Previous Page Next Page 
వారుణి పేజి 30


    సబ్జక్టు హఠాత్తుగా మారి వారుణిని ఆశ్చర్యపరిచింది. ఆమె తేరుకునే లోపలే_
    "సావిత్రీ అని పిలు" అంది సావిత్రి.
    వారుణి నోట మాట రాలేదు.
    "సంగీతం వద్దు. నృత్యం వద్దు. అది తాతై అంటూ యింట్లో ఎగురుతూవుంటే ఎవరూ ఒప్పుకోరు. పైగా నెలనెలా నలభైరూపాయలు ఎవరిస్తారు? మా ఆయనకీ ఆయన డ్యూటీతోనే సరిపోతుంది. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టి చుకోరు, మామగారు పైసా విదల్చరు. అత్తగారికి యిప్పుడే అదనపు ఖర్చుతో చెయ్యితడబడుతోంది." విరామం లేకుండా వల్లించింది సావిత్రి.
    "ఆ డబ్బు నే కడతాను" - ఆఖరి ఆశగా అంది వారుణి.
    "నీ భిక్ష మాకేం వద్దు" నరికేసినట్టుగా అంది.
    ఈ మనుషులులెప్పుడు బాగుపడతారు? వీళ్ళలో చైతన్యం ఎప్పుడు వస్తుంది? మారుతున్న కాలంతో పాటు వీళ్ళ ఆలోచనలెప్పుడు మారతాయి?
    సావిత్రి చదువుకుంది చదువుకొన్న_అందునా డాక్టర్ని పెళ్ళి చేసుకుంది. కుటుంబంలో అంతా చదువుకున్నవాళ్ళే. అలాంటిది యిక్కడే యిలాగ వుంటే యీ దేశంలో మామూలు స్త్రీ స్థాయి ఏమిటి? బానిస భావాలు_ బానిస బ్రతుకు_ ఛీ అనుకుంది.
    సావిత్రి లేచి వెళుతూ_ "నేను వెళతాను" అంది.
    వారుణి ఆలోచనలో వుండి జవాబివ్వలేదు.
    ఆ రోజు సాయంత్రం వారుణి సావిత్రి ఊహకి భిన్నంగా చేసింది. సరోజని తీసుకెళ్ళి డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్లో చేర్పించి వచ్చాక సావిత్రి మాత్రం ఊర్కోలేదు. పెద్ద దుమారం లేపింది. రాద్ధాంతం చేసింది.
    సరోజని డాన్స్ స్కూల్లో చేర్పించిన తర్వాత బజారుకు తీసుకెళ్ళింది. గజ్జెలు, వెండి మువ్వలు కొనిపించింది. ఎనిమిదింటికి యింటికొచ్చారు యిద్దరూ.
    సరోజ ఎంతో ఉత్సాహంగా వుంది. గజ్జెలు కట్టుకుని ఘల్లుఘల్లున హాలంతా కలయ తిరిగింది. మరురోజు ఉదయాన్నే స్కూలుకు వెళ్ళి క్లాసంతటికీ తన ప్రత్యేకత చాటుకోవాలనుకుంది. ఆ అమ్మాయి ముఖం నిండా ఆనందం తాండవిస్తోంది.
    కూతురిని చూడగానే శివమెత్తింది సావిత్రికి.
    "రావే! భ్రష్టుముండా! కాని స్నేహాలు మరిగి ఈ వయసుకే పెడమార్గాలు పట్టిపోతున్నావా! నీకు డాన్స్ కావాలా! నువ్వేం భోగం దానివా? బజార్లంట తైతక్క లాడతావా? పక్షీ! ఈ అడుక్కుతినే వాళ్ళబుద్ధులెలా వచ్చాయే నీకు?" నోరు పారేసుకుంది సావిత్రి.
    తల్లి మాటల సారాంశం ఏమిటో అర్థంకాలేదు సరోజకి. కానీ తను డాన్స్ స్కూల్లో చేరటం యిష్టంలేదన్న సంగతి మాత్రం అర్ధమయ్యింది. అందులోని తప్పేమిటో తెలియక బిక్క మొహం వేసింది. భయంతో వెళ్ళి పిన్ని చాటున దాక్కుంది.
    వారుణి వెనుకగా సరోజని చేరటంతో సావిత్రికి కోపం పేట్రేగిపోయింది. ఆమెని తోసేసి సరోజని లాక్కుంది. ఈ చెంపా ఆ చెంపా వాయించింది.
    వారుణి అడ్డుపడింది. సావిత్రి దెబ్బలు రెండు తగిలాయామెకి. చురుక్కుమంది.
    "అబ్బ ఎలా కొట్టిందో! తనకే యింత బాధ వుందే" అనుకుంది వారుణి.
    "సావిత్రీ?" అరిచింది. ఆ అరుపులో కోపం, దర్పం ధ్వనించాయి. కంఠంలో తీవ్రత వుంది.
    ఇంట్లోని నలుగురూ అక్కడికి చేరారు.
    వారుణి పిలుపుకి తెల్లబోయారు.
    నివ్వెరపోయి చూస్తున్నారు.
    "వదులు_ నా కూతురు_ నా యిష్టం_ ఒకసారి చెబితే బుద్ధిలేదూ? నాకిష్టంలేని పని నా కూతురిచేత చేయిస్తావా? నీకెవడిచ్చాడీ స్వతంత్రం. నా బిడ్డ నా అభిప్రాయాలకి తగినట్టు పెరగాలి. అది నాకు తెలుసు నీకెందుకీ అనవసరమైన జోక్యం?" రొప్పుతూ వుంది సావిత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS