Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 29


    "ఇలాగయితే మేమేం ఉద్యోగాలు చేస్తాం. రోజూ కంపెనీ డబ్బు కొన్నివేలు మా చేతులలో తిరుగుతుంటుంది. ఇలా తినెయ్యటం అలవాటయితే పని చెయ్యగలమా? ముప్పయి యేళ్ళనుంచీ ఈ కంపెనీలో పనిచేస్తున్నాను." అని విదిలించేశాడు.

    నిస్సహాయంగా ఫోన్ పెట్టేశాడు పట్టాభి. అతనికేం చెయ్యాలో అర్ధం కాలేదు.

    "శ్యాం ఏం చేద్దాం?" నీరసంగా అడిగాడు.

    "ముందు హెడ్ క్యాషియర్ కి చెప్పు. ఆయన ద్వారా ఏజెంట్ కి తెలియజెయ్. అందరూ సహకరిస్తే ఎమౌంట్ కట్టేయ్యొచ్చు. పై ఆఫీసుకి రిపోర్టు చేయకుండా ఆపచ్చు. అంతే! డబ్బుమాత్రం కట్టెయ్యాలి."

    "సరే పద!" అని హెడ్ క్యాషియర్ వద్ద కెళ్ళారు.

    వివరంగా అంతా చెప్పాడు. అతను తమిళయన్! స్ట్రిక్ట్ మనిషని పేరు! "సారీ పట్టాభీ! క్యాష్ విషయంలో రొంబ జాగ్రత్త వుండాలి. నేనేం హెల్ప్ చేయలేదు. డబ్బు కట్టే మార్గం చూడు. కేసు కాకుండా చూద్దాం. పద ఏజెంటుని చూద్దాం."

    పట్టాభి నోరెత్తలేదు.

    ఏజంట్ ని చూశారిద్దరూ.

    ఆయన వస్తుతంః చాలా మంచివాడు. జీవితంలో ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్నవాడు. విషయం వినగానే జీప్ తీసుకుని ఆ కంపెనీకి వెళ్ళారిద్దరూ. అయితే ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఒకటే సమాధానం చెప్పాడు.

    మీ యిష్టం. మీరెన్నయినా చెప్పండి. నాకు డబ్బు సరిగ్గా యిచ్చారు. ఎక్కువివ్వలేదు. మీరు కాదు కూడదని ఏదయినా చేయదలుచుకుంటే నేనేం చెప్పను. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఆ తర్వాత పరువు నష్టం దావావేస్తాను." అని ఖచ్చితంగా చెప్పటంతో నిరాశతో తిరిగొచ్చారు.

    బాంకి వాళ్ళంతా కలసి ఎమౌంట్ సరిచేశారు. ఓ వారం లోపల తిరిగి యివ్వమన్నారు.

    పట్టాభిరాంకి ప్రాణాలు పోయినట్లే అనిపించింది. తన నరనరాల్లోని రక్తాన్నంతా ఎవరో తోడేస్తున్నట్లు బాధపడ్డాడు. తండ్రికి ముఖం ఎలా చూపించటమా అని మధనపడసాగాడు. ముఖం వేలాడేసుకుని యింటికి తిరిగొచ్చాడు.

    శాస్త్రి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. రామాయణం డిక్టేట్ చేయటం మినహా మరేమీ చేయటం లేదు. ఉదయమే అనుష్ఠానం తీర్చుకోవటం కాఫీ తీసుకుని కూర్చుని ఏడు, ఏడున్నర దాకా చెప్పి ఎనిమిదింటికి భోంచేసి పడుకోవటం ఇదీ దినచర్య!

    నాలుగుగంటలకి పట్టాభి యింటికి వచ్చేసరికి రామాయణం ప్రారంభిస్తున్నారాయన. యుద్ధంలో ఓడిపోయి వస్తున్న వీరుడిలాగా వున్న కొడుకుని చూసి, చెప్పటం ఆపి "ఏమిటి అలా వున్నావ్?" అని అడిగారు.

    నింపాదిగా తండ్రి వద్ద కూర్చుని విషయం వివరించాడు పట్టాభి.

    దీర్ఘంగా నిట్టూర్చారు శాస్త్రిగారు.

    "ఏం చేద్దాం రాముడి దయ అలా వుంది" అన్నారు.

    "ఇన్నెళ్ళయింది? ఒక్కనాడూ ఒకరూపాయి తేడా రాలేదు. ఈ రోజు ఎలా జరిగిందో అర్ధం కాలేదు" దిగులుగా అన్నాడు.

    "మనసు అన్యధా యత్తమైతే ఆ ఆలోచనలో పడిన మనిషి పొరపాటు చేస్తాడు"

    తలూపాడు పట్టాభి.

    "మరి ఏం చేశావ్"

    "స్టాఫ్ తలా కొంత బదులిచ్చారు. కాష్ బాలెన్స్ సరిపుచ్చాను"

    ...          ...          ...        ...

    "వాళ్ళకి ఓవారంలోగా తిరిగి యివ్వాలి"

    ...          ...         ...

    "నా వద్ద ఆరొందలున్నాయి. ఇంకా మూడువేలు కావాలి". శాస్త్రిగారు అందుకు బదులు పలకలేదు.

    "మావయ్యా" స్వాతి పిలిచింది.

    "నా వద్ద మాత్రం ఎక్కడిదమ్మా! వీళ్ళిచ్చే జీతాలు నాజీతం కలిస్తే సంసారం లోటుపడకుండా గడుస్తుంది. ఇక ముందు నుంచి ముగ్గురి జీతాలు రావు, సంసారం పొదుపుగా జరుపుకోవాలి"...

    "నావద్దవున్నాయి మావయ్యా! మీరు నాపేరవేశారుగా మూడువేలు. అవి సర్దుబాటు చేయండి. ఈ ఇంట్లో ఒకరికి యిబ్బంది వస్తే అందరికీ వచ్చినట్లే కదా! మన కుటుంబ గౌరవానికి సంబంధించిందీ సమస్య. రేపే డ్రా చేసి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే మనకీ గౌరవంగా వుంటుంది"__

    "స్వాతి!"

    "అవును మావయ్యా!"

    "లేదమ్మా! లేదు. అది నువ్వు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. దానిలో నుంచి ఏమీ వాడటానికి వీల్లేదు. నీవు భవిష్యత్తులో చిక్కుపడకుండా ఆ రాముడు చూపించిన మార్గం యిది."

    "ఏం ఫరవాలేదు మావయ్యా. ఇలాంటి సమయాల్లో మనం వెనకా ముందాడ కూడదు. ఇప్పుడు యీ ఖర్చు భగవంతుడు చేసిందే అనుకుంటే త్వరలో మళ్ళీ ఆ భగవంతుడే ఇస్తాడు. అంతా ఆయన దయ _ మనదేవుంది మామయ్యా. నిమిత్తమాత్రులం" స్థిరంగా చెప్పింది స్వాతి.

    ఆమె మాటలు విన్న శాస్త్రిగారు మౌనమే వహించారు.

    "నాన్నగారూ !"

    తనక్కడలేనట్లుగా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటే పట్టాభికి సిగ్గనిపించింది. చాలా చిన్నతనంగా ఫీలయ్యాడు. అందుకే తన ఉనికిని గుర్తుచేస్తూ పిలిచాడు.

    "నేనేం చెప్పను పట్టాభి! వ్యక్తిత్వమున్నవాడివి నువ్వు. నీ ఉద్యోగంలోని కష్టనిష్టూరాలకు నీవే బాధ్యత వహించాలి. నేనేం చెయ్యగలను?"

    "నేను నిస్సహాయ స్థితిలో మిమ్మల్ని అడిగాను" ప్రాధేయపూర్వకంగా అన్నాడు.

    "ఒక తండ్రిగా సానుభూతి చూపగలను. అంతే! మిమ్మల్ని కన్నాం, పెంచాం, పెద్దచేశాం. విద్యాబుద్ధులు చెప్పించాం. ఉద్యోగాల్లో చేర్పించాం"

    "మామయ్యా! ఇప్పుడెందుకదంతా?" స్వాతి ఆయన మాటలకు అడ్డువచ్చింది.

    "ఉండమ్మా! చెప్పనియ్! బాధ్యతలెప్పుడు తెలుసుకొంటారు? పెళ్ళి చేస్తే... మాకు ఆ కొంచెం బాధ్యతా తీరిపోతుంది"

    "నేను అడిగేదొకటి? మీరు చెప్పేదొకటి? ఇప్పుడీ ఉపన్యాసం దేనికి?" పట్టాభి చిరాకుపడ్డాడు.

    "కాలంకొద్దీ మనుషులంతా__పశువుల్లాగా పక్షుల్లాగా అయిపోతారు. రెక్కలొచ్చిన చిలుక ఎగిరిపోయినట్లుగా, పెద్దవాళ్లైన సంతానం తల్లిదండ్రులనుంచీ, సోదరుల నుంచీ దూరమైపోతున్నారు" 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS