"అన్నయ్యల్లాగా నేనూ వెళ్ళిపోతానని అనుమానమా" రోషంగా ప్రశ్నించాడు.
"బాంధవ్యాలు ,ప్రేమలు, ఆప్యాయతలూ అన్నీ మీ దృష్టిలో చాలా అల్పం. డబ్బు, హోదా, స్వసుఖం ముఖ్యమైనాయ్! ఈ స్థితిలో తండ్రయినా, కొడుకయిన ఎక్కువగా ఆప్యాయతల్ని పెంచుకోవడం అవివేకం"
ఆయన మాటల్లో ఆవేశం వుంది. ఐతే ముఖంలో ఏమాత్రం ఛాయలు కనిపించలేదు. పరమ శాంతంగా, ఎవరో అన్యులకి హితబోధ చేస్తున్నట్లుగా చెప్పారు.
తండ్రి మనసు బాగా గాయపడిందని అర్ధమైందతనికి.
"ఇప్పుడదంతా ఎందుకు మామయ్యా! ఆ ఇబ్బంది తీరనివ్వండి ముందు. తర్వాత ఆలోచిద్దాం"
"థాంక్స్ స్వాతి! నన్నీ అవమానం నుంచి బయటపడేయండి ముందు. తర్వాత నెలనెలా ఇంతని తీర్చేస్తాను నీ అప్పు__"
"అయ్యో! అదేవిటి?" నొచ్చుకుందామె మనసు.
"ఒక స్త్రీ సొమ్ము తీసుకుని, దాంతో పరువు నిలుపుకుని ఆ తర్వాత కృతఘ్నత చూపేవాడిని కాను నాన్నగారూ! మీరు చాలా కరెక్టుగా చెప్పారు. అన్నయ్యా, జానకిరాం, అయోధ్య చేసినదాన్నిబట్టి మీరలా అనుకుంటున్నారు"
"ఆ అన్నలని మార్గదర్శకులుగా చేసుకోకుంటే అదే పదివేలు!" నిర్వేదంగా అన్నారాయన.
"ఒక విధంగా నేను కొంతతప్పే చేశాను. జీతం విషయంలో అదంతా ఇప్పుడు చెప్పుకోటం అంత బావుండదు. ఒకటే చెపుతాను. నమ్మండి. నాల్గయిదు నెలల్లో ఈ మూడువేలు అప్పు తీర్చేస్తాను. డబ్బు ఆమె పేరుతో బాంకులో వేస్తాను" అన్నాడు.
శాస్త్రిగారు దీక్షగా అతని ముఖంలోకి చూశారు.
"పట్టాభి! ఇది డబ్బు! తీసుకునేటప్పుడు చాలా రుచిగా, లడ్డుకంటే తీపిగా ఉంటుంది. తిరిగి ఇవ్వవలసి వచ్చేటప్పటికి విషంకన్నా చేదుగా ఉంటుంది"
"నా విషయంలో అలా అనకండి!" పట్టుదలగా అన్నాడు.
"ఎవరి సొమ్ము వాళ్ళకివ్వాలంటేనే బాధగా ఉంటుంది. దాచమని ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వటానికే స్వంత సొమ్ము పోయినట్లుగా భావిస్తారు కొందరు. ఈరోజు బాంకి నుంచి డ్రా చేసి తీసుకోవటం చాలా సులభం"
"అబ్బ! నాన్నగారూ! మిమ్మల్నెలా వప్పించాలో నాకర్ధం కావటంలేదు. ఏం చెపితే నమ్ముతారు మీరు"
"పట్టాభీ! ఇది డబ్బు! ప్రాణం కంటే తీపి! ప్రాణం కంటే ఖరీదు! ఇంత పిదపకాలం వచ్చినా నేను దేవుడిని నమ్ముతాను. కొలుస్తాను. ఆరాధిస్తాను. ఆ దేవుడిమీదా ఈ తండ్రి మీదా ప్రామిస్ చేసి తీసుకో."
"మావయ్యా!" కంగారుగా అంది స్వాతి.
"నువ్వేం కంగారు పడకు! నాన్నగారు సరిగానే చెప్పారు. నాన్నగారూ! మీ సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా స్వాతి డబ్బు ఆమెకి తిరిగి యిస్తాను" అన్నాడు దృడంగా.
శాస్త్రిగారు భారంగా విశ్వసించారు.
స్వాతి చెక్ పై సంతకం చేసి ఇచ్చింది.
ఆమెకి తనపై గల నమ్మకానికీ, అభిమానానికీ మురిసిపోయాడు పట్టాభి.
* * *
శాస్త్రిగారి ఆరోగ్యం చక్కబడింది. తిరిగి మామూలుగా బడికి వెళుతున్నారు. రామాయణం రచన సుందరకాండలోకి వచ్చింది. ఆ రచన అందుకున్న రచయిత చాలా కృతజ్ఞతలు చెప్పాడు. రచనలోని వైశిష్ట్యాన్ని, అక్షర రమ్యతనీ ధారాశుద్ధిని మిక్కిలి కొనియాడాడు.
ఆఖరికి "శాస్త్రిగారూ! వాళ్ళిచ్చిన ఏడువేలూ మీకిచ్చేస్తున్నాను. మీరుచేసిన కృషికి యిది తగిన విలువ కాదు. అసలు కవిత్వానికి విలువ నిర్ణయించగలమా?"
"ఏదో మీ అభిమానం, నాకీ అవకాశం కలిగించారు. ఆ శ్రీరామచంద్రుడి పాదారవిందానికో పూజాసుమం" వినయంగా అన్నారాయన.
ఆ రచయిత అలా నిలబెట్టి పొగిడేస్తుంటే ఏమనాలో అర్ధం కాలేదు.
"మీరే చెప్పారు చూడండి. భోజుడు ఒక్క శ్లోకానికి ఒక్కో దిగ్భాగంగా నాలుగు శ్లోకాలకి చతుర్ధిగా ముద్రితమైన తన రాజ్యాన్ని ధారపోశాడని__అలాంటి రాజున్నపుడే కవిత్వానికి రాణింపు...
"వాళ్ళిచ్చింది మీకిచ్చేశా! ఈ కావ్యాన్ని ఒక మంత్రిగారికి అంకిత మిస్తున్నాను. ఆయన చేసే సన్మానం నిజంగా మీకు దక్కాలికానీ, అది బయటికి చెప్పుకోవటం సాధ్యం కాదు."
"ఆ మాట పదిసార్లనకండి. ఇలా జరగాలని యోగముంది అలా జరుగుతోంది" అన్నారాయన.
"అందుకనే మీకు రచన పూర్తికాగానే పట్టు శాలువ, పట్టువస్త్రాలు ఓ బంగారు ఉంగరం ఇస్తాను. అమ్మగారికి వస్త్రాలు ఇస్తాను."
"ఎందుకు లేవయ్యా! ఇచ్చిన డబ్బు చాలదా?"
"ఆ మాటకొస్తే ఈ రచన పునర్ముద్రితమైనపుడల్లా నాకు డబ్బు ముడుతుంది. అదంతా నాకు ఆదాయమే. పైగా వంశపారం పర్యంగా ఆ కావ్యంపై మాకు హక్కు వుంటుంది. అవి మీరు మాకు వరప్రసాదంగా యిస్తున్న అనర్ఘమణి" అని అన్నాడు.
ఆయన మాటలు వింటున్న స్వాతి ఆశ్చర్యపోయింది. రచన వల్ల యింత కీర్తి యింత ధనం వస్తాయా అనుకుంది.
కానీ శాస్త్రిగారు తొణకలేదు.
"రావూ! ఎంత వూరింపుగా చెబుతున్నావయ్యా! నువ్వెన్ని చెప్పినా నేను ప్రలోభపడతాననుకుంటున్నావా?"
"అమ్మమ్మ! తమరికి ప్రలోభం అంటానా?" చెంపలు వేసుకుని భక్తిగా నమస్కరించాడు.
"భారతం వ్రాసిన నన్నయ్య, తిక్కన, ప్రగ్గడవాళ్ళ వంశం వాళ్ళు ఆ స్వామ్యాన్ని అనుభవిస్తున్నారా? ప్రబంధ నిర్మాణాదక్షుడు ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యులు, శ్రీకృష్ణ దేవరాయలు ఏమయ్యారు? వాళ్ళ రచనలవల్ల యీనాడు బాగుపడేదెవరు? పబ్లిషర్స్!"
"అది వాళ్ళ జీవనోపాధి!"
"శాస్త్రిగారూ! పబ్లిషర్స్ ఎప్పుడూ బాగుపడతారు! అయితే వాళ్ళు లేకపోతే వారధిపోతుంది. రచయితకీ ప్రజలకీ వారధి పబ్లిషర్! అతను బాగుపడటం వ్యాపార లక్షణమైనా సాహిత్యానికి మేలే చేస్తున్నారు కదా!"
