Previous Page Next Page 
వారుణి పేజి 29


    ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్త అడ్డుచెపితే అతనితో వాదించి ఒప్పిస్తుంది.
    మామగారి పట్ల గౌరవం వుంది. ఆయన అడ్డుచెపితే సమాధానమియ్యదు. అనుకున్న పని మాత్రం చేసేస్తుంది. ఆయన రెట్టించి అడిగితే ఆయన మనస్సుకి వచ్చేలా తన వాదనని వినిపిస్తుంది.
    వారుణికి వచ్చిన చిక్కల్లా అత్తగారితో తోడికోడలితోనూ. వాళ్ళిద్దరికీ వారుణి ధోరణి నచ్చలేదు. ఏం చేయటానికీ తోచలేదు కోడలు వినేట్టుగా కొడుకుతో భర్తతో ఆమెని తక్కువ చేసి మాట్లాడేది సుబ్బరత్నమ్మ.
    అయినా వారుణి ఏనాడూ అత్తగారితో పోట్లాటకి దిగలేదు. తొలినాడు కాపురానికి వచ్చిన రోజునే ఆమె తన వేషభాషలని భోగం దానితో పోల్చినప్పుడే ఆమె సంస్కారమెంతో అంచనా వేసుకుంది. అలాంటి వాళ్ళిక అంతే. వాళ్ళని సంస్కరించలేం. పోట్లాడాలి లేదా నిర్లక్ష్యం వహించాలి అనుకుంది.
    పోట్లాడటం యిష్టంలేని వారుణి అత్తని, సావిత్రిని నిర్లక్ష్యం చేయసాగింది.


                         *    *    *    *


    సావిత్రి కూతురు సరోజ వారుణికి దగ్గరై చనువుగా మెలుగుతూంది. సరోజ గొంతు, నడక వారుణికి ముచ్చటగా అన్పించాయి. ఆ అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పించాలనుకుంది.
    మొదటగా తోడికోడలుతో ఆ ప్రస్తావన తెచ్చింది వారుణి.
    "నా కిష్టం లేదు!" మొండిగా అంది సావిత్రి.
    నిజానికి సావిత్రికి యిష్టంలేక కాదు. వారుణి ప్రతిపాదన తను ఒప్పుకుంటానికి ఆమె మనస్కరించలేదు. అదే అత్తగారుగానీ, భర్తగాని అని వుంటే ఒప్పుకునేదే.
    ఇలాంటి విషయాల్లో ఆమెకి తెలియనితనంగానీ, అమాయకతగానీ లేవు. వున్నదల్లా మూర్ఖత్వం. వారుణి అంటే గిట్టకపోవడం వల్ల వచ్చిన మొండితనం.
    సావిత్రికి ఎలా నచ్చచెప్పాలో తెలియలేదు వారుణికి. నిస్పృహతో నిట్టూర్చింది. ఆఖరి ప్రయత్నంగా అంది.
    "అక్కయ్యా! నా మాట విను. రొజాని డాన్స్, మ్యూజిక్ స్కూల్లో చేర్పించటం వల్ల నష్టం లేదు. దాని గొంతు అద్భుతంగా వుంది."
    "నా కూతురు సంగీత కచ్చేరీలు చేయనక్కరలేదు. సినిమాలకి పాడనక్కరలేదు." కఠినంగా జవాబిచ్చింది సావిత్రి.
    "సరే అక్కయ్యా! అవేవీ అవసరం లేదు. కాని చదువు చదివిన ప్రతివారూ ఆ చదువుతో సంపాదించాలనే రూలు లేదు. అసలు చదువు ధ్యేయం ఉద్యోగం కాదు. మానసిక వికాసం, చిత్త సంస్కారం. సంగీతమూ అంతే! అది తనకై తను, తన భర్త కోసమూ పాడుకోగలిగితే చాలు. మనం రేడియోలు టేప్ రికార్డర్లు ఎందుకు వింటున్నాం? కాస్త రిలాక్సేషన్ కోసం, అవునా?"
    "అయితే ?"
    "శాస్త్రీయ సంగీతం అంతకంటే హాయినిస్తుంది. మానసిక శాంతినిస్తుంది. మనస్సులోని టెన్షన్ ని తగ్గిస్తుంది. లలితకళలు మామూలు మనిషిని మహోన్నత స్థాయికి తీసుకెళతాయి. మానసికంగా ఎదుగుదల చూపుతాయి."
    ఆమె మాటలకు అడొచ్చింది సావిత్రి.
    "నా కూతురు మహోన్నత స్థాయి చేరుకోనక్కర లేదు. ఎంత చదువుకొన్నా ఆడదాని స్థానం వంటిల్లే. నీలాంటి అదృష్టం అందరికీ రావద్దూ?"
    "అదికాదక్కయ్యా ?"
    "బట్టలుతుక్కొని, నీళ్ళు తోడుకొని, అంట్లు తోముకోవటానికి సంగీతమూ సింగినాథమూనూ."
    రైలుపట్టాలు కలియవు. ఉత్తరదక్షిణ ధృవాలు కలుసుకోవు అనుకుంది వారుణి. అయినా సావిత్రి పట్టుదల రెట్టింపు తనకూ వుందనుకొంది.
    "అక్కయ్యా!"
    "మాటిమాటికి అక్కయ్యా అంటావేమిటి ? నేన్నీకంటే ఎన్నేళ్ళో పెద్దనుకుంటున్నావ్. పదా, యిరవయ్యా? ఇద్దరిదీ దాదాపు ఒకటే వయసు. కాదంటే నాకు పద్దెనిమిదేళ్ళకే పెళ్ళయింది. నీకు పాతికేళ్ళు వచ్చేదాక కాలేదు. నాకు ఏడాది తిరక్కుండానే కూతురు పుట్టింది." విసురుగా అంది సావిత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS