"ఇదంతా దేనికో" అనుకున్నాడు జయన్న. అతని చేతికి ఓ కాగితం అందించాడు చౌదరి.
సోము ఆలోచనాపూర్వకంగా గమనించసాగాడు.
ఆ కాగితం చదివిన జయాన్న ఆశ్చర్యపోయి సోము చేతికి యిచ్చాడు. అదంతా నిర్లిప్తంగా చూడసాగాడు చౌదరి.
"ఏమిటది?" కఠినంగా అడిగాడు సోము. వాడికి ఆ నోటుని చూడగానే వళ్ళంతా వేడి పుట్టింది.
చౌదరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. సోము అలా తీవ్రంగా అడగ్గానే అతను సౌమ్యంగా అన్నాడు. "సోమూ ఇదెలా జరిగిందో నాకూ తెలియటం లేదు. చూడు అది మూడేళ్ళ నాడు రాసిన ప్రామిసరీ నోటు. నేను ఆర్నెల్లకోసారి తిరగ రాయిస్తానని తెలుసు కదా! ఇదెక్కడ పడిపోయిందో ఏమో. అసలు యీ డబ్బూ ఎప్పుడిచ్చానో మీ నాన్న ఎపుడు తీసుకున్నాడో కూడా నే మర్చిపోయినా. అందుకే మొన్న ఆ నోటు ఎంబడే దీన్ని అడగటానికి మర్చిపోయినా. అయినా యీ విషయం చెబితే ఎవరూ నమ్మరు. ఇదేదో దొంగానోటు అంటారు. దొంగేటత్తు అంటారు. కాని నేను నిజం చెబుతున్నా, నమ్మూ నమ్మకపోండి. మీ చేతికిచ్చేసినా! ఇప్పుడు మీరు చింపేసినా నేనేం చేస్తాను. మనం మనం ఒకటిగా సొసైటీ పెట్టుకుంటున్నాం. మనమంతా సవ్యంగా వుండాలి!"
సోము చప్పున సమాధానం యివ్వలేదు.
జయన్న కూడా ఆలోచనల్లో మునిగిపోయాడు.
ఇద్దరికీ చౌదరీ మాటతీరు వ్యవహారం అంతా కొత్తగా వింతగా వుంది.
చౌదరి మళ్ళీ అన్నాడు "నీ యిష్టం. ధర్మాధర్మాలు ఆలోచించు. న్యాయం అంటే యియ్యండి. లేదా ఇదో అగ్గిపుల్ల గీచేయ్యండి. కానీ ఒకటే మాట! నోటుంది, లేక్కుంది. నేనున్నా! మీ నాయనా వున్నాడు. అడగండి అయినా యీ విషయం యిప్పుడెవరూ నమ్మరు. మీకు ధర్మమనిపిస్తే యియ్యండి అంతే!" లౌక్యంగా అన్నాడు.
"బాబుగారూ"
"జయన్నా మాకు మధ్యవర్తివి నువ్వే. నీవేం ధర్మం చెబితే అదే ధర్మం."
చౌదరికి చాలా సంతోషంగా వుంది. పోర్జరీ నోటు యింత త్వరగా యింత సులభంగా బయటికి వస్తుందని అతనూహించలేదు. ఈ తరహ రాజకీయాలు అతనికి కొత్తే. కరణమూ తెలివితేతలంటే మీ సొత్తే! అనుకున్నాడు . గతరాత్రి ఏకాంతంలో శేషయ్య యిచ్చిన సలహా అంత గొప్పగా పని చేస్తుందని అతననుకోలేదు.
జయన్న సోము ముఖంలోకి చూశాడు.
"ఇప్పుడేం చేయాలి?"
సోము మాటలకి "నీ యిష్టం." అన్నాడు చౌదరి.
మొన్న అప్పు తీరిందని సంతోషపడ్డాం ఇప్పుడు మళ్ళీ వెయ్యి రూపాయలు. మూడేళ్ళ వడ్డీ అంటే మా నడ్డీ విరిగినట్టే. ఎమంటానికీ నోరు రావటం లేదు.'
సోము మెత్తబడటం చూసిన చౌదరికీ ఎనుగంతా బలం వచ్చేసింది. "ఒరే! సోమూ, అదిప్పుడే తీర్చొద్దులేరా" వున్నప్పుడు తీర్చితే చాలు. అసలు అప్పు వున్నానని ఒప్పుకుంటే చాలు! దాంతో నేను అన్యాయం చేసినా నమ్మకం అంతే చాలు.'
సోముకి చాలా బాధగా ఉంది విషయం చప్పున ఆ నోటుని చించేస్తే చౌదరి చేయగలిగింది లేదు, కానీ దానికి మనసొప్పటం లేదు. కాదని ఒప్పుకుంటే ఈ బాకీ ఎప్పుడు తీరేట్టు. అది తండ్రి చేసిన ఋణం. ఇది తను నెత్తికేత్తుకుంటే ఋణం. దాంతో తండ్రి బతుకు గడిచింది. దీంతో తన బతుకంతా తీరిపోతుంది . ఇదింతేనా! అనుకున్నాడు.
మౌనంగా ముఖ కవళికలు పరీక్షగా చూస్తున్నాడు చౌదరి. మెత్తబడిన మనసుమీదే దెబ్బ కొట్టాలనుకున్నాడు.
"ఒరే సొమూ, జయన్న! ఈ వెయ్యికి వడ్డీ వద్దు. ఇక ముందు కూడా వడ్డీ వద్దు. ఎప్పటికయినా అసలు యిస్తే చాలు. నేనూ, నువ్వూ సరిగా వుంటే ఆ బాకీ ఎప్పుడూ తీర్చినా ఫర్వాలేదు."
జయన్నకీ ఆ మాట సమంజసమే అనిపించింది.
