Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 32

    "వాడి విషయం విన్నావా?"

    "లేదే?"

    "నువ్వే మనిషివిరా? వాడు బాంకులో రాంగ్ పేమెంటు చేశాడట. అప్పటికప్పుడు బాంకి స్టాఫంతా ఎడ్జస్టు చేశారట. నాన్న ఆ విషయం విని బాంక్ లో స్వాతిపేరుతో వున్న డబ్బు ఎడ్జస్ట్ చేశారుట."

    అది విన్న అయోధ్య ఆశ్చర్యపోయాడు.

    "నిజమా! అయ్యో పాపం ప్చ్!" అన్నాడు.

    "ఏం పాపం అసలు వాడు ట్రిక్ చేశాడేమోనని నా అనుమానం. ఆ డబ్బు తనే దాచేసుకుని యాక్షన్ చేశాడేమో"

    "అదే నేననేది!" అంది జ్యోతి.

    "నో! నో! పట్టాభి అలాంటివాడు కాడొదినా!" ఖండించాడతను.

    "ఎవరెలాంటి వాళ్ళయితే మనకేం మనసొమ్ము నష్టమౌతోంది.

    "మన సొమ్మేవిటి?"

    "ఆ సొమ్ము మనది కాదా? ఈరోజు యిదయింది. రేపు పదివేలు పదిహేనువేలు గల్లంతయిందంటే ఏం చేస్తాడు? ఆ ఇల్లు అమ్మేసి బ్యాంకి సొమ్ము కట్టేసిస్తారు. కాదంటే వాడు జైలుకి వెళతాడు కదా!" అంది జ్యోతి.

    "అన్నయ్యా! యిది మరీ దారుణం!"

    "నీకలాగే కనిపిస్తుందయ్యా? టింగురంగాని బైకు మీద తిరుగుతున్నావు. వేలకివేలు సంపాదిస్తానని ధైర్యం వుంది."

    "వదినా అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడేం జరిగిందని?"

    "ఏం జరగకూడదనే ఆశ! నీ భార్య ఎంప్లాయి. ఈ మధ్య కులాంతర వివాహం చేసుకునేందుకు గవర్నమెంటు డబ్బిచ్చింది. మీ మామగారు అన్నివిధాలా ఆదుకుంటారు. కులం పోతేనేం తంతే గారెలబుట్టలో పడ్డట్లు నీ పని దివ్యంగా వుంది. ఇక త్వరలోనే బ్యాంకిలో క్లర్క్ గా తీసుకుంటారటగా" ఆమె మాటల్లో అసూయ కనిపించింది.

    నవ్వాడు అయోధ్య అదే సమాధానమన్నట్లుగా.

    "దానిదేం వుందిలే! కష్టపడుతున్నాడు సుఖిస్తున్నాడు ఎదిరించాడు_ఆమెని చేసుకున్నాడు. హాయిగా వున్నాడు. అసలు విషయం వదిలేసి మిగతా మాటలెందుకు?" అన్నాడు జానకిరాం.

    "అసలు విషయమేమిటి?"

    "ఏమున్నది మనం యింటిలో నుంచి బయటికి వచ్చాం కదా! మనవాటా మనం అడిగేద్దాం_అంతే!"

    "వాటానా?"   

    "అవును మనం మొత్తం ఎనిమిది మందిమి. నాన్నతో, అమ్మతో పదిమందిమి. మన యిల్లూ పెరడూ అంతా కలిసి యాభైవేలుదాకా అవుతుంది. వాటానికి అయిదువేలు! మన రెండు వాటాల డబ్బు అడిగేద్దాం!"

    "ఇప్పుడు నాన్న పదివేలు ఎక్కడినుంచి తెచివ్వగలడు?"

    "ఎలా యిస్తారో మనకెందుకు?"

    అయోధ్యరాంకి వాళ్ళ మనసేమిటో అర్ధమైంది విచారంగా అన్నాడు_

    "అన్నయ్యా! వదినా! ఇదేం బాగాలేదు. మనకి చదువు, సంధ్య చెప్పించారు. ఉద్యోగాల్లో వేయించారు_ కోరిన వారిని పెళ్ళిచేసుకోనిచ్చారు."

    "తల్లిదండ్రులుగా అది వాళ్ళ ధర్మం. దానికే ఏంటి అంతగా పొగిడేస్తున్నావ్?" జ్యోతి నిరసనగా అంది.

    "కావచ్చు! మనం బయటి కొచ్చినంత మాత్రాన ఆయన మనసుమీద దెబ్బ తీయాలని ఎక్కడుంది? ఆమాట కొస్తే... ఆయనకే మనం కొంత సొమ్ము యివ్వాలి."

    "ఎందుకివ్వాలి? ఆయన రచనలు చేసి బాగానే సంపాదిస్తున్నారు. రామాయణం రాస్తున్నారుగా బాగానే డబ్బు వచ్చివుంటుంది" జ్యోతి పుల్లవిరుపు మాటలకి అయోధ్య మనసు తల్లడిల్లిపోయింది.

    "అది ఆయన కష్టార్జితం! దాంట్లో మనం వాటా అడగటం బావుండదు_పెళ్ళి కావలసిన చెల్లి వుంది."

    "అదంతా ఆయన చూసుకుంటారు లేనిపోనిపీడ మనకెందుకు?"

    వదిన అలా మాట్లాడుతుందని, మాట్లాడగలదని వూహించని అయోధ్య తెల్లబోయాడు.

    "కొడుకులంతా ప్రయోజకులై వెళ్ళిపోతే వృద్ధాప్యంలో ఆయన గతేమిటి? విదేశాల విషయం మనకెందుకు. మన సంప్రదాయం, ధర్మం, సంఘనీతి తల్లిదండ్రుల సేవ చేయమని చెబుతోంది?"

    "ఇలాంటి సెంటిమెంట్సన్నీ పెట్టుకుంటే ఇక బాగుపడ్డటే! చివరకి మనకి చిప్పచేతికొస్తుంది."

    "అలా మాట్లాడకొదినా! ఇప్పుడేం కొంప మునిగిపోయిందని? వాళ్ళని వృద్ధాప్యంలో రక్షించటం మన ధర్మం. అది వదిలేశాం మనం."

    "ఆయనే వెళ్ళిపొమ్మన్నారుగా! మనం ఏం చేశాం! ఆయన ప్రవర్తన వల్ల అక్కడ యిమడలేకపోయాం!"

    "నాన్నగారే బయటికి పంపారంటావా? ఎలాగయితేనేం ఆయనకి మన నుంచి యిక దమ్మిడీ ముట్టదుకదా? ఇవ్వటం వదిలేసి ఇంకా అడగటం ధర్మమా! నలుగురూ వింటే వూయరూ?"

    జాలిగా చూశాడు జానకిరాం. ఆ చూపులో ఎంతో సానుభూతి వుంది. "ఎంత తెలివితక్కువవాడివిరా" అన్న భావన వుంది.

    "ఒరే అయోధ్యా! ఈ వాదనలన్నీ ఎందుకు? అవన్నీ అనవసరం. నా మాట వింటావా? వినవా?"

    "ఎందుకు వినడండీ! తప్పక వింటాడు. రేపు ఆయన అయిదువేలూ యిచ్చేస్తే భార్యకి నగలు చేయించుకోడూ?" అందామె.

    "నగలా? వాళ్ళనాన్నగారు బోలెడు పెట్టారామెకి. ఇంతకీ ఏమంటారన్నయ్యా!"

    "ఇదిగో లాయర్ నోటీస్! ఈ పిటీషన్ మీద సైన్ చెయ్! మిగతాదంతా అడ్వొకేట్ చూసుకుంటాడు."

    ఒక్కక్షణం అన్న ముఖం, వదిన ముఖం చూశాడు. మనసులో ఆలోచించుకున్నాడు. తానొక్కడూ ధర్మ సూత్రాలు వల్లించినందువల్ల వచ్చే లాభం కాని, కలిగేమేలు కానీ, ఏమీ లేదనుకున్నాడు. మౌనంగా సంతకం పెట్టాడు.

    మనసు వెనుకాడుతోంది_ చేతులు వణుకుతున్నాయి.

    "దట్స్ గుడ్!"

    "చూశారా నే చెప్పలా?"

    "అన్నయ్యా!"

    "ఊ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS