ఇక్కడే ఏడుపులూ, పెడబొబ్బలూ జరుగుతూండగానే లోపలకు మనుషులు వెళుతూ, వస్తూనే ఉన్నారు. అది చాలా సహజమైన విషయమన్నట్లుగా ఎవరూ పట్టించుకోవటం లేదు.
ఇంతలో లోపల్నుంచి మంజరి వచ్చింది.
జుట్టు రేగి ఉంది. దుస్తులు నలిగి ఉన్నాయి. ముఖాన అలసట కనిపిస్తోంది.
నన్ను చూడగానే ఆ కళ్ళలో మెరుపు....
"హాయ్ నువ్వు ఇక్కడికి...." అంటూ దగ్గరకొచ్చి భుజాలమీద చేతులేసి దగ్గరకు లాక్కుంది.
ఒక్క నిమిషం "రా లోపలకు" అంటూ చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెడుతోంది.
బయట్నుంచెవరో మంజరిని పేరు పెట్టి పిలిచారు. "ఇప్పుడే వస్తాను. ఆ అత్తముండ చచ్చిపోయిందిగా కాసేపేడ్చి వస్తాను. అదిగో. ఆ గదిలో కూచో. వెళ్లిపోకేం. అంటూ బయటకు వెళ్లిపోయింది.
అది చెప్పిన గదిలో కూచున్నాను. ఆ మంచం దుప్పటి, గోడమీది బొమ్మలు ఎలాగో ఉండి కడుపులో వికారం కలిగిస్తున్నాయి.
అబ్బో.... మనుషులెంత వికృత జీవులు! ప్రపంచంలో తొంభయి శాతం ఈ వికృత వాతావరణంతోనే నిండి ఉంది. అయినా అటే పరుగులు తీస్తూ ఉంటారు.
కొంచెంసేపటికి మంజరి వచ్చింది. మంచం మీద కూచుంటూ "విసుగ్గా ఉందికదూ? ఏం చెయ్యను? అత్తముండకి అంత్యక్రియలు మధ్య మధ్య అటెండవక తప్పదు. అవునూ ఏమిటిలా వచ్చావు? నా అడ్రసెలా కనుక్కున్నావు?" అనడిగింది.
"ఒకసారి చెప్పావు. మర్చిపోయినట్లనిపించినా కష్టపడి గుర్తు చేసుకున్నాను."
"అవునూ ఎందుకిలా వచ్చావు.?"
ఏం చెప్పాలో తెలీలేదు.
"చూడాలనిపించింది."
"థాంక్స్."
"ఒక ప్రశ్న అడుగుతాను. కరెక్టుగా జవాబు చెబుతావా?"
"ఏమిటి?"
"నువ్వు.... ఇప్పుడనుభవిస్తోన్న తీరులో సంతోషంగా ఉన్నావా? అనుకున్నది సాధించావా?"
ఆమె ముఖంలో ఉలికిపాటు. "ఈ ప్రశ్న అడగటానికే వెదుక్కుంటూ వచ్చావా?"
"అవును"
"అంత అర్జంటుగా ఇప్పుడెందుకు?"
ఏదో చెప్పబోతోంది. ఇంతలో తలుపు తోసుకుని లోపలికో యువతి వచ్చింది. ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళుంటాయి. చెంపకు చారడేసి కనులతో చలాకీగా, మిలమిలలాడుతోంది.
"అక్కా! ఉత్తమచంద్ గారొచ్చారు" అంది.
మంజరి విసుగ్గా ముఖం పెట్టింది. "ఆయన సంగతి నువ్వు చూసుకోపోయావా?"
ఆ అమ్మాయి నవ్వింది. "నువ్వే కావాలిట. నిన్ను రుచి చూశారంటే మాలాంటి వాళ్ళం నచ్చుతామా?"
"నీకేం తక్కువట? ఒక్కొక్క పార్టూ విడివిడిగా ముట్టుకు చూడమను. ఎవరు గట్టివారో తెలుస్తుంది."
"ఆయనకు విడి విడి గట్టిదనం కాదు. టోటల్ ఎఫెక్ట్ కావాలి."
"చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది. బిజీగా ఉన్నానని చెప్పకపోయావా?"
"చెప్పాను. ఆయన కర్జంటుగా ఉందేమో" అంటూ మళ్ళీ నవ్వేసింది.
మంజరి నా వంక బాధ పడుతూన్నట్లుగా చూసింది. "సారి సతి మంచి కస్టమర్. వాడ్నొదులు కోవటం మంచిది కాదు. అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను. అంతకన్నా ఏడవలేడులే రజనీ పక్క రూమ్ ఖాళీగా ఉందా?"
"ఉంది."
మంజరి నన్ను బుజ్జగిస్తోన్నట్లుగా భుజం మీద చేతులేసి "అలిగి వెళ్ళిపోకేం. ఏదో మాట్లాడాలని వచ్చినట్లున్నావు. ఒక్క అయిదు నిమిషాలు. కావాలనుకుంటే మూడు నిమిషాల్లో ముగించేయగలను."
ఆమె డ్యూటీ మైండెడ్ నెస్ ని అభినందించకుండా ఉండలేకపోయాను.
ఉత్తమచంద్ అన్న వ్యక్తి మంజరితో ప్రక్క గదిలోకి వెడుతూ నన్ను చూసి షాక్ అయినట్లాగిపోయాడు. అబ్బ! వాడి చూపుల్లో ఎంత కామ దాహమో. మంజరితో ఏదో అంటున్నాడు. ఆమె జవాబు చెబుతూన్నది. వాళ్ళిద్దరి సంభాషణా నాకో విధంగా అర్థమయ్యింది.
"ఆ పిల్ల ఎవరు?"
"ఎందుకు?"
"ఎందుకేమిటి? బలే పసందుగా ఉంది. చూస్తేనే అలా ఉంటే దాంతో ఉంటే ఇంకెంత మజాగా ఉంటుందో."
"పిచ్చిగా వాగకు. అదెవరనుకున్నావు? నా ఫ్రెండు."
"ఫ్రెండా? హ హ్హ హ్హ హ్హ అయితే మరీ మంచిది. కొత్తగా వచ్చిందేమిటి? మొహం చూస్తే ఇంతవరకూ రంగ ప్రవేశం చేసినట్లు లేదు. నాకే కుదిరేటట్లు చూడు. రేటెంతయినా ఫరవాలేదు."
"ఇదిగో సేటూ ఆ అమ్మాయి గురించలా మాట్లాడవద్దని చెప్పానా? ఫ్యామిలీ లేడి. నాతో అర్జంటుగా మాట్లాడాలని వచ్చింది అంతేగాని...."
"ఈ ఫ్యామిలీ లేడిస్ గురించి నాకు చెప్పకు. అసలు వృత్తిలో ఉండే అమ్మాయిల కన్న. ఫ్యామిలీ లేడిస్ తో వ్యవహారం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంకోడి పెళ్ళాంతో.... ఆ సీన్ లో ఉన్నప్పుడు ఆ మొగుడు గాడి గురించి కసిదీరా ఆలోచిస్తూ...."
"నువ్వు...." అంటూ రెక్క పుచ్చుకుని అవతలకు లాక్కు పోయింది.
నాకు ఒళ్ళంతా కంపరంతో జలదరిస్తోంది. ఇహ ఒక్కక్షణం కూడా ఉండబుద్ధిగాక లేచి నిలబడ్డాను.
