ఓ రోజు అర్దరాత్రి మామిడితోపులో ఆ ముగ్గురూ కూర్చుని మందు కొడుతూ దెబ్బతిన్న వ్యాపారం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
"ఈ దెబ్బ నుంచి తేరుకోకపోతే మనం వీధులెంట అడుక్కుతినవలసిందే" పట్టాభి నిస్పృహగా అన్నాడు.
"ఎలా తేరుకుంటాం? నిండా మునిగిపోయాం కదా? మధుమూర్తి అడుగుతున్నాడు. ఓ ప్రక్క జరిగిన నష్టాన్ని మర్చిపోయేందుకు కసిగా త్రాగుతూ.
"నేనప్పుడే చెప్పాను. అలాంటి వ్యాపారాలు మనకొద్దని మీరు వినలేదు...." దిగులుగా అన్నాడు పరమశివం.
ఛత్....నువ్వు మాట్లాడకు. అసలే కొంప కొల్లేరయి మేమేడుస్తుంటే నువ్వేంటి మధ్యలో వేమన శతకాలు వల్లిస్తావ్?"
పట్టాభి కసురుకున్నాడు పరమశివాన్ని.
ఉన్న ఆస్తినంతా వూడ్చి మధుమూర్తిని, పట్టాభిని నమ్ముకుని వ్యాపారంలో పెట్టాడు.
పాలిథిన్ పేకింగ్ మెటీరియల్ తయారు చేయటం లాభసాటి వ్యాపారమే. కాని....మధుమూర్తి ఆలోచనలు ఆ వ్యాపారంతో ఆగిపోలేదు.
ఫ్యాక్టరీ వెనుక అడవిలా వున్న ప్రాంతాన్ని ఎవరికీ తెలియకుండా చదును చేయించి గంజాయి మొక్కల్ని నాటించాడు.
నాటిన రోజు నుంచి ఆ వేపుకి ఎవరూ పోకుండా దుర్గాదాసుని కాపలాగా పెట్టాడు. ఆ విషయం పట్టాభికి తప్ప పరమశివానికి తెలియదు.
గంజాయి మొక్క ఎంత దూరంలోవున్నా ఓ రకమైన వెగటు వాసన వస్తుంటుంది.
అందుకే గంజాయి మొక్క వాసనను కాంపెన్ సేట్ చేసేందుకు మరో కొత్తరకం మొక్కను తెప్పించి వాటిమధ్య వేసేందుకు ప్లాన్ చేశాడు.
గంజాయితోట క్రమంగా పెరగ నారంభించింది.
దాంతోపాటు మధుమూర్తిలో ఆందోళన కూడా పెరగసాగింది.
మరికొద్ది రోజులుపోతే గంజాయి మొక్కల వాసన గాలిలో ప్రయాణించి తమ వునికిని బయట ప్రపంచానికి తెలియజేస్తుంది.
లక్షలు లాభం తెచ్చిపెట్టే మొక్కలే దెయ్యాలయి తమను పీక్కుతింటాయి.
ముందు ఆ వాసన తమ కంపెనీలో పనిచేసే వర్కర్సుకి తెలిసిపోతుంది.
వాళ్ళు ఏ క్షణాన ఆ వార్తను లీక్ చేసినా అందరికీ బేడీలు పడటం ఖాయం.
అందుకే ఓ రోజు అర్దరాత్రి దుర్గాదాసుతో వచ్చి పాలిథిన్ గుళికల్ని కరిగించి పేపర్ క్రింద మార్చే యంత్రాన్ని విరగొట్టించాడు. దాంతో ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించే అవకాశానికి వీలుపడింది. ఈ తెర వెనుక భాగోతమేమీ తెలియని పరమశివం ఇన్సూరెన్స్ అధికారులకు తెలియజేశాడు నష్టపరిహారం ఇప్పించాలంటూ.
మరుసటిరోజే ఇన్సూరెన్స్ అధికారులు చెకింగ్ కి వచ్చి యంత్రం పాడయిన విధానం తమకు అనుమానం కలిగించిదంటూ నష్టపరిహారం ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపారు.
దాంతో పరమశివానికి అనుమానం వచ్చింది. కావాలని యంత్రాన్ని ఎవరు పాడుచేస్తారు? ఎవరికా అవసరం వుంది? వినయంగా తలవంచుకుని పని చేసుకుపోయే వర్కర్స్ కి ఆ అవసరం లేదు. మరి....
ఇదే అనుమానాన్ని ఓ రోజు దిగాలుగా తన భార్యా బిడ్డలముందు అనేశాడు పరమశివం.
"ఫ్యాక్టరీమీద తమ బ్రతుకుల్ని వెళ్ళబుచ్చుకుంటున్న బీద కార్మికులకి ఆ యంత్రాన్ని నాశనం చేయాలనే ఆలోచన రాదు. పైగా వాళ్ళేం తీరని కోర్కెలతో మీమీద నిరసన కూడా ప్రకటించలేదు. అలాంటప్పుడు ఆ పని చేసింది వాళ్ళు కాదనిపిస్తోంది. మరెవరు....?" పరమశివం భార్య సాలోచనగా అంది.
"కాస్తో కూస్తో లాభాలు కూడా వస్తున్నాయ్. అలాంటప్పుడు ఏ యజమానీ యంత్రాన్ని కావాలని పాడు చేసుకోడు" పరమశివం అన్నాడు తన సైడ్ నుంచి.
"కాస్తో కూస్తో చాలదని ఇంకెక్కువ లాభం కావాలని ఎవరన్నా ఆ పని చేసారనుకోటానికి ఏమయినా వీలుందా?"
ఆమె మరలా అంది.
అప్పుడు చప్పున మధుమూర్తి గుర్తుకొచ్చాడు పరమశివానికి.
"ఆ యంత్రం దానంతటదే సాంకేతిక కారణంగా పాడయితేనే ఇన్సూరెన్స్ వాళ్ళు నష్టపరిహారం యిస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు కనుక ఇన్సూరెన్స్ సైడ్ లాభం ఆశించి ఆ పనిచేసి వుండరు."
"యంత్రం పాడయితే ఏమవుతుంది నాన్నా?"
అప్పటివరకూ అక్కడే వుండి, తల్లి దండ్రుల మధ్య నడిచే సంభాషణను శ్రద్ధగా వింటున్న పరమశివం కూతురు ప్రశ్నించింది.
"ఫ్యాక్టరీ మూతపడుతుందమ్మా!"
"మూతబడితే?" తిరిగి ప్రశ్నించింది కూతురు.
"ఫ్యాక్టరీ మూతపడుతుందమ్మా!"
"మూతబడితే?" తిరిగి ప్రశ్నించింది కూతురు.
"ఫ్యాక్టరీకి తాళాలు వేసుకోవలసిందే" అన్నాడు విసురుగా పరమశివం.
"అలా చేస్తే లాభం వస్తుందా నాన్నా?"
పరమశివం పదేళ్ళ కొడుకు ఉదయ్ అడిగాడు. అక్కను చూసి తనకూ ఏదో అడగాలనిపించి. కొడుకు ప్రశ్నతో ఉలిక్కిపడ్డాడు.
ఆ ప్రశ్నలో ఏదో మర్మం దాగుంది.
కొడుకు తెలియక ఆ ప్రశ్న వేసినా, దాని జవాబును రాబట్ట గలిగితే అసలు విషయం బయటపడిపోతుంది.
అంతే....
పరమశివం చటుక్కున లేచి యిప్పుడే వస్తానంటూ ఫ్యాక్టరీకి సాగిపోయాడు ఆ అర్దరాత్రి చీకట్లోనే.
కేవలం కుతూహలంకొద్దీ పడుకుంటున్నట్లే నటించి తండ్రిని అనుసరించసాగాడు ఉదయ్.
పరమశివం అరగంటలో ఫ్యాక్టరీకి చేరుకున్నాడు.
