ఇందాక మంజరితో మాట్లాడిన రజని అనే అమ్మాయి "వెళ్ళి పోకండి. మంజరి ఇప్పుడే వచ్చేస్తుంది. వాడి బొంద. వాడి ప్రభావం నాకు తెలీదూ. ఎంత! రెండు మూడు నిమిషాలు" అంటూ ఫక్కుమని నవ్వేసింది.
"కాదు వెళ్ళిపోవాలి" అంటూ ఆ అమ్మాయి మాటలు వినిపించుకోకుండా బయటికొచ్చేశాను.
శవాన్ని తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. భాజాలు, కోలాటం, కొజ్జా వేషాలు.... ఈ రంగమంతా తయారైపోయింది.
ఎవరో ఒకతను "అమ్మకు దణ్ణం పెట్టటానికందరూ వచ్చారా? ఎవరయినా మిగిలిపోయారా? డ్యూటీలో ఎవరన్నా ఉంటే తొరతొరగా ముగించుకుని వచ్చెయ్యండి. కావాలంటే మళ్ళీ తర్వాత డ్యూటీలో జాయినవవచ్చు."
శరీరాన్నెవరో గరుగ్గా ఉన్న రంపంతో పర పరా కోస్తూన్నట్లయింది. ఆ వాతావరణం లోంచి వెంటనే బయట పడిపోవాలి.
వడివడిగా నడుస్తున్నాను.
అబ్బ! ఈ మనుషులెంత వికృతమైన వాళ్ళు ఏదయితే అసహ్యమో అటే పరుగులు తీస్తుంటారు. ఈ అక్రమ సంబంధాలు, అర్థం పర్థంలేని వ్యభిచారం.... రకరకాల మాదకద్రవ్యాలు సేవించి, కారా కిల్లీలు నముల్తూ కొన్ని వందల వేలమంది అనుభవించి పారేసిన ఆడవాళ్ళతో అనుభవం వెతుక్కుంటూ, సుఖాన్ని జుర్రుకోటానికి అర్రులు జాస్తూ, మురికి రోగాల్ని తగిలించుకుంటూ....
రెండు మూడొందల గజాలు నడిచి ఉంటాను. ఇంకా ఆ వాతావరణంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కణ్నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అసలీ ప్రపంచంనుంచే పారిపోవాలన్న భావన తరుముతోంది.
బహుశా మనిషి ఎప్పుడోగాని బాహ్య స్మృతి మరిచిపోలేడనుకుంటాను. పరిసరాల్ని తీవ్రంగా ఏవగించుకుంటూన్న ఆ స్థితిలో కూడా ప్రక్కనుంచి ఏదో గలభాలాంటిది వినిపిస్తే తల త్రిప్పి చూశాను.
పద్నాలుగేళ్ళ అమ్మాయి ఓ ఇంట్లోంచి పరిగెత్తుకొస్తోంది. పరికిణి, వోణి వేసుకునుంది. ఆ పిల్ల వెనుక లుంగి, బనీన్లతో ఉన్న ఇద్దరు గూండాల వంటివాళ్ళు "పట్టుకొండి పట్టుకొండి" అరుస్తూ వెంటబడి తరుముతున్నారు. ఇరవై ముప్పయి గజాలన్నా పరిగెత్తక ముందే ఆ పిల్ల వాళ్ళకు దొరికిపోయింది. "మమ్మల్ని తప్పించుకుని ఎలా పారిపోదామనుకున్నావే లం...." అంటూ ఇంకా దారుణమైన భాషలో బూతులు తిడుతూ ఆమెను రెక్కలు పుచ్చుకుని ఈడుస్తున్నారు. "ఒదలండి. నన్నొదలండి" అంటూ ఆ అమ్మాయి పెనుగులాడుతోంది. రోడ్డుమీద నడుస్తూన్న వాళ్ళూ, చుట్టూ ఉన్నవాళ్లు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతున్నారేగాని, ఎవరూ కలగజేసుకోవట్లేదు. ఆ అమ్మాయి ఆ ఇద్దరిలో ఒకరి చెయ్యి కొరికి, రెండోవాణ్ణి గట్టిగా తోసేసి పట్టు తప్పించుకుని "రక్షించండి. నన్ను రక్షించండి. వీళ్లు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నా జీవితం నాశనం చేస్తున్నారు. వీళ్ళ బారినుంచి రక్షించండి." అని అరుస్తూ మళ్ళీ పరిగెడుతోంది. కాని వాళ్ళ శక్తి ముందు ఆమె వేగం చాల్లేదు. ఛంగుమని రాక్షసుల్లా మీదకు దూకి ఆమెను చెరో చేత్తో పట్టుకుని బంతిని గిరాటేసినట్లు ఇటువైపు విసిరేశారు. నిస్సహాయంగా క్రింద పడిపోయి తల నేలకు ఠంగ్ మని కొట్టుకోగా బాధతో అమ్మా అని మూలిగింది. ఒకడు ఆమెను జుట్టు పట్టుకుని పైకి లేపి, రెండో చేత్తో చెంపల మీద ఫెడీ ఫెడీ కొడుతున్నాడు. ఇంకోడు కాలెత్తి డొక్కల్లో ఇష్టమొచ్చినట్లు తంతున్నాడు. బాధను తట్టుకోలేక ఆ పిల్ల జాలిగా అమ్మా అమ్మా అని మూలుగుతూ తల ప్రక్కకు వాల్చేసింది.
నాలోరక్తం పరవళ్ళు తొక్కింది. ఆవేశం ఆపుకోలేక ముందుకు పరిగెత్తాను.
"మీరు మనుషులా? పశువులా? ఆ పిల్లను కిడ్నాప్ చేయటమే కాకుండా ఇష్టమొచ్చినట్లు కొడతారా?" అంటూ మీద కెళ్ళి బలంగా తోసెయ్యటానికి ప్రయత్నించాను.
ఒక్కక్షణం నివ్వెరపోయినట్లు చూసి అంతలోనే నిలద్రొక్కుకుంటున్నట్లు కనిపించారు.
"ఎవతివే నువ్వు లం.... మా సంగతి తెలిసినట్లు లేదు నీకు" అంటూ ఒకడు మీద కొచ్చాడు.
"ఒక స్త్రీతో అలా మాట్లాడటానికి సిగ్గులేదు నీకు?"
"సిగ్గా? సిగ్గెందుకే సింగారీ. అసలెవతవే నువ్వు? ఈ రొకాలిటీలో ఎప్పుడూ తగిలినట్లు లేవే" ఎవరు తీసుకొచ్చారేంటి?"
"ఇందాక ఇటుకేసి నడిచిపోతూంటే చూశాను. గురూ పిట్ట బలే ఉందే అనుకున్నాను. ఎవరన్నా తెచ్చుకున్నారేమో అనుకుని....
"ఏడిశావు. నువ్విలాగే అనుకుంటూ చాలా మందిని వొదిలేశావు." అంటూనే రెండోవాడు గభాల్న ముందుకొచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు.
ఎదురుచూడని ఈ సంఘటనకు అప్రతిభురాల్నయి పోయి, అంతలోనే తేరుకున్నాను.
చెయ్యి బలంగా విదిలించుకుని "రాస్కెల్ ఒళ్ళంత పొగరుగా ఉందా?" అంటూ చెంపమీద ఫెడీమని కొట్టాను.
"ఆయ్. నన్ను కొడతావటే లం.... చూడు నిన్నేం చేస్తానో. ఇక్కడే వీళ్ళందరి ముందే నిన్ను రోడ్డుమీద కుక్క నీడ్చినట్లు ఈడుస్తాను. తర్వాత కసితీరా మానభంగం చేసి, అనుభవిస్తాను. తర్వాత నీకు రేటు పెట్టి అమ్మేస్తాను. ఎవరడ్డమొస్తాడో చూస్తాను" అంటూ మీదకొచ్చి నా భుజం పట్టుకుని గట్టిగా తనవైపు లాగాడు. ఎంత నిలద్రొక్కుకుందామన్నా సాధ్యం కావటం లేదు. నేను బలంగా ఈడ్చుకుపోబడుతున్నాను. లోపల శక్తంతా హరించుకుపోయి కళ్ళు తిరుగుతూన్నట్లనిపిస్తోంది. చుట్టూ ఉన్న ఈ మనుషులంతా ఏం చేస్తున్నారు? వీళ్ళలో ఒక్కరికీ జోక్యం చేసుకుందామన్న భావన రావటంలేదా? అసలు బాధ కలగటం లేదా? పైగా ఇలాంటి దృశ్యాన్ని చూడగలుగుతూన్నందుకు సంతోషంగా ఉందా?"
వెనకనుంచి "ఆగండి" అన్న కంఠ ధ్వని వినిపించింది. పరిచితమైన గొంతు.
ఆ మనిషి నన్ను గూండా చేతుల్లోంచి విడిపించాడు.
ముఖంలోకి చూసి గుర్తుపట్టి "సుకుమార్" అన్నాను కంపితస్వరంతో.
