Previous Page Next Page 
రాగోదయం పేజి 30


    కానీ సోముకి మహా బాధగా వుంది. వూ అంటే అప్పు తలకు చుట్టుకుంటుంది. కాదనటానికి నోరు రావటం లేదు. అన్నా చెల్లుతుందా! కాలం తీరని బాండు అది. ఎక్కడికి వెళ్ళినా చౌదరి మాటే చెల్లుతుంది. తన బతుకంతా యీ అప్పుతో తీరిపోవాల్సిందేనా!"
    "సోము!"
    "ఊ"
    "నేనో మాట చెప్పనా?"
    తలూపాడు సోము.
    "కర్కోటకముండా కొడుక్కి యింత దయ ఎక్కడిడా అనుకోవద్దు. నేనూ మనిషినే, పైగా యిందులో నా తప్పు వుంది. పంచాయితీలో అప్పంతా అడగలా నేను. రేపు నలుగురూ జతయితే ఆడమనిషి భార్గవి ముందే నేను తల వంచద్దూ. దానికంటే మనం రాజీగా వెళితే మంచిది గాదూ! అందుకే ఎన్నేండ్లయినా వడ్డీ వద్దంటున్నా.'
    "మీరంతా ధర్మంగా అన్నా, ఆ వేయి తీర్చేసరికి నా జన్మ సరిపోతాది. ఎట్టా తీరుస్తామయ్యగారూ! మాకేం వుంది? మా ఆధారమంతా రెక్కలు ముక్కలు చేసుకోవటమే గదా. ఆ క్షణంలో సోము ముఖంలో దీనత్వం గూడు కట్టుకుంటి.
    "మరేం చెయ్యనురా?"
    "పెద్దవాళ్ళు, ఇంత దయ కలిగిన వాళ్ళు మీరే ఆలోచన చెప్పండి" అన్నాడు జయన్న.
    దొరికారు అనుకున్నాడు చౌదరి. "చెబితే యింటారా" అడిగాడు సందేహంగా.
    "వూ"
    "సరే, ఇందులో సగం - అయిదు నూర్లిమ్మను వీడి బాండు కొత్తగా రాసియ్యమను నువ్వే సాక్ష్యం చేయి నాకు పనికొచ్చి తీర్చుకోమను. వచ్చినప్పుడల్లా రోజుకి పది రూపాయలు కూలి. రాత్రిళ్ళు వస్తే యిరవై, సరేనా అన్నాడు చౌదరి.
    జయన్న సోముని అడిగాడు "ఏమంటావు?"
    సోము సమాధానం యివ్వలేదు.
    "ఈ అప్పు కోసం తొందర చెయ్యను అలా రాసిస్తే.
    "ఇంకేం? ఇంతకంటే ఆయనేం చెబుతాడు!"
    "సరే బాండు రాసిస్తా, " నీరసంగా అన్నాడు సోము.
    జయించాననుకున్నాడు చౌదరి. కాగితం కలం అందించాడు. సోము బాండు రాశాడు. బిళ్ళ అతికించి సంతకం చేశాడు. జయన్న సాక్ష్యం చేశాడు. తర్వాత యిద్దరూ నీరసంగా యింటి ముఖం పట్టేరు. వచ్చిన పని నిలిచింది. జనార్ధన్ బయటికి వెళ్ళినవాడు తిరిగి రానే లేదు.
    చౌదరి గర్వంగా నవ్వుకున్నాడు.

 

                                       13    

 

    రాత్రి ఎనిమిది గంటలకల్లా జయాన్న పాకకి వస్తుంటారందరూ. జయన్నకి పాకంటూ వేరే ఏమీ లేదు. పంచాయితీ వాళ్ళు బడికోసం వేయించిన పాకలోనే అతని మకాం. అతను అవివాహితుడు తల్లీ తండ్రి చెల్లీ తమ్ముడూ అనే బాదర బందీలు లేవు. అతను అనాధశరణాలయంలో పెరిగి హరిజన హాస్టలులో వుండి చదువుకుని వచ్చాడు.
    అక్కడికి వచ్చేవారంతా చదువు కోసమే రారు!
    వూళ్ళోని వ్యవహారాలూ, దేశ రాజకీయాలు వుబుసుపోక కబుర్లు అల్లరి చిల్లర వ్యవహారాలు ఒకటేమిటి కాలక్షేపం అయ్యేందుకు ఏదో ఒకటి మాటాడుతూ బీడీలు తగలేస్తూ కాలం గడుపుతారు.
    చదువుకునే అయిదుగురో ఆరుగురో లోపల వుంటే మిగతా అంతా బయటనే కూర్చుంటారు. అందరికీ ఆ రోజు పాఠం చెప్పి పలకల మీద రాసుకోమని చెప్పి బయటికి వచ్చాడు జయన్న. అతనొచ్చిన మరికొద్ది సేపటికి సోము కూడా బయటికి వచ్చాడు.
    "జయన్నా డబ్బంతా వసూలు చేశావా?" అడిగాడు ఓ ముసలయ్య.
    "ఆ లెక్క ప్రకారం అయిపొయింది. రిజిస్టర్లు రాశాం. తీర్మానాలు రాశాం. జనార్ధన్ ప్రెసిడెంటు, కుమ్మరి రామన్న వైస్ ప్రెసిడెంట్, మొత్తం నాలుగొందల ఇరవై మంది సంతకాలు చేసి డబ్బు కట్టారు."
    "ఆ లెక్కంతా యాడుంది?"
    జయన్న సమాధానం చెప్పలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS