Previous Page Next Page 
నేను పేజి 32


    "భయంలేదు" బుజ్జగిస్తోన్నట్లుగా అని వాళ్ళవైపు చూసి మీ ఆగడాలకు హద్దూ, పద్దూ ఉండఖ్కర్లేదురా. ఈ అమ్మాయి జోలి కొచ్చారంటే అంతుచూస్తాను." అన్నాడు.  


    "అలాగా?" అంటూ వాడు ముందుకొచ్చి సుకుమార్ తో కలబడ్డాడు. సుకుమార్ లో అంత బలమూ, ధైర్యమూ ఉన్నదని తెలీదు. నన్ను ప్రక్కకి జరిపి ఆ వ్యక్తితో ఢీ కొన్నాడు. ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తున్నాను. మధ్య మధ్య బలమైన దెబ్బలు తగుల్తున్నా సుకుమార్ దే పైచేయిగా ఉంది. ఆ వ్యక్తి ఎంత రెచ్చిపోదామని ప్రయత్నిస్తోన్నా సుకుమార్ పడనివ్వటం లేదు. రెండో వాడు ఈ సంగతి గమనిస్తూనే ఉన్నాడు. సుకుమార్ తో తలపడేవాడు క్రింద పడిపోయే స్థితి వొచ్చేసరికి, చేతిలో నిస్సహాయంగా ఇమిడిపోయి ఉన్న పిల్లను బొమ్మను తోసేసినట్లు క్రిందకు తోసేసి సుకుమార్ మీద పడ్డాడు. చేతిలో ఉన్న ఆయుధంతో తల మీద మోదటం కనిపించి "సుకుమార్ అని అరిచాను ఆతృతగా."    


    అప్పటికే సమయం మించిపోయింది. ఆ వస్తువు తలమీద బలంగా పడటం, తల చిట్లి రక్తం కారుతూండగా రెండు చేతుల్తో అదుముకుంటూ సుకుమార్ "అమ్మా" అని కుప్పకూలిపోతూ ఉండటం కనిపించింది.    


    "సుకుమార్" అని మళ్ళీ అరుస్తూ ముందుకు పరిగెత్తి గట్టిగా పట్టుకున్నాను.


    ఆ గూండాలు మళ్ళీ మీద కొస్తున్నారు.


    అంతలో రెండు కార్లు అటువైపు వేగంగా దూసుకురావటం. ఆ గలభా జరుగుతూన్న స్పాట్ లో ఆగటం గబగబా జరిగిపోయాయి. తలత్రిప్పి చూసేసరికి ఓ కారులోంచి శమంతకమణి, కొందరు మనుషులు దిగుతూ ఉండటం కనిపించింది. వెనక ఉన్న కార్లోంచి కూడా మనుషులు గబగబా దిగుతున్నారు. ఇద్దరు నా చేతుల్లోంచి బరువుగా జారిపోతున్న సుకుమార్ ని తీసుకున్నారు.       


    "ఏరా ఒళ్ళు పొగరెక్కిందా లం.... కొడుకులారా. కనిపించిన ప్రతి ఆడదీ సొంతమనుకున్నారా?" శమంతకమణి గొంతు ఖంగ్ మని గర్జిస్తోంది.   


    "ఏం.... ఏం చేస్తావేం?"


    "ఏం చేస్తానా?" అంటూ ఆజ్ఞ ఇస్తూన్నట్లు తన మనుషుల కేసి చూసింది. అంతే నాలుగే నిమిషాలు నా కళ్ళముందు మారణహోమంలా జరిగిపోయింది. అంతవరకూ హీరోల్లా చెలరేగి పోయిన గూండాలిద్దరూ తలలు పగిలి, జాయింట్లు విరిగి, నెత్తురోడుతూ నేలమీద పడి దొర్లుతున్నారు. వాళ్ళ పరిస్థితెంత ఘోరంగా ఉన్నదంటే, చచ్చిపోతారేమోనని భయమేసింది.


    శమంతకమణి నాదగ్గరకొచ్చింది.


    "సతీ! రా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను."


    "సుకుమార్...."


    "అతనికేం ప్రమాదం లేదు. నా మనుషులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు."


    "నాక్కూడా చాలా బలహీనంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది."


    మాట్లాడకుండా కారెక్కాను. శమంతకమణి డ్రైవ్ చేస్తోంది. వెనక నలుగురు ఇరుక్కుని కూచున్నారు.    


    ఇంటికి చేరే దాకా ఏమీ సంభాషణ జరగలేదు. జరిగిన సంఘటనలన్నీ సినిమా రీల్లా తల్లో గిర్రున తిరుగుతున్నాయి.     


    ఇల్లు రాగానే దిగిపోయాను.


    "నేనేదో గొప్పపని చేశానని, నిన్ను వుద్ధరించాననీ ప్రగల్భాలు పలకను. ఈ ప్రపంచంలో సాయం అనేది లభించటం ఎంత దుర్లభమో కొంతవరకైనా గ్రహించి ఉంటావు. ఏదో వెతుక్కుంటూ కాలాన్ని కాల్చెయ్యకుండా సాధ్యమైనంత త్వరలో నా దగ్గరకొస్తే నీ జీవితం ఓ కొత్త మలుపు తిరుగుతుంది. నా స్నేహహస్తమెప్పుడూ నీవేపు జాచే ఉంటుందని మరిచిపోకు."


    కారు కదిలి వెళ్ళిపోయింది.


    సుకుమార్ ని చూడాలని చాలా అన్పిస్తుంది. ఇంతవరకూ ఏ పురుషుడు గురించీ నా మానసింతగా స్పందించలేదు. అతను పదే పదే గుర్తొస్తున్నాడు. దీన్నేమంటారు? ఇష్టమనా? ఇష్టం వేరు, ప్రేమ వేరూనా? అందరికీ అందుబాటులో లేనిదయితే, అందుకోటానికి అసాధ్యమైనదయితే, ఎందుకనో ప్రేమ ఉనికినే సంశయించాల్సి వస్తుంది.


    సుకుమార్ కెలా ఉంది.


    తెలుసుకోవాలని మనసు తహతహలాడ్తోంది. అతని ఇల్లెక్కడో తెలీదు. తెలుసుకోటానికి శమంతకమణి ద్వారా తప్ప మరో మార్గం లేదు.     


    దాదాపు పదిరోజులు చాలా ఆతృతగా, అస్టిమితంగా గడిచాక, షాక్ ట్రీట్ మెంట్ ఇస్తోన్నట్లుగా ఓ రోజు సుకుమార్ తానే మా ఇంటికొచ్చాడు.     


    ఎంత సంతోషమేసిందో! లోపల్నించి ఆనంద తరంగాలు ఉప్పొంగాయి.


    ఎదురుగా వెళ్ళి రెండు చేతులూ పట్టుకుని సాదరంగా ఆహ్వానిస్తూ లోపలకు తీసుకెళ్ళాను.     


    "అబ్బ! నీకోసం ఎంత ఎదురుచూపులు చూస్తున్నాను. నీ మెడలో పూలదండ వెయ్యాలని ఉంది."


    అతని కళ్ళలో మెరుపు కనిపించింది.


    నా చేతులు రెండూ అలాగే పట్టుకుని కళ్ళలోకి చూశాడు.


    కళ్ళూ కళ్ళూ కలుసుకోవటంలోని మాధుర్యం ఆ సమయంలో మళ్ళీ అనుభవించాను.


    అతన్ని దగ్గరగా హత్తుకోవాలనీ, హృదయం మీద తల వాల్చాలనీ మనసు ఉవ్విళ్ళూరుతోంది.   


    కొంతసేపటికి ఎదురెదురుగా కూర్చున్నాం.


    "సుకుమార్!  ఆ రోజు నువ్వు రాకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. అసలక్కడికి ఎలా వచ్చావు?"


    సుకుమార్ నవ్వాడు. "నీ వాలకం, ఆవేశం చూస్తే ఇంటికి తిన్నగా వెళతావనిపించలేదు. దూరం నుంచే అనుసరించాను  ఆ వాతావరణంలోకి వెళ్ళటం ఆశ్చర్యమనిపించింది. ఏదన్నా ప్రమాదంలో ఇరుక్కుంటావని మనసు హెచ్చరిస్తోంది. ఎంత ఏమరుపాటుగా ఉన్నా మధ్యలో ఏ ఇంట్లో దూరావో కనుమరుగై పోయావు. నీకోసం పిచ్చివాడిలా ఆ వాడకట్టంతా వెదుకుతూ ఉండటంతో, గలాభా, నిన్ను వాళ్ళు లాక్కెళుతూన్న దృశ్యం కనిపించింది. ఆవేశంలో వొళ్ళు మరిచిపోయి వాళ్ళ నుంచి నిన్ను కాపాడ్డానికి ప్రయత్నించాను. శమంతకమణిగారి మనుషులు ఈ ఊళ్ళో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు. ఆవిడకి సెకండ్ల మీద మెసేజ్ వెళ్ళి ఉండాలి. వెంటనే వచ్చి మిగతా పని పూర్తిచేసింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS