Previous Page Next Page 
వారధి పేజి 30


    'రాజు మారిపోయేడుట! ఆ మార్పు  నానుంచి  దూరమవమనే  ప్రోత్సాహించిందన్నమాట. నా పరుష వచనాలతో  రాజు మనసు విరిగిపోయి వుంటుంది. భర్త చెప్పినట్లు  ఈ వదిన  చూపుతున్న  ప్రేమాభిమానాలు  నటన అని తలచివుంటాడు."

    తన ప్రేమాభిమానాలనే  బంకమట్టితో  నేర్పుగా, ఓర్పుగా మలచుకొన్న బొమ్మ రాజు. మమత అనే రంగులు పులిమిచూసి  ముచ్చట పడ్డది. కాని అజాగ్రత్తగా సరిగా  ఎండకుండా  చేయి జార్చింది. ఆది ముక్కలయి ఎందుకూ  పనికిరాకుండా  పోయిందని  భర్తమాటలవల్ల  తెలుస్తున్నది, తన పొరపాటువల్ల జరిగిన  ఈ పని  ఫలితాన్ని  మంచిదైనా, చెడ్డదైనా  తను సంతోషంగా  స్వీకరిస్తుంది. కాని  ఈ సంఘటన  రాజు జీవితంమీద దెబ్బతీస్తే  తను సహించలేదు. ఇది అతడి ఉన్నతికి  మార్గదర్శకమవ్వాలి  కాని, అధోగతికి  మూలం  కాకూడదు. దీనివల్ల  రాజు భవిష్యత్తు దెబ్బ  తినకూడదు. మనసులోనే  రాజు  అభివృద్ధిని  కోరుతూ  భగవంతుణ్ణి  ప్రార్ధించింది  మీనాక్షి.

    "మీకు వరదుణ్ణి  గురించి  ఏమి తెలియదు. వాడు  ఎంతగా  మారిపోయినా  నాపట్ల  వాడికింత  నమ్మకం పోదు. నేనేం  చేసినా  వాడి మంచికోరి  చేస్తానని  గుర్తించకపోడు. నేడో, రేపో  వరదుడు  తప్పకుండా  వస్తాడు" అంది మీనాక్షి, నమ్మికతో.

    తమ్ముడి ఎదటపడి  మాట్లాడి, వాడి మనసు  తెలుసు కొన్నాననుకొన్న  మనిషి అంత నమ్మకంగా, భార్య, మరిది వస్తాడని  చెబుతూంటే  'నిజమే కామోసు, రాజు  గురించి  తనకేమీ  తెలియదేమో!' అనుకొన్నాడు  శివయ్య.

    ఆ రోజంతా  మరిది  రాకకోసం  మీనాక్షి  ఎదురుచూస్తూనే  వుంది. ఉదయం నుంచే  వీథి  గడప వదలని  ఆమెను చూస్తూ "మీనాక్షమ్మా  ఇంకా  నీ ముద్దుల  మరిది  రాలేదా?" అంటూ ప్రశ్నించేరు  దారినిపోయే ఆడవాళ్ళు.

    "ఈ రోజంతా  వాడికి  కాలేజీ ఉంటుంది, మీనాక్షి! సెలవులు  రేపటి నుండి ప్రారంభం. ఒకవేళ  వచ్చినా  రేపుకాని  రాడు" అన్నాడు శివయ్య, భార్యను  హెచ్చరిస్తూ.

    ఎండ  చల్లబడుతూంటే  "ఏమిటి  పోయి  బిందెడు  నీళ్లు  తెచ్చుకోవా" లంటూ  బయలుదేరింది  మీనాక్షి.

    "ఉదయం  తెచ్చిన  నీళ్లు  అయిపోయేయా?" శివయ్య  ప్రశ్నించేడు.

    "ఒక బిందెడు  వంటకి, తాగేందుకు  అయిపోయేయి. రెండో బిందెలో  పూర్ణ  మట్టి చేతులు  ముంచేసింది."

    భర్త  వేయబోయే  ఇంకొక  ప్రశ్నని  వినిపించుకో నక్కర లేకుండా  వడివడిగా  అడుగులు  వేసింది మీనాక్షి.

    నీలాంటిరేవులో  ఆడంగులు  అట్టేమంది  లేరు. వచ్చిన  వాళ్ళయినా  సాయంకాలం  వంటపనులకి  వేళ మిగిలి పోతున్నదన్న  తొందరలో  బిందెలు  ముంచుకుపోతున్నారు.

    తళతళ  లాడుతున్న  ఇత్తడి  బిందెకు  మరికాస్త  చింతపండు  రాసి  ఇసుకతో  తీరికగా  తోముతున్నది  మీనాక్షి. ఆమె చేతులు  బిందె మీద  సంచరిస్తుంటే  కళ్ళు  వంతెనదారివైపు  వీక్షిస్తున్నాయి. తోమగా తోమగా  చేతులు  రాపిడికి  మండసాగేయి. బిందె  తోమడం పూర్తి అయినట్లు, శుభ్రంగా  కడిగి  నీళ్లు  ముంచుకొంది, అప్పటికి  రేవులో  మీనాక్షికాక  ఇద్దరు గ్రామస్త్రీలు  మిగిలివున్నారు.

    "మేము  వెళ్ళిపోతున్నాము. నువ్వు  ఇంకా  రావా, మీనాక్షమ్మా?" అంటూ వాళ్లు బిందెలు  ఎత్తుకొన్నారు.

    "ఎండలో  వచ్చేనేమో _ తల  దిమ్మగా  వుంది. ఈ నీటిమీద  నుంచి  వస్తున్న  గాలికి  ప్రాణాలు  లేచి వస్తున్నట్లుంది. కాస్తసేపు  కూర్చుని  వస్తాను. మీరు  నడుస్తుండండి" అంది.

    వాళ్ళు  కనుచూపు  దూరం  అయ్యేవరకూ  అటుచూసి  తిరిగి ఆవలి ఒడ్డుకి  దృష్టిపోనిచ్చింది. అస్తమిస్తున్న  సూర్యబింబం  ఎర్రగా, తను కేక వేసినప్పుడు  అలిగి  కూర్చున్న  వరదుడి  ముఖంలా  కనిపించింది  మీనాక్షికి.

    ఇంక కాలు కదపకపోతే  ఊరు చేరేసరికి  చీకటి  ముంచుకువస్తుంది. పూర్ణలేచి  అన్నంకోసం  రాగం అందుకొంటుంది. తప్పని  సరిగా  బిందె నెత్తిమీద  పెట్టుకొని, ఆశవీడని  కళ్ళతో, అల్లంతదూరంలో  ఇనుపకమ్ముల మధ్య  బిగించబడ్డ  రోడ్డువంక  చూసింది మీనాక్షి.

    కళ్ళ రెప్పలు  నిదానంకోసం  టపటప  కొట్టుకొన్నాయి. ఎడం చెయ్యి ఎదురు ఎండకి  అడ్డం వెళ్ళింది. పరిచితమైన  ఆ నడక  పోల్చుకొంది  మనసు.

    "వరదం!" అంటూ  కేకపెట్టింది  మీనాక్షి.

    ఆ కేక  నీళ్ళ  గలగలల్లో  కలిసిపోయింది, బిందె  అక్కడే  వదిలి దారికడ్డంగా  నడక సాగించింది.

    తన కభిముఖంగా  వస్తున్న  వదినని  చూసేడు  వరదరాజు, 'తను వస్తున్నాడని  ఈమెకు  ఎలా తెలిసింది? తెలియకపోతే  ఈ సమయంలో  ఇక్కడ  ఎందుకు  ఉంది?'

    అడుగులు ముందుకి వేస్తూనే  ఆలోచిస్తున్నాడు  రాజు. తనని చూడగానే  పరుగుతో  వచ్చి చేతుల్లో  వాలుతాడనుకొన్న  మరిది  నిదానంగా  అడుగులు వేస్తూ  ముందుకి  రావడం చూసి 'ఆయన చెప్పిన  మాట నిజమే__ నేనే పొరపడ్డాను, వరదుడు  మారిపోయేడు' అనుకొంది  మీనాక్షి.

    ఆ తలపుతోనే  ఆమె కళ్ళలో  నీళ్లు  తిరిగేయి. దగ్గిరపడుతున్న  వరదరాజు  ఆ కన్నీళ్ళ  వెనక  కరిగిపోతున్న  హృదయాన్ని  గుర్తించేడు. అదురుతున్న  ఆ పెదవుల్ని  చూసేడు, అతడి బింకం  సడలిపోయింది. 'తన రాకకోసం  వేళకాని  వేళప్పుడు  ఊరు  దాటి  వచ్చి  వేయి  కళ్ళతో  ఎదురుచూస్తున్న  ఈమెమీదనా  తను కోపం  తెచ్చుకొన్నది? తల్లిని మరిపించేలా  పెంచి  పెద్దచేసిన  ఈమెకా  తను స్వార్ధం  ఆపాదించింది?' అనుకొన్నాడు. మిగిలిన  నాలుగు అడుగులు  త్వరగా  వేసి  "వదినా?" అంటూ చేతుల్లో  వాలిపోయేడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS