"అందరూ ఏలిముద్దర్లేశారా!"
"ఆ అప్లికేషన్ ఫారం తయారైపోయింది"
"బ్యాంకికి ఎప్పుడెల్తారు?"
"ఏమో! రేపో ఎల్లుండో!"
"ఏదో మంచి రోజ్జుసి బయలేల్లండి!"
"ఏం మంచిరోజు మొన్న అమాసంట. ఏమయితదో మరి. అవతారమయ్యా ఏం బాగాలేదన్నాడు." అన్నాడో వ్యక్తీ బీడీ ముట్టిస్తూ.
నవ్వాడు జయన్న. "ఏం కాదులే, గవర్నమెంటు బాకీ యిస్తుంది."
"ఎంతిస్తదేమిటి?"
"మన కెంత అవసరమో! అంతే యిస్తుంది."
"ఎయ్యి యిస్తుందా?"
"ఎందుకు?" ముసలయ్య ఆసక్తి గమనించి అడిగాడు జయన్న.
"నా బిడ్డ పెండ్లప్పుడు అప్పుజేసినా , అది కట్టియ్యాలని.
"అట్లా చెయ్యొద్దు. దాంతో పొలానికి ఎరువులు వెయ్యి. బాగా పండించు. ఫలసాయంతో అప్పు తీర్చు సలహా చెప్పాడు జయన్న.
"మనం ఎగసాయం చేసి అప్పు తీరస్తామా? అదయ్యే దేనా! నాకు అరవై ఏండ్లు వచ్చినయంట. ఎప్పుడూ దేకనూ నాకనూ అంతే యాడమిగిల్చి అప్పు తీర్చేది!" నిరాశగా అన్నాడు.
"ఇదయినా అప్పే గదా!"
"గవర్నమెంటు అప్పు దేంది! ఇస్తే తీర్తది. ఇయ్యకుంటే వుంటది. ఆసామి మాదిరి గాదులే!"
"మన సొసైటీ అల్లా వుండకూడదు. సరిగా ఖర్చు చేసుకుని తిరిగి సమయానికి అప్పు చేల్లగోట్టాలి. అంతే! అల్లా అయితేనే మనకు లాభం!"
"నాభామో నట్టమో ముందు లెక్క దెప్పించు!"
"ఇదిగో యిలాటి వాళ్ళుండబట్టే మనం యిలా వున్నాం!" అన్నాడు సోము.
"ఏం జరిగిందిరా?"
"ఏం జరుగుతుంది! మన బతుకు లిట్టాగే వున్నాయ్. ఇంత వూరుంది. మన గూడెం లో బడి పెట్టి యాభయ్ ఏళ్ళయింది. ఒక్క జోసఫ్ లెక్చరర్ అయినాడు. ఇంకోడు మేస్త్రేటు కోర్టులో గుమాస్తా . అందరూ యాడున్న గొంగళీ అంటే ఏసినసోటే అన్నట్టున్నాం!"
"చదివి ఏం జేస్తాం? ఉన్న వూరు యిడిచి యాడికి పోతాం! సదువుకుంటే కడుపు నిండతదా? కూలి జేసుకుంటే కూడు బుడటది!"
నిట్టూర్చాడు జయన్న. సోము వైపు విచారంగా చూశాడు.
"ముసలయ్యా! ఇవన్నీ నూరేళ్ళ నాటి మాటలు. మనకు ప్రభుత్వం అండ వుంది. ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది. తిండిపెట్టి, గుడ్డలు యిచ్చి పుస్తకాలు యిచ్చి జీతాల్లేకుండా చదువులు చెప్పిస్తోంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుంది. అయినా మనలో వున్న యీ నిర్లక్ష్యం యీ వైరాగ్యం మనల్ని యిలా చేస్తున్నాయి. మనం వృద్దిలోకి రాకుండా వున్నాం!"
"ఏమోనబ్బా! మాకేం తక్కువైంది. తింటున్నాం, తిరుగుతున్నాం. పెండ్లిండ్లయినాయ్. పిల్లలు పుట్టేన్రు. వాళ్ళు పెరుగుతున్నారు. ఇంగెం కావాల్రా!"
ముసలయ్య మాటలు సోములో ఆగ్రహాన్ని పుట్టించాయి. మండే అగ్నిగోళంలా అన్నాడు " సుఖంగా వున్నామా మనం! బ్యాంకులో ఒక్క పైసా అయిన దాచుకున్నామా . అసలు దాచెందుకేముంది? అన్నీ అప్పులు. గాలికి వానకు కూలే కొంపలు. స్వంత పొలం పూడ్చి పెట్టేందుకు కూడా లేదు. మంచి బట్టలేదు. మంచి తిండి లేదు. లోకం ఎలా వుంది. నిద్దర్లేచి కాఫీలు తాగి, టిఫిన్లు చేసి ఇస్త్రీ మడతలు కట్టుకుని అంతా సుఖంగా సంపాదిస్తూ వుంటే మనం ఎలా వున్నాం. తిండిలేదు, బట్టలేదు, కష్టపడాలి. పని కెళ్ళని రోజున తిండి వుండదు. అప్పు చేసి బతకాల!"
నవ్వాడు ముసలయ్య. "అధట్రా నీ బాధ! ఎదవా కాపీలు తాగితే కడుపు నిండుద్దా! పొద్దున్నే సద్ది తిని గంజి నీళ్ళు మజ్జిగ తాగితే వుండే సుఖం, దాన్లలో వున్నయ్యా! వళ్ళు కప్పుకునేందుకు బట్టగావాల గానీ రంగురంగుల బట్ట శుబ్బరంగా కడితే ఎమోస్తాదిరా! సినిమా చూస్తే సుఖపడినట్టా! బాగుందిరా! మనకు కంటి నిండా నిద్రవస్తాదిరా కష్టపడితే! అల్లకి నిద్దరేదీరా!"
