ఒక్క సంగతి తెలుస్తోంది. విశృంఖలత్వంతో కూడా నిగ్రహశక్తి కావాలి. లేకపోతే జీవితాలు ఎటువైపు పరుగెడుతాయో తెలీదు.
మెల్లగా తలఎత్తి ఆమె ముఖంలోకి చూశాను. నావంకే చూస్తోంది. మళ్ళీ ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.
నేను ఓ నిర్ణయానికొచ్చేశాను.
"మీరు చెప్పిన మాటలు గొప్ప గొప్ప సత్యాలై ఉండవచ్చు. ఖండించే శక్తి నాకు లేదు. కాని నాక్కావలసింది వేరు."
ఆమె అలాగే నా కళ్ళలో కళ్ళు కలిపి చూస్తోంది.
"గుర్తింపు ఉండే జీవితం అవసరమే. నేనూ అలాంటి జీవితాన్ని కోరుకుంటాను. కాని ఆ గుర్తింపు కోసం ఇంత బరితెగించి ఉండకూడదు. అలా కాకుండానే నేను సాధిస్తాను. సెలవు" అంటూ లేచి నిలబడ్డాను.
ఆమె ముఖంలో ఏ భావమూ కనబడలేదు.
"సతీ! కారులో వెళ్ళు" అంది. ఆ గొంతులో ఆప్యాయతే తొణికిసలాడుతూ ఉండటం గమనించాను.
"వొద్దండి. థాంక్స్" అంటూ వడివడిగా బయటి కొచ్చేశాను.
గేటు దగ్గర సుకుమార్ తారసపడ్డాడు. "సతీ! కారు..."
"అక్కర్లేదు" అని రోడ్డుమీదికొచ్చేశాను.
12
అప్పటికి చీకటి పడింది. ఎందుకో ఇంటికెళ్ళాలనిపించలేదు.
అంతటి లోతైన సంభాషణ జరిగాక ఆ వొంటరితనం....
ఎక్కడి కెళ్ళాలి?
స్కూల్లో, కాలేజీలో మొదటి సంవత్సరమే. అయినా, ఆ రోజుల్లో.... ఎంతమంది స్నేహితులుండేవారు! వాళ్ళంతా ఇప్పుడేమయిపోయారు?
ఒంటరితనంలో చక్కని స్నేహమెంత సేద తీరుస్తుంది!
కాని....
అనుకోకుండా మళ్ళీ లోపలికెళ్ళి పోతున్నాను. అంది ఉంది అనుకునే చాలా పదాల్లాగే నిజమైన స్నేహమనేది.... ఇక్కడ నిజమనే పదాన్ని నొక్కి చెబుతున్నాను.... ఈ లోకంలో ఉందా? కొంతవరకూ ప్రయాణించే లైకింగ్. దాన్నే స్నేహమని అనుకుంటూ ఉంటాం. ఎంత ఇష్టపడిన వారిలో కూడా మనకు నచ్చని గుణాలనేకముంటాయి. భరిస్తూ ఉంటాం. లేక పరోక్షంగా విసుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి అది ఏవగింపు వరకూ వెళుతుంది. అయినా స్నేహం మాత్రం కొనసాగుతూ ఉంటుంది.
మంజరిని నేను చాలావరకూ ఇష్టపడ్డాను. ఆ సమయంలో ఆమె దగ్గరకెళ్ళాలనిపించింది. ఎడ్రెస్ చూచాయగా గుర్తుంది. ఆమెను చూడాలి. కలుసుకోవాలి అన్న కోరిక ఉధృతంగా ఉంది. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో వందరూపాయల దాకా ఉన్నాయి. ఆటో ఎక్కి ఆమె చెప్పిన లొకాలిటీ కెళ్ళాను.
ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేసి ముందుకు నడుస్తున్నాను.
ఆ సందు, వాతావరణం వెంటనే అర్థమయిపోయింది. కిళ్ళీకొట్ల దగ్గర పాన్ లు నముల్తూ, సిగరెట్లు కాలుస్తూ నిలబడ్డ వాళ్ళు, త్రాగిన మైకంలో అటూ ఇటూ తూలిపోతూ నడిచేవాళ్ళు....
ఇహ ఆ ఇళ్ళు....
ఎవరెవరో బయటికొస్తున్నారు. పోతున్నారు. గుమ్మాల దగ్గర అమ్మాయిలు కనిపించి అంతలోనే లోపలికెళ్ళిపోతున్నారు.
మంజరి మరీ ఇలాంటి దుర్భరమైన వాతావరణంలో జీవిస్తోందా?
ఒక్కొక్క ఇల్లూ దాటుకుంటూ వెళుతున్నాను. ఎవర్నడగాలో, ఎలా అడగాలో తెలీటం లేదు.
ఒంటరిగా నడుస్తోన్న నామీద తదేకంగా ప్రసరిస్తున్న అక్కడివారి చూపులు....
ఓ ఇంటి ముందు ప్యాంటూ, గళ్ళ షర్టూ వేసుకుని గిరిజాల జుట్టుతో ముప్ఫయి ముప్ఫయి అయిదేళ్ళ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
నన్ను చూసి సైగ చేస్తూ తనవైపు రమ్మని పిలిచాడు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనుషులు రిస్క్ నాహ్వానిస్తూ ఎందుకు ప్రవర్తిస్తూంటారో తెలీదు. బహుశా ఆ సమయంలో నా ప్రవర్తనకూ అర్థం పర్థం ఉండి ఉండదు.
ఏం చేయాలో తెలీక అతనికేసి వెళ్ళాను.
"ఎవరు కావాలి?" అన్నాడు.
"మంజరి"
"ఓ. అదా! సన్నగా, పొడుగ్గా చాకులా ఉంటుంది.
ఏం జవాబు చెప్పాలో తెలీక తలూపాను.
"దాంతో నీకేం పని?"
"నా స్నేహితురాలు."
నా కళ్ళలోకి తినేసేటట్లు చూస్తున్నాడు. అతడి మనసులో ఏవేవో భావాలు సుడులు తిరుగుతున్నాయని అర్థమవుతోంది. మళ్ళీ ఏమనుకున్నాడో "ఆ పైకి వెళ్ళు. ఎర్ర గోడలతో కట్టిన ఇల్లు కనబడుతుంది. అందులో ఉంది."
రెండు మూడు సెకండ్లు సందేహించి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాను. కాని అక్కడి దాకా వచ్చాక వెనకడుగేమిటని ముందుకే సాగాను.
కొంతదూరం పోయాక ఎర్రగోడల ఇల్లు కనిపించింది.
అక్కడి వాతావరణం ఇప్పుడింకా బాగా అర్థమవుతోంది. అవి కేవలం పడుపు వృత్తి నిర్వహించే గృహాల్లాగే కాకుండా బయటకు మామూలు కుటుంబాల్లా ఉన్నాయి. ఇంటి యజమాని, యజమానురాలూ, పిల్లా.... జల్లా.... జరగాల్సిన వ్యవహారమేదో గప్ చుప్ గా జరిగిపోతోంది.
ఎర్ర గోడల ఇంటిముందు ఓ శవం పడుకోబెట్టబడి ఉంది. చుట్టూ చేరిన మనుషులు, ఆ శవానికివ్వబడుతోన్న ప్రాముఖ్యత చూస్తోంటే, బహుశా యజమానురాలయి ఉంటుందనిపించింది. ప్రక్కనే అరవై ఏళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. చాలా దుఃఖంలో ఉన్నట్లే కనబడుతున్నాడు. చుట్టూ ఉన్నవారిలో కొంతమంది ఏడుస్తున్నారు. వారిలో కొంతమంది వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు.
మంజరి ఈ ఇంట్లో ఉన్నదా? ఈ పరిస్థితుల్లో ఎవర్నడగాలి?
సంకోచిస్తూ కొంచెం దూరంలో నిలబడ్డాను.
