సాయంత్రం నాల్గుగంటలకి మెలుకువ ఒచ్చినా కావాలని చెప్పి మరో గంటసేపు పక్కమీద అలాగే పడుకున్నాడు. మెయిల్ బెజవాడ ప్లాట్ ఫారమ్ ని ఏడున్నర గంటలకిగాని వొదలరు. జగన్నాధం ఎనిమిది గంటలకి స్టేషన్ కెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఆ వేళకి మేరీ వెళ్ళిపోయి వుంటుంది. రేపో ఉత్తరం రాసి పారేస్తే మరో రెండుమూడు నెలలవరకూ పెళ్ళి ప్రసక్తి రావడానికి వీలుండదు. కనీసం ఆ కొంతకాలమైనా ఏవిధమైన అలజడీ లేకుండా గడిపేయవొచ్చు . ఈ లోగా చెల్లెలు పెళ్ళిజరిగిపో....
రంగారావు గుర్తుకొచ్చేడు. ఆతని చిరిగిన బనీను, గళ్ళ లుంగీ, చీట్లాట నేస్తాలూ, మంగమ్మ.అసహ్యమైన యిల్లూ, భయంకరమైన వాతావరణం- అన్నీ ఒక తడవ తన కళ్ళముందు తిరిగేయి. జగ న్నాధం వొణికిపోయేడు. "భగవంతుడనేవాడుంటే యి సంబంధాన్ని తప్పించి మరో యోగ్యమైన సంబంధం చూపించకూడదూ?"
ఇదే ఆలోచనలతో అతను పక్క మించి లేచాడు. స్నానం ముగించాడు. గదితాళంవేసి పార్కువేపు నడిచేడు. పార్కులో ఓ మూల పచ్చగడ్డిమిద కూర్చుండిపోయేడు.
ఎనిమిది గంటలగ్గాని అతను అక్కడ్నుడి లేవలేదు.
హోటల్లో భోంచేసిన తర్వాత స్టేషన్ రోడ్డువేపు మెల్లిగా నడక ప్రారంభించాడు.
జీతం తాలూకు డబ్బులు ఇంకా అట్టేరోజు లొచ్చేట్టు లేవు. దానికితోడు ఉదయం పిచ్చే తిన్నట్టు ఖర్చుతో మూడు రోజులవరకూ గడవవచ్చు.
జగన్నాధం యి లాంటి పిచ్చిపనులు చాలా చేస్తాడు. చేసిన పిదప చింతిస్తాడు. ఈ ఆలోచన ముందేవుంటే ఎంత బాగుండిపోనూ అని దిగులుపడతాడు.
ఈ నెల్లో యింటికి యాభై రూపాయలు పంపేడు. ఏంసర్దుకుంటారో ఎలా సర్దుకుంటారో .డబ్బుకోసం చాలా యిబ్బంది పడిపోతున్నారు. ఈ మేరీతో పెళ్ళవుతే రేపొద్దున యీ ఉద్యోగం చేయనక్కరలేదసలు. వాళ్ళకున్న ఆస్తితో నాలుగు తరాలవరకూ జరుపుకోవచ్చు. కానీ మేరీతో పెళ్ళి యింత త్వరలో అవడానికి వీల్లేదు.దురదృష్టవశాత్తూ మేరీ పరాయి మతస్థులు పిల్లయిపోయింది. ప్చ్.
జగన్నాథానికి స్వార్థం లేకపోలేదు. కానీ- " నేనింత స్వార్ధుపరుడినై పోతున్నామేమిటీ" అనిపించిన మరుక్షణంలోనే చప్పున మారిపోతాడు. " నేను నిస్వార్ధుడిని. త్యాగజీవిని. కాదనడానికి ఎన్ని గుండెలుండాలి! నేను తేస్తున్నదంతా త్యాగం కాదూ" అని కోప్పడేస్తాడు.
స్టేషన్ దగ్గర పడుతూండగా అతని గుండె దడ ఎక్కువైంది. పాపం! అమాయకురాలిని మోసం చేశాను. ఏడున్నరకి వెళ్ళిపోయే మెయిల్ నా కోసం ఎనిమిది గంటలవరకూ వుంటుందా? రేపు ఉత్తరం వ్రాయాలి. "జ్వరంతో పీడింపబడుతూన్న నేను యెలాగో వీలుచేసుకుని స్టేషన్ కొచ్చేను. కానీ రైలు వెళ్ళిపోయింది."
ఆపద సమయములందు,అసత్య ప్రయోగం ఏమంత నేరం కాదుట. లేకపోతే మేరీ యెదుట నిలబడి , ఆమె అమాయకమైన కళ్ళల్లోకి చూస్తో తమ పెళ్ళి వాయిదాకి ఏమని కారణం చెప్పేది? చెల్లిపెళ్ళీ, తమ్ముడి చదువూ అయిన తర్వాత నిన్ను చేసుకుంటాను,అలా కాకుండా నిన్ను అర్జంటుగా పెళ్ళాడేస్తే మా అందరిగదీ అధోగతి అవుతుంది మేరీ! అని ఎంత జాలిగా చెప్పినా ఏం బాగుంటుంది? ఏమి బాగోదు.
మేరీ తనకి కావాలి. ఇదిమాత్రం నిజం. మేరీతో కాని పెళ్ళి పెళ్ళికాదు. ఇదీనిజమే. అయితే యింత గట్టినిజాన్ని అభీష్టాన్నీ పరిస్థితులదృష్ట్యా కొన్నాళ్ళపాటు చంపుకోడం త్యాగం కాదు?
ఈ ఆలోచన రాగానే అతని మనసు తేలికపడింది. వీధిదీపం వెల్తురులో తననీడ గంభీరం గా నడుస్తున్నట్టు చూచి ముచ్చటపడిపోయేడు. ఓ మాటు తన ఉంగరాలజుత్తుని తమాషాగా వొత్తుకున్నాడు.
జగన్నాధం అందగాడని జగన్నాదం అభిప్రాయమే కాదు- మేరీకూడా వొప్పేసుకుంది. ఇంత అందగాడు నిత్యం వ్యధలమథ్య నిట్టూర్పులమధ్య నలిగిపోడం ఆ భగవంతుడికి సరదాకాబోలు!
జగన్నాధం భగవంతుడిని తిట్టడు. కానీ- నిష్ఠారాలు వేయడం అలవాటైపోయింది.
ప్లాటు ఫారం టిక్కెట్టు తీసుకున్నాడు ప్లాట్ ఫారమంతా గాలించి తిరిగి వొచ్చేస్తూండగా మెయిల్ వొస్తున్నట్టు మైక్ లో ఎనౌన్స్ చేయబడింది.ఉలిక్కిపడ్డాడు. జగన్నాధం. తన కర్మకాలి యి రోజు మెయిల్ గంటలేటుట. నవ్వుకున్నాడు జాలిగా.
వందలజనంలోనైనా మేరీని గుర్తుపట్టడం అతి తేలిక. మేరీ హంసలా నడుస్తో జగన్నాధం నుంచున్న చోటికే వొచ్చి అన్నది.
" తెలుసు నువ్వు నాకోసం తప్పనిసరిగా వొస్తావని."
ఇంతగా అభిమానించే మేరీనా మభ్యపరచడం అనుకున్నాడు జగన్నాధం.
" కూలాసానా?" మళ్ళా ఆమే అడిగింది.
అతను. తలూపాడు.
" ప్రమోషన్ గట్రా....."
" వూహూ... అంతా మామూలే."
మళ్ళా మెయిల్ కదిలేంతవరకూ యిలా కుశల ప్రశ్నలు వేస్తే ఎంత బావుంటుంది- అనుకున్నాడు.
" పెళ్ళెప్పుడు చేసుకుంటావ్?" మేరీ అడిగింది.
ఆమెకళ్ళలోకి తిన్నగా చూశాడు. ఆకళ్లు అదే అడుగు తున్నాయి. చూపు మార్చి జేబులో చేయిపెట్టి ప్సాట్ ఫారమ్ చివరకూ చూస్తూ నుంచున్నాడు. అతని చూపుకి ఓ .యువకుడు కనిపించేడు. నవ్వుతూ విసురుగా తమ వేపే వొస్తూన్నాడు.
అంతలో అన్నది మేరీ:
" వారేమో శ్రీవారు."
జగన్నాధం నెత్తిమిద పిడుగుపడినట్లయింది. భయంగా మేరీవేపు చూసేడు.
" ఆయన్తో పిచ్చిగా మాట్లాడకు.ఒట్టి సెన్సిటివ్! చాలా గుంభనంగా వుండు. విచారించకు. నాకూ పొత్తుకుదరదు. ఈజన్మ కింతేపని సరిపెట్టుకో.ఇప్పుడు గొడవమాత్రం చేయకు."
జగన్నాధం ఏమి వినిపించుకునే స్థితిలో లేడ. తన క్రింద భూమి రెండు చీలికలై తనని కిందికి లాక్కు పోతున్నట్టుంది.
మేరీ భర్త వొచ్చాడు: తనతో కరచాలనం చేస్తూ ఇంగ్లీషులో అన్నాడు-
"మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది. మేరీ మి గురించి చాలా చెప్పింది. మిమ్మల్నిక్కడ చూచి రైలాక్క మునుపే పరుగెత్తుకొచ్చింది."
జగన్నాధం సభ్యతకోసమైనా నవ్వక తప్పిందికాదు మేరీభర్త రైలుకదిలేంతవరకు తమ సంసారం గురించే చెప్పాడు.
