ఇంత విన్న రామదాసు నిశ్చేష్టులై పోయారు!
గతంలో ఒకానొక నీడ దెయ్యం లా వచ్చి వారి వెన్ను మీద గట్టిగా చరిచినంత పనై పోయింది! చిరంజీవి చేసిన పాడుపనిని వొదిలి పెట్టి గతంలో దయ్యాన్ని తలచుకుని వారు నిశ్చేష్టులయ్యారు.
తండ్రికి తగ్గ కొడుకునే కన్నారని వారు చప్పున గ్రహించి తలోంచుకున్నారు. మళ్ళా తలెత్తి సమయానికి గుండెల్లో గూడు కట్టుకున్న భయానికి కాళ్ళొచ్చి పారిపోవడమే గాకుండా, అకాళీ స్థలంలో వెర్రి కోపం ప్రకాశించి తిష్ట వేసింది. అయన చాలా నెమ్మదిగా అన్నారు.
'అవునోయ్ ప్రసాదం - ఇదంతా నన్ను నమ్మమంటావా?"
"మీ చిరంజీవిని గూడా అడగండి సార్! అవసరమైతే సుమతిని గూడా తీసుకొస్తాను. ఇద్దర్నీ నించోబెట్టి నిజాన్ని తెలుసుకోండి సార్!"
రామదాసు మరింత లౌక్యంగా అన్నారు.
"అడగోచ్చనుకో తర్వాత ఎల్లాగో అడుగుతాను. తప్పుతుందా మరి! సమస్యంటూ నెత్తి కెక్కి కూచున్న తర్వాత , దాన్ని మోస్తూ తిరగడం నా కలవాటు లేదు. అదలా ఉంచు. ముందు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను. జవాబు చెప్పాలి."
"అడగండి ."
"ఏ తండ్రి తన కొడుకుని దోషిగా వప్పుకోడు. అట్లాటిది నేనెంతటి పుర ప్రభువునైనా, జనవాక్యం నమ్మలేదుగా. వాడు నిజానికి నా కంటికి రామచంద్రుడే! నేను గనక, పుర ప్రభువు పదవిలో వున్నాను గనుక నా బిడ్డని దూషించి నువ్వు క్షేమంగా ఉన్నావ్. నాకీ పదవి గాని, ఈ పెర్సనాలిటీ గాని లేకుండా వుండి వుంటే నువ్వింకా నా ఎదుట కూచునే అవకాశం - చిరంజీవి పేరు వినడంతోటే పోగొట్టుకునే వాడివి. ఆఫ్ కోర్స్ - నీకు చిన్న గాయం కూడా ప్రసాదించి వుందును. సరే, మావాడు దుర్మార్గుడంటున్నావ్. నీ మాటే నమ్ముదాం. సుమతికి చిరంజీవి ఎంతటి ప్రండో , నువ్వూ అంతటి ఫ్రండువే. లేకపొతే , ఆ పిల్ల సొంత విషయాన్ని - అ డర్టీ లవ్ స్టోరీని నీకెందుకు చెబుతుంది? క్వేశ్చేన్ నెంబర్ టూ - ఆ పిల్లకి మావాడెంత దగ్గిరో నువ్వు అంత దగ్గిర్లోనే వున్నావు గనుక, నువ్వెందుకు చేసి వుండకూడదు. నువ్వు చేసిన పాపాన్ని మావాడికి అంటగట్టు తున్నావని నేనేంటే నువ్వేమంటావ్?"
ప్రసాదం అకస్మాత్తుగా లేచి నుంచున్నాడు.
"సార్!" అన్నాడు ఆవేశంగా.
చూసేవా? నువ్వు వెధవ్వి అని నేను అన్నానో లేదో గావుకేక పెట్టి నించున్నావ్! నా అంతటి వాడిని, ఒక పుర ప్రభువుని పట్టుకుని మీ అబ్బాయి వెధవయ్యేడంటే నేనేమైపోవాలి? వెళ్ళిపో పిచ్చివాడా? అనుభవం లేని పనుల్లో తలదూర్చకు. ఏదైనా మాటాడదలచుకుంటే ఆ పిల్లే వచ్చి మాటాడుతుంది. నీకెందుకీ శ్రమ చెప్పు! ఇది ప్రేమగోల. తలో , తండ్రో - అన్నో , తమ్ముడో తప్పించి దీంట్లో మూడోవా డేవ్వడూ చెయ్యి పెట్టడానికి వీల్లేదు. వెళ్ళిపో యింక," అన్నారాయన లేచి వెళ్ళిపోతూ- మేడ మెట్లెక్కుతూను.
ప్రసాదానికి వెర్రి కోపం వచ్చింది. కోపాన్నంతా అతి ప్రయత్నం మీద దిగమింగుకుని, ఒకే ఒక్క మాట అన్నాడు.
"ఏమిటో అనుకున్నాను. ఇప్పుడర్ధమైంది సార్ - కిరాతకం రాజకీయం కలిసే బతుకుతాయని!"
* * *
ఆ రాత్రి చిరంజీవి యింటికి ఆలస్యంగా వచ్చేడు.
భోజనం చేస్తున్నప్పుడు వెంకటస్వామి అన్నాడు -
"నాన్నగారికి మళ్ళా గుండెనొప్పి వచ్చిందట బాబూ! గదిలో పడుక్కుని వున్నారు."
ఆ మాట విని చిరంజీవి నవ్వుకున్నాడు.
"మళ్ళా నాన్నకేవడో దుష్టుడు ఎదురు నిలిచేడు. ఈమాధ్య ఈపాడు గుండెనోప్పులు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువ కావూ - చాలామంది పాపం పోర్టీపోలియో కోసం పడిగాపులు కాస్తున్నారాయే! ఎక్కడ చచ్చేది? ఎన్ని ఉపప్రభువు లిచ్చేది? నాన్నని దేవుడే కాపాడాలి!
చిరంజీవి భోజనం ముగించి రామదాసు గారి గదిలోకి వెళ్ళాడు. అయన మంచం మీద పడుక్కుని వున్నారు.
అయన మొహంలో దిగులు స్పష్టంగా కనుపించడం లో చిరంజీవి చాలా ఆశ్చర్యంగా అడిగాడు.
"ఏమిటి నాన్న! నిజంగా గుండె నొప్పేనా కొంపదీసి?"
రామదాసు చిరంజీవిని దగ్గిరగా రమ్మని సైగ చేసారు. చిరంజీవి అయన దగ్గిర కొచ్చి నిలబడ్డాడు.
"అవునోరేయ్! నా జీవితంలో 'నిజం' చచ్చిపోయి చాలా కాలమైపోయింది. నేనేం చేసినా నటనే! నిజంగా చచ్చినా నా శవాన్ని కాల్చరు మీరు. మళ్ళా బతికి బయటపడతా నేమో ననే అనుమానం మీకు. ఇక నేను నటించలేనురా జీవీ! నేను అలసిపోయేను. ఈ నటనతో బాగా నలిగిపోయెను!" అన్నారాయన. బాగా అయాసపడుతూ!
చిరంజీవి మరింత ఆశ్చర్యపోయేడు. చాలా వినయంగా అన్నాడు.
"క్షమించు నాన్నా!"
"నీదెం తప్పు కాదురా! తప్పు నాది. ఏది నిజమో, ఏది నటనో నీకెలా తెలిసేడుస్తుంది? ఆ అవకాశం నీకు నేనెప్పుడిచ్చేను గనక తెలీడానికి?"
చిరంజీవి నిశ్శబ్దంగా తలొంచుకు నుంచున్నాడు.
"ఒరేయ్ నాన్నా! చిరంజీవీ! నీకు సుమతి తెలుసునట్రా?"
తండ్రి యింత అకస్మాత్తుగా సుమతి పేరు తలవడంతో కొడుకు గాలి పీల్చుకోలేక పోయాడు. అబద్దం చెప్పడానికి టైం చాలక-----
"తెలుసు అంటే ఏ రకంగా తెలుసు? మీ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్ గానా? నీ లీడర్ షిప్ ని వర్షిప్ చేస్తున్న అభిమాని గాన? లేక నిన్ను నమ్ముకున్న ప్రియురాలిగానా? ఎలా తెలుసున్రా నీకు? ఫర్లేదు. చెప్పు నేనేమీ అనుకోను చెప్పరా జీవీ! చెప్పు!"
చిరంజీవి నీళ్ళు నముల్తూ అన్నాడు.
