'ఈ కొద్దికాలంలో రాజు యెంత పెద్దవాడయి పోయేడు! మాటలో, మనిషిలో ఎంత నిగ్రహం వచ్చింది!' అనుకొన్నాడు శివయ్య.
"వారంనాడు పోలయ్యచేత కబురుపెడితే సెలవులకి రానన్నావుట మీ వదిన నీకోసం ఎదురుచూస్తున్నది, పూర్ణ 'చిన్నాన్న' అంటూ కలవరిస్తున్నది. ఒకసారి వచ్చి పదిరోజులుండి వెళ్లు" అన్నాడు.
"అవకాశం లేదు. అన్నయ్యా! మొదట్లో చదువుమీద సరిగా మనసు లగ్నం చేయలేకపోయేను. పనిలో చాలా వెనుకబడి ఉన్నాను. అవన్నీ ఈ సెలవుల్లో పూర్తిచేసుకోవాలి."
"నీ చదువుకి మనింట ఏం ఆటంకం ఉంటుంది. రాజూ! ఈ పనేదో అక్కడే చూసుకో."
"ఆ పల్లెటూళ్ళో ఏముంది అన్నయ్యా? ఇక్కడితే లైబ్రరీలు, తెలియనివి అడిగి తెలుసుకోడానికి టీచర్లూ అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఈ సెలవుల్ని ఇంటికివచ్చి వృధాచేసుకోవడం నా కిష్టం లేదు" అన్నాడు రాజు చేతిలోని పుస్తకాన్ని ఇటు అటు తిప్పుతూ.
'పల్లెటూరు, వృథా చేయడం' అన్నమాటలు అన్నప్పుడు రాజు కంఠంలో వచ్చిన మార్పుల్ని, ముఖంలో మారిన రంగుల్ని పరిశీలనగా చూసేడు శివయ్య.
"నీ ఇష్టం, రాజూ! తెల్లవారుతూనే వెళ్లిపోతాను. ఈ రాత్రికే ఇంటికి వస్తానని చెప్పేను. నిన్ను కలుసుకోందే వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆగిపోయేను. మరొకసారి ఆలోచించుకొని నీకెలా బాగుందని తోస్తే అలా చెయ్యి. మరి నేను వెళ్లివస్తాను." పైమీద బట్ట సరిచేసుకొంటూ బయటికి నడిచేడు శివయ్య.
రూళ్ళ కాగితంమీద తొందరగా వ్రాసిన నాలుగు పంక్తుల ఉత్తరం, టేబిలుమీద నించి, వరదరాజును పరిశీలనగా చూస్తున్నది వదిన యెదురుగా నిలబడి 'రావా, వరదం? నువ్వు లేకుండా ఇంట్లో పండుగ ఎలా చేసుకోను?' అంటున్నట్లు వరదరాజుకి వినిపించింది.
'నేను రాను వదినా, ముమ్మాటికీ రాను. నువ్వు రమ్మన్నప్పుడు వచ్చేందుకు, పొమ్మన్నప్పుడు పోయేందుకు ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు.ఇంటికి వచ్చినవాణ్ణి తెల్లవారకుండా వేపమండలు పట్టుకు వెంటతరిమినట్లు మాట్లాడేవే! అప్పుడు ఈ అభిమానం అంతా యెక్కడికి ఎగిరిపోయింది? కుక్కలా ఎంత కొట్టినా మరిది నీ వెంటబడి తిరుగుతాడనే కదా నీ అహంకారం?
'తల్లి లేని నన్ను కొడుకుకన్న మిన్నగా చూసుకొంటూ పెంచేవన్న మమతతో నువ్వు అన్న మాటలకల్లా తల ఊపేను. నీ మాట జవదాటకూడదన్న నిర్ణయంతో, రాత్రీ పగలూ నీ కొంగు పట్టుకొని తిరుగుతూ నన్ను నేను ఎందుకూ పనికిరానంత పిరికివాడుగా తయారు చేసుకున్నాను. ఇంత వరకూ నువ్వుచేసిన సహాయానికి ధన్యవాదాలు వదినా! ఇంక నన్ను నాకు తోచినరీతిగా బ్రతకనీ' అంటూ ఎదుటలేని వదినకు జవాబు చెప్పి, యెదురుగా వున్న ఉత్తరాన్ని చించి బుట్టలో పారవేసేడు వరదరాజు.
రాత్రి గడిచి, తెల్లవారేసరికి కోపం, ఆవేశం పాళ్లు తగ్గి రాజు మనసులో ఆలోచనకి చోటు దొరికింది. అన్నయ్య సొమ్ముతో తను చదువుకొంటూ, అతడు స్వయంగా వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళకపోవడం బాగా లేదనిపించింది. వదినమీద కోపంవుంటే ఆమెతో తను మాట్లాడనక్కరలేదు. వదిన కోసం అన్నయ్యని, పూర్ణని ఎడంపెట్టవలసిన అవసరం లేదని నిశ్చయించుకొన్నాడు.
ఆ ఇల్లు వదిన తన పుట్టింటినించి తేలేదు. అన్నయ్య ఇంట్లో తన యిష్టం వచ్చినన్ని రోజులు ఉంటాడు. పొమ్మనేందుకు వదినకేం అధికారం ఉంది? తను ఉద్యోగంలో చేరగానే ఆమె గొలుసు విడిపించి ముఖాన పారవేస్తే సరి! మహ గొప్ప గొలుసు, తనకే ఉన్న దన్నట్లు మాట్లాడింది! కావాలంటే అటువంటి గొలుసులు పూర్ణకి ఒక వంద కొనగలడు తను. ఏమనుకొంటున్నదో? తన శక్తి సామర్ధ్యాలమీద వరదరాజుకి నమ్మకం ఏర్పడ్డాక తను కట్టబోయే మేడగురించి ఒకసారి మననం చేసుకొన్నాడు. అసలు వదినకి ఆ మేడలో ఏదో ఒక గది ఇవ్వవలసిన అవసరం ఉందా అన్న ఆలోచన వరదరాజు మనసులోకి వచ్చింది. వదిన లేకపోతే పూర్ణ ఏడుస్తుంది. ఇవ్వక తప్పదన్నట్లు విసుగుతో అనుకొన్నాడు రాజు.
సాయంకాలానికి ఒక నిర్ణయానికి వచ్చిన రాజు కాలేజినుండి కాస్త ముందుగా వచ్చి మూడు జతల బట్టలు సంచిలో వేసుకొని బయలుదేరేడు.
3
"రాజును కలుసుకున్నారా?" చెంబుతో నీళ్లు అందిస్తూ అడిగింది మీనాక్షి.
"ఆ....వాడికోసమే రాత్రి ఉండిపోవలసివచ్చింది." భార్య ఇచ్చిన నీళ్ళతో కాళ్లు కడుక్కొంటూ అన్నాడు శివయ్య.
"ఎలాగున్నాడు? ఏమంటాడు ?"
"అనేందుకు ఏముంది. ఈ సెలవులకి రాడుట."
"ఏం, ఎందుకు రాడు?"
"కారణాలు ఏవో చెప్పేడుకాని అసలు విషయం, వాడికి రావాలని లేదు."
"నే వ్రాసిన ఉత్తరం ఇచ్చేరా? చదివి ఏమన్నాడు ?"
"ఉత్తరమైతే ఇచ్చేనుకాని దానిని వాడు చదువుతాడనే నమ్మకం నాకు లేదు. రాజు చాలా మారిపోయేడు మీనాక్షీ! 'వరదం' అంటూ నువ్వు ఏ కొసనుంచి పిలిచినా 'ఓ' అని పలికే స్థితిలో లేడు. ఈ మార్పు మంచికే వచ్చిందో, చెడ్దకే వచ్చిందో నాకు తెలియదు. రాత్రి పదిగంటల ప్రాంతంలో గదికి వచ్చేడు. ఎక్కడికి పోయేవు అంటే బజార్లో తిరుగుతున్నాను అన్నాడు. ఆ మాట నిజమేకావచ్చు. కాని చెప్పినతీరులో బెరుకుతనం, భయం లేవు. నా బ్రతుకు నా యిష్టం అన్నట్లు ఉంది. సరిలే, ఇంతకీ మనం కోరుకున్న మార్పేగా ఆది. ఇప్పుడు దానికోసం దిగులు ఎందుకు?" అన్నాడు శివయ్య.
