"అమ్మా సావిత్రీ! అంతలా అరవకు తల్లీ!" అన్నాడు నారాయణ.
"చూడండి మామయ్యా! పసిపిల్లదేం వుంది. ఎవరెలా చెప్తే అలా వింటారు." అని వారుణివైపు తిరిగింది. "చూడు మహాతల్లీ" అంత యిష్టమైతే నీవే గజ్జెకట్టు. గజ్జల గుఱ్ఱంలా గెంతులేసి తిరిగు. సంగీతం నేర్చుకొని సంతల వెంట తిరుగు. నా జోలికి, నా కూతురు జోలికి రాకు." ఏడుస్తూ వెటకారంగా అంది.
"సావిత్రీ!" బాధగా పిలిచింది వారుణి.
"ఏమిటమ్మా ఆ పిలుపు. నీకంటే పెద్దది. ఇంటికి పెద్ద కోడలు అక్కలాంటిది. ఆమెని పేరుతో పిలుస్తావా? అదేనా మర్యాద?" సుబ్బరత్నమ్మ సందు దొరికిందని దులపటానికి మొదలుపెట్టింది.
"అబ్బో! ఆమెకి మాటా మర్యాదా తెలియదా! నేనెవరిని. ఈ ఇంట్లో వంటమనిషిని. నేనెంత? నా స్థాయి ఎంత? నేనేం చదువుకున్నానా? సంగీతం తెలుసా? నాట్యం వచ్చా! లెక్చరర్ గిరి వెలగబెడుతున్నానా? ఏం గొప్పని మర్యాద యివ్వాలి. ఎందుకు గౌరవించాలి. పేరుతోనే పిలవనివ్వండి. పిలుపుతో పోయే గౌరవం ఉంటే ఎంత, పోతే ఎంత?" మాటకి మాటకి పొంతన లేకుండా అరవసాగింది సావిత్రి.
వారుణి వెర్రిగా చూసింది.
"ఈమె యీమేనా? తను గౌరవంగా ప్రేమగా అక్కయ్యా అని పిలిస్తే వద్దంది. పేరుతో పిలవమంది. ఆ సావిత్రేనా యీమె?"
"వారుణీ!"
సారధి పిలుపుకి ఉలికిపడింది. భర్తవైపు బిక్కచూపులతో వెర్రిగా చూసింది.
ముందామెకి క్షమాపణలు చెప్పుకో. వదిన అంటే తల్లి తర్వాత తల్లి వంటిది. ఆమె వచ్చిన యీ పదేళ్ళలోనూ ఏనాడూ ఆమె యింత కష్టపెట్టుకోగా చూళ్ళేదు. మా వదిన దైవస్వరూపురాలు. ఆమెని అవమానపరిచావు. ఆమె కాదన్న పని చేశావు. పేరుతో పిలచి మనసు కష్టపెట్టావు.
"అది కాదండీ" సర్ది చెప్పబోయింది వారుణి. వినిపించుకోలేదు సారధి.
"ఏదికాదో ముందామె కాళ్ళు పట్టుకో."
వారుణికి నోటమాట రాలేదు. అతని వైపు నిశ్చైతన్యలా చూసింది.
అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
"ఊఁ క్షమార్పణ చెప్పుకో. లేదా_"
నిర్దాక్షిణ్యంగా అంటూన్న భర్తవైపు జాలిగా చూసింది. "ఇదా ఈ యింట్లో నా స్థానం!" అనుకొని సావిత్రివైపు రెండడుగులు వేసింది.
"వద్దులేమ్మా! నా కాళ్ళు పట్టుకోనక్కరలేదు. కడపూ పట్టుకోనక్కర్లేదు. నా జోలికి రాకుండా నన్నిలా వదిలేస్తే అదే పదివేలు." చటుక్కున జరిగి అంది.
"పోనివ్వండి. ఎందుకీ గొడవలు. అమ్మా వారుణీ సావిత్రికి యిష్టంలేదని తెలిశాక సరోజని ఆ స్కూల్లో ఎందుకు చేర్పించావమ్మా! ఒక యింట్లో కలసిమెలసి వుంటూ యిలా కలత పడటం ఏం బావుందమ్మా" అంది సుబ్బరత్నమ్మ.
"ఆమెకి కలిసి వుండటం యిష్టం లేదేమో? మరో వాగ్భాణం వదిలింది సావిత్రి. విషతిక్త బాణాహతమైన పావురాయిలా విలవిల్లాడింది వారుణి బేలపడిపోయింది.
ఆమె దయనీయస్థితి చూస్తుంటే మహదానందంగా వుంది సావిత్రికి. సంతోషం గుండెల్లోంచి తన్నుకు వస్తోంది. వారుణి ఎమ్మే చదువు, నృత్యం, సంగీతం, తెలివితేటలు తన లౌక్యం ముందు నిలువలేక పోయాయి. చాలా దూరంగా పారిపోయాయి అనుకుంది.
పైకి ఏమీ పట్టనట్టు ముభావంగా వుండిపోయింది. వదిన మాటలకి బాగా రియాక్ట్ అయ్యాడు సారధి.
"అలా అయితే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళుతుంది. అందరిలో తను యిమిడి పోవాలి. తన కోసం అందరూ బాధపడవలసి రావడం ఎందుకు?
కత్తితో రెండుగా నరికినట్టు అన్నాడు సారధి.
భర్తవైపు దెబ్బతిన్న లేడిలా చూసిందామె.
తనని జూదంలో ఒడ్డి ఓడి సభకు యీడ్చుకు వచ్చినప్పుడు ద్రౌపది ధర్మరాజుని అలాగే చూసి వుంటుందా? ఊఁహూఁ. తన సత్యవ్రత రక్షణ కోసం వేలం వేసినపుడు హరిశ్చంద్రుని వైపు చంద్రమతి అలా చూసివుంటుందా? ఊఁహూఁ.
