"వరదంబాబూ! వచ్చేవా? నువ్వు వస్తావని నాకు తెలుసు. వదినపై నువ్వు కోపం తెచ్చుకోలేవు" అంటూ దగ్గరికి తీసుకొంది మీనాక్షి.
"చీకటి పడుతున్నది, నడుస్తూ మాట్లాడుకొందాం పద. వదినా?" అంటూ ఆమె చేతుల్లోంచి తప్పించుకొన్నాడు రాజు.
"ఒక్క నిమిషం ఆగు. ఏటిదగ్గిర బిందె వదిలివచ్చేను" అంటూ కాలు కదిపింది మీనాక్షి.
* * *
ఆ వారం పది రోజులూ ఇంట్లో ఎంతో సందడిగా తిరిగేడు వరదరాజు. మూడు నెలలపాటు పట్నంలో ఒంటరిగా వుండిరావడంతో మనిషిలో ఒక విధమైన చొరవ, ఉత్సాహం పొదలు కొన్నాయి. మరిదిలో మానసికంగా వచ్చిన మార్పులు చూసి మీనాక్షి ముచ్చట పడింది. తమ్ముడికి తనకు తానుగా ఆలోచించుకొనే అలవాటు కలిగిందని శివయ్య భావించేడు. చిన్నాన్నని పూర్ణ క్షణం వదలకుండా తన చిలకపలుకులతో, చిన్నారి చేష్టలతో సంతోష పెట్టింది.
దసరా పండుగ పూర్తయి పట్నానికి వెళ్ళిపోయే ముందు వరదరాజు మనసు ఏటిలోని తేటనీరులా నిర్మలంగా వుంది. 'తను మూర్ఖంగా రావటం మానుకుంటే ఎంత ఆనందాన్ని నష్టపోయేవాడు! ఎందరి మనసుల్ని కలతబెట్టేవాడు!' అనుకొన్నాడు.
కొత్తబట్టలు కట్టుకొని అన్నకీ, వదినకీ నమస్కరించి, పూర్ణని ఎత్తుకు ముద్దులాడి పట్నందారి పట్టేడు వరదరాజు. వీథిలో కాలు పెడుతూంటే "మళ్లా ఎప్పుడు రావడం వరదం?" అంది మీనాక్షి.
"అంతా సవ్యంగా సాగిపోతే పరీక్షలయాక వస్తాను వదినా! లేక ఈ లోగా ఏదైనా అవసరపడితే, నువ్వు ఎప్పుడు రమ్మని కబురుచేస్తే అప్పుడే వస్తాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం కాబట్టి" అన్నాడు.
మీనాక్షి వరదరాజు జవాబుతో సంతోషించింది. ఇంక అతడి చదువుకి ఏమీ ఆటంకం రాదని నిర్ధారించుకొంది.
"చిన్నాన్నా....నేనూ నీతో ఊరికి వత్తా" అంటూ వెంట బడింది పూర్ణ.
"ఇదిగో, నేను చదువు పూర్తిచేసి వుద్యోగంలో చేరగానే అమ్మనీ, నాన్ననీ, నిన్నూ అందరినీ పట్నం తీసుకుపోతాను" అంటూ పూర్ణ బుగ్గ పుణికి ముద్దు పెట్టుకొన్నాడు.
ఈ సారి ఏరుదాటి పట్నంలో కాలుపెడుతూంటే ముందు మాదిరిగా దిగులు కలగలేదు వరదరాజుకి. ఏదో సాధించాలన్న వుత్సాహం, పట్టుదల కలిగేయి. జీవితమంతా కళ్ళముందు పరచుకొన్న పచ్చని పచ్చిక మైదానంలో సుందరంగా కనిపించింది.
హాస్టలుగదిలో కాలుపెట్టి, బట్టలు, పుస్తకాలు సర్దుకొంటుంటే తను ఊరికి వెళ్ళబోయే ముందురోజు జరిగిన వృత్తాంతం రాజుకి గుర్తుకి వచ్చింది. 'వాళ్ళ మేడ చూసేందుకు మరునాడు వస్తానన్నాను. ఊరికి పోవడంచేత ఆ రోజు వెళ్ళడం పడలేదు. తనకు తానుగా చూస్తానని కోరిరాలేదేమో అనుకొని వుంటారు. సాయంకాలం అటువైపు ఒకసారి పోయిరావాలి.'
కాలేజీకి పోతూ నిశ్చయించుకొన్నాడు రాజు.
సెలవులు పూర్తిఅయిన మొదటిరోజు క్లాసులో పాఠాలేం ఉత్సాహంగా లేవు. ఇళ్ళకి వెళ్ళిన పిల్లలు చాలామంది ఇంకా తిరిగి రాలేదు. ఆఖరి పిరియడ్ తీసుకోవలసిన ఇంగ్లీషు టీచరు రాలేదు.
నాలుగు గంటల ప్రాంతంలోనే రాఘవయ్యగారి మేడవైపు నడక సాగించేడు రాజు. గేటు ముందు ఎర్రయ్య స్థానంలో ఇంకొకడు వున్నాడు. లోపలికి వెళ్లేందుకు వీలులేదని అడ్డగించేడు.
"నా పేరు వరదరాజు, మీ అయ్యగారితో చెప్పు" అన్నాడు రాజు.
"అయ్యగారు ఊళ్లో లేరు" అన్నాడు వాడు.
"పోనీ, వారి అమ్మాయిగారితో...."
"అమ్మాయిగారు ఇంట్లో లేరు...."
ఏమాట చెప్పినా వీలులేదనే అడ్డగించేడు కాపలావాడు. వాడు ఎర్రయ్యకొడుకు. తండ్రి పనిమీద ఊరికిపోతే తిరిగివచ్చేవరకూ ఆ పని తను చేస్తున్నాడు.
మేడమీదకాని, తోటలోకాని, ఎవరైనా కనిపిస్తారేమో అని ఇటు అటు చూసేడు రాజు. ఎక్కడా మనుష్యులున్న అలికిడి లేదు. 'కాపలావాడు చెప్పింది నిజమే అయి వుంటుంది. ఇంట్లో ఎవరూ వున్నట్లులేరు' అనుకొన్నాడు.
అనూరాధ నాలుగైదు రోజులవరకూ వరదరాజు కోసం చూస్తూనే వుంది. ఆ పిల్లడిని చూడగానే ఎందువల్లో మంచివాడు అన్న భావం ఆమెకు కలిగింది. మరునాడు వస్తే ఇల్లంతా చూపించాలనుకుంది. 'ఇటు వంటి మేడలు, తోటలు ఎప్పుడూ చూసివుండడు. అందుకే అంత సంతోషంగా మరునాడు వస్తానన్నాడు' అనుకొంది.
తన గదిని, పుస్తకాలను అందంగా అమర్చుకొంది. స్కూలు నుంచి రోజూ కన్న ముందుగా వచ్చి అలంకరించుకొని కూర్చుంది. కూతురు గది సర్దుకొంటుంటే తల్లి వచ్చింది. "ఈ రోజేం ఇటువంటి బుద్ధి పుట్టింది?" అంటూ ప్రశ్నించింది.
వరదరాజు మాట చెప్పింది అనూరాధ.
"ఇల్లు చూస్తానంటే ప్రతి గదీ చూపిస్తారేమిటి? ముందు హాలు, వరండాలు చూపించండి చాలు. వాడి సంగతి చూస్తూంటే ఇల్లూ, వాకిలీ పరిశీలించి దొంగాళ్ళకి ఆనుపానులు చెప్పేరకమేమో అనిపిస్తున్నది నాకు" అంది తల్లి.
"ఆ పిల్లడు అటువంటివాడు కాదమ్మా? నాన్నగారే ఇల్లంతా చూపించమన్నారు. ఆ కుర్రాడేం అడగలేదు" అంది అనూరాధ. ఎవరో తెలియని ఆ పిల్లడిని వెనుక వేసుకువస్తూ.
