కవీధే ఆయనది. ఇద్దరి బస్సు రూటూ ఒకటే. రోజూ ఆయన కళ్ళు బస్సు స్టాపులో తనకోసం ఎదురుచూస్తున్నట్టుగా అనిపించేది. సాయంకాలం బస్సు దిగి వెళ్ళేముందు మళ్ళీ రేపే కదా కలుసుకోవటం అనిపించేది.
    ఆ రోజు ఆయన బర్త్ డే! కాలేజీలో అందరికీ పార్టీ యిచ్చాడు. అందరూ గ్రీటింగ్స్ చెప్పారు. తను ఆఖర్న ఎవరూ లేకుండా చూసి శుభాకాంక్షలు చెప్పింది. ప్యూనుతో తెప్పించిన బాపూ బొమ్మ బహూకరించింది.
    రెండు విశాలమైన కళ్ళని ఆరాధనగా చూసే మరో రెండు కళ్ళు.
    అది ప్రేమకి నాందీగా అప్పుడు తను అనుకోలేదు.
    ఆ రోజు అతన్ని తనే యింటికి ఆహ్వానించింది. ఆ రోజు తన పుట్టిన రోజు. అత్తయ్య తలంటి తలకి పోసింది.
    లేత సిమెంట్ కలర్ ప్రింటెడ్ చీర కట్టుకుంది. అదే రంగు జాకెట్. జడలో మల్లెలు. ముఖాన తిలకం, కళ్ళకి కాటుక, కాళ్ళకి అందెలు గొలుసులు, మెడలో సన్నని ఒంటి పొర చెయిన్_చెవులకి ముత్యాల జూకాలు.
    "పదహారు వెళ్ళాయా! వచ్చాయా!" కోవాబిళ్ళ, బిస్కట్, మిక్చర్ యిచ్చిన తనతో అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS