"పోన్లే! నీ వల్ల రచన చేస్తున్నాను. రామాయణం రాశానన్న తృప్తి కలుగుతోంది."
"శాస్త్రిగారూ! మీకు ఒక మేలుచేస్తాను. మీరు భాగవతం వ్రాయండి. దాన్ని అచ్చు వేయించే మార్గం ఆలోచిస్తాను."
"చూద్దాం భగవత్కృప ఎలా వుందో?"
"మరి సెలవు ఇప్పించండి" అని వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన కొద్దిసేపటికి దాశరధి వచ్చాడు.
"మీ ఆరోగ్యం ఎలా వుంది?" దగ్గర కూర్చుని అడిగాడు.
"ఫరవాలేదు. ప్రమాదస్థితి వెళ్ళిపోయింది కదా! అయినా అప్పుడప్పుడూ అలుపు అనిపిస్తూ వుంటుంది."
"కొంచెం విశ్రాంతి తీసుకోండి నాన్నగారూ! పళ్ళూ పాలూ తీసుకోండి. ఇదిగో హార్లిక్సు, గ్లూకోజ్ తెచ్చాను. రోజూ తీసుకోండి" అని అందించాడు. అతనవి యిస్తున్న సమయంలో పార్వతి వచ్చింది.
"బడి ఎలా సాగుతోంది?"
శాస్త్రిగారు ప్రశ్నించారు.
"రోజూ ఒకటో రెండో ఎడ్మిషన్లు వస్తూనే ఉన్నాయి. ఫిప్తులో_ఫస్టులో సెక్షన్స్ పెట్టాను. ఫరవాలేదు. ఒకటి రెండో ఏళ్ళు గడిస్తే మంచి గుర్తింపు రావచ్చు."
"దేనికయినా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది."
"నేనే కాదునాన్నగారూ! ఎసిస్టెంట్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. అందరికీ వచ్చే సంవత్సరం జీతం ఎక్కువ ఇస్తానని చెప్పాను. స్కూల్ ఇంప్రూవ్ మెంటుని బట్టి అందరికీ గవర్నమెంటు స్కేలు యిస్తానని చెప్పాను."
"మంచిది. స్కూల్లో కొత్త పద్ధతులేవైనా ప్రవేశపెట్టారా?"
"ఆఁ స్కూలుకి రాగానే ప్రార్ధన. సరైన క్రమశిక్షణ, పిల్లలకి భగవద్గీత శ్లోకాలు చక్కగా చదవటం అభ్యాసం చేయించటం, వాళ్ళకి చిన్నచిన్న కధలు, నీతి కధలు చెప్పి వాళ్ళ మనసులు వికసించేలా చేయటం."
"అంతేకాదు దాశరధీ! వాళ్ళకీ మన సంస్కృతి సంప్రదాయం గురించీ, ఆచార వ్యవహారాల గురించి హృదయానికి హత్తుకునేలా బోధించాలి. బడిలో నేర్చుకునే సూక్తులన్ని చిలక పలుకుల్లా కాకుండా, నిజజీవితంలో వాళ్ళు ఆచరించేలా చూడాలి."
"అందరూ తగిన ప్రయత్నాలన్నీ చేస్తూనే వున్నాం. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది, ఒక నూతన విద్యా విధానానికి మార్గదర్శకులం కావాలనే నా ఆశ! ఆశయం"
"దాశరధీ!" పార్వతి పిలిచింది.
"ఏమ్మా?"
"అత్తారింటికి వెళ్ళొచ్చావటకదా!"
"అవునమ్మా!"
"ఏమంది?"
ఆ ప్రశ్న వస్తుందని అతనికి తెలుసు! అందుకే తండ్రి జబ్బు పడినప్పుడు వెళ్ళినవాడు మళ్ళీ ఇంతదాకా రాలేదు. ఆమె అలా అడగ్గానే అతని ముఖం మ్లానమైంది. ఒక్కక్షణం ఆమె ముఖం చూసి తల దించుకుని!
"వాళ్ళమ్మ చెప్పనట్లేవిందమ్మా! విడాకులకి అంగీకారం తెలుపుతూ రాసిచ్చింది. రెండో పెళ్ళికి అంగీకారం కూడా రాసిచ్చింది." అన్నాడు బాధగా. అతని గొంతు బరువుగా ధ్వనించింది.
"విడాకులకి రాసిచ్చిందా?" నిర్ఘాంతపోయిందామె. తర్వాత కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ.
"నేనే నీ జీవితం పాడు చేశానురా. ఆరోజు మీ నాన్న చెబితే వినకుండా నీ మెడకి గుదిబండని కట్టాను. నా అన్న గుణం వస్తుందనుకున్నాను కానీ అది అచ్చం తల్లిలా తయారవుతోందనుకోలేదు. నిన్ను పెళ్ళి చేసుకోమంది. తన బిడ్డనేం చేస్తుందట?"
"ఆమెకి కూడా పెళ్ళి చేస్తుందట"
"మళ్ళీ పెళ్ళా?" ఆశ్చర్యపోయింది.
"ఆమె తమ్ముడికిచ్చి చేస్తుందట..."
"ఎవడు? ఆ త్రాష్టుడికా? సరిగా మాటాళ్ళేడు. చూళ్ళేడు. చదువు సంధ్య లేదు. వాడికిచ్చి చేస్తుందటనా? దానికేం మతిపోయిందా? తల తిరుగుతోందా? వాడికేం సిగ్గు ఎగ్గులేదా? పెళ్ళాం ఎలా చెపితే అలా ఆట్టమేనా?" అంది ఆవేశంగా.
దాశరధి సమాధానం చెప్పలేదు. అతనికి మనసంతా బరువెక్కిపోయింది. ఎవరిది తప్పయినా ఎవరిది పొరబాటయినా ఫలితం అనుభవిస్తున్నవాడు తను!
శాస్త్రిగారు మౌనం వహించారు. పార్వతి వైపు అదోలా చూశారు. ఆ చూపుకి ఆమెకి తల కొట్టేసినట్లయింది.
అక్కడ నుంచోలేక ఇంట్లోకి వెళ్ళిపోయింది.
దాశరధి లేచాడు "వస్తా నాన్నగారూ!" అతను కదిలాడు. తోడులేని జీవితం. సీతని వదిలిన రాముడిలా ఉన్నాడతను.
"పేరు పెట్టడంలో కూడా నేను తప్పు చేశాను. దాశరధి పేరు పెట్టుకున్నందుకు జానకి భార్యగా వచ్చినందుకు వాడికి ఆ ప్రభువులాగా భార్యా వియోగం వచ్చింది. ప్రభూ అంతా నీదయ. ఏం నిర్ణయించావో అది నీకే తెలుసు" అనుకున్నారు.
ఇక ఆ పూట రచన సాగదని ఎత్తిపెట్టి ధ్యానం, జపం ముగించుకుని వెళ్ళి పడుకున్నారు.
దాశరధి వచ్చి వెళ్ళిన వారం రోజులకి ఓరోజున జానకిరాం, అయోధ్యని బాంకివద్ద కలిశాడు! అతనూ జ్యోతీ పనిగట్టుకుని వచ్చారు.
"ఏమన్నయ్యా?"
"నువ్వు పట్టాభిని కలిశావా?"
"ఊఁ హూ"
"వాళ్ళ బాంకికి వెళ్ళావా?"
"ఊహుఁ నాకెక్కడ తీరుతుంది? ఈ బైక్ తీసుకున్నాక పిగ్మీ కలెక్షన్స్ ఎక్కువయ్యాయి. త్వరత్వరగా వాటిని వసూలు చేసుకుని ఈ బైకు అప్పు తీర్చేయ్యాలని వున్నాను. పైగా ఈ పదిహేను రోజులూ పిగ్మీ పార్ట్ నైటుగా డిక్లేర్ చేశారు. ఎక్కువ మెంబర్స్ ని చేర్పించాలి."
