Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 4

    చీకటి నిశ్శబ్దంలో ఫ్యాక్టరీ చిమ్నీ నిర్జీవంగా కనిపిస్తోంది. అది పొగలు చిమ్మితేనే తమ పొట్టలు గడిచేది. శ్మశానం నడిబొడ్డున మోడువారిన చెట్టులా  కనిపిస్తున్న చిమ్నీవేపే చూస్తూ గేటువైపు సాగిపోయాడు.

    గేటుదగ్గర ఎప్పుడూ  వుండే వాచ్ మెన్ లేడు. అతని స్థానంలో ఓ కొత్త వ్యక్తి దృడంగా తుమ్మమొద్దులా వున్నాడు.

    ఈ మార్పు ఎప్పుడు జరిగింది?

    అంటే తన నోటీసుకు రాకుండానే ఫ్యాక్టరీలో చాలా మార్పులు జరుగుతున్నాయన్నమాట.

    పరమశివం ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.

    తన పాత్రని కావాలనే తన భాగస్తులు  రోజురోజుకీ తగ్గిస్తూ వస్తున్నారా?

    "ఎవరది?"

    దుర్గాదాసు గొంతు ఖంగుమంది.

    పరమశివం అప్పుడు  గుర్తుపట్టాడు. అతను దుర్గాదాసు  అని__పట్టాభికి కుడిభుజమని.

    పరమశివంలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. "నేనే...." అన్నాడు మామూలుగానే.

    "మీరా సార్....ఏమిటి ఈ టైములో యిలా వచ్చారు?" ఒకింత విసురుగానే అన్నాడు.

    అతని ప్రవర్తనలో పరమశివం కూడా  తన  యజమానేనని  ఏ కోశానా కనిపించలేదు.

    అతను దుర్గాదాసు గొంతులో తొంగిచూసిన కర్కశత్వాన్ని చప్పున గ్రహించి మాట మార్చేశాడు.

    "సాయంత్రం ఇంటికెళుతూ  నా క్యాష్ బ్యాగ్ ని ఫ్యాక్టరీలో మర్చిపోయాను. అందులో డబ్బుండిపోయింది. రేపు తెల్లవారుజామునే ఊరికెళ్ళాల్సి వుంది. దాన్ని తీసుకెళదామని  వచ్చాను. బై ది బై! జాగ్రత్తగా కాపలా కాస్తున్నావుగదా?" కృత్రిమమైన ప్రసన్నతను మొఖంమీదకు తెచ్చుకున్నాడు అతను.

    దుర్గాదాసుకు  ఎలాంటి అనుమానం రాలేదు.

    "వెళ్ళి తెచ్చుకోండి సార్" అన్నాడు గేటు తెరుస్తూ.

    ఓసారి గుండెనిండా ఊపిరి  తీసుకుని బిల్డింగ్ వేపు సాగిపోయాడు అతను.

    బిల్డింగ్ కి దగ్గరవుతుండగానే ఏదో వెగటు కలిగించే వాసన ఘాటుగా వచ్చి తగిలింది. ఆ వాసన దేనికి సంబంధించినదో అర్ధంగాక ఓ క్షణం అనుమానించి తన గదిలోకి వెళ్ళి లైట్ వేసి కిటికిలోంచి  ఓసారి గేటువైపు చూశాడు. దుర్గాదాసు తాపీగా సిగరెట్ వెలిగించుకుని బెంచ్ మీద కూర్చుని కనిపించాడు.

    అంతే....

    చప్పున వెనుదిరిగి ఫ్యాక్టరీ వెనుకవేపు భాగానికి దూసుకుపోయాడు. వెళుతుండగానే మరింత ఘాటయిన వాసన వచ్చింది.

    క్రమంగా అతనిలో అనుమానం బలపడసాగింది. సరిగ్గా పదినిమిషాల్లో  తను తిరిగి గేటుదగ్గరకు వెళ్ళకపోతే దుర్గాదాసుకు అనుమానం రావచ్చు.

    అతని నడకలో వేగం పెరిగింది. అంతా గాఢాంధకారం.

    క్రింద ఎత్తుగా పెరిగిన గడ్డి__పరిసరాలు స్పష్టంగా కనిపించడం లేదు. అయినా మొండిగా ముందుకు సాగిపోయాడు. ఫ్యాక్టరీ బిల్డింగ్ పైన వెలుగుతున్న లైటు కాంతి అస్పష్టంగా ఆ ప్రాంతంలో పర్చుకుంది.

    వడివడిగా నడుస్తున్న పరమశివం హటాత్తుగా ఆగిపోయాడు.

    ఆ ప్రాంతమంతా చదునుగా వుండి నడుం ఎత్తులో  యేవో మొక్కలు పెరిగున్నాయి. వరుసక్రమంలో, అప్పటికి అతను శంకించాడు.

    అలాంటి ప్రదేశంలో చేయగలిగే  తప్పుడు పని గంజాయి మొక్కలు పెంచటం అని.

    చటుక్కున వంగి మొక్కల చివరనున్న  రెండు కాయల్ని కోసి జేబులో వేసుకున్నాడు.

    పనిలో పనిగా ఆ మొక్కల ఆకుల్ని  కూడా తెంపి వేగంగా వెనుతిరిగాడు.
   
    నడకలో  వేగం పెంచుతూనే  వాచీవేపు చూసుకున్నాడు. అప్పటికి తను ఫ్యాక్టరీలోకి  ఎంటర్ అయి ఆరునిమిషాలయింది. రిలాక్స్ గా ఫీలవుతూ తన గదిలోకి వెళ్ళి చటుక్కున లైట్ ఆర్పేసి బయట కొచ్చేశాడు.

    గేటుదగ్గరవుతుండగా పరమశివానికి  ఓ క్షణం భయం వేసింది.

    "పర్స్ తీసుకున్నారా సార్?" దుర్గాదాస్ కంఠంలో చిత్రమైన మార్పు.

    పరమశివం లిప్తపాటు ఉలిక్కిపడి వెంటనే తేరుకున్నాడు.

    "ఆ....ఆ...." అన్నాడు. అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవటం మంచిదనే ఉద్దేశ్యంతో.

    "సరే వెళ్ళిరండి. కాని...." దుర్గాదాస్ హఠాత్తుగా నవ్వాడు.

    పరమశివం కంగారుపడ్డాడు.

    "అది మీరూహించినట్లు గంజాయే ఇంటికెళ్ళి దీపం వెలుగులో పెట్టి  నిర్దారించుకోనక్కరలేదు. ఇకపోతే ఆ పంట మీ ఇంత శిరుల పంట. మరో నాలుగు రోజుల్లో  అది కాపుకు వస్తుంది. ఆల్ రడీ కాయలకు గీతాలు పెట్టేశాం. పాలుకారటం ప్రారంభమైంది. ఇంకో నాలుగురోజులు ఈ రహస్యాన్ని  మీలోనే  దిగమింగుకుంటే  యిలాంటి ఫ్యాక్టరీలు నాలుగు కట్టొచ్చు లేదంటే...." అంతసేపు దుర్గాదాస్ చాలా తాపీగానే మాట్లాడాడు.

    అప్పటికే షాక్ తిన్న పరమశివం తేరుకోవటానికి ఒకింతసేపు పట్టింది. ఇప్పుడతనిలో  కోపం బుసలు కొడుతోంది.

    "ఓరి దౌర్భాగ్యుల్లారా! ఇలాంటి తప్పుడుపని చేస్తారని కల్లో కూడా  ఊహించలేదు. ఇందుకేనా  మెషిన్ ని విరగొట్టింది! ఈ తప్పుడు పనిని నేను సహించలేను. తక్షణం ఆ పంటను తగలెట్టకపోతే  చాలావరకు వెళ్ళాల్సివస్తుందని పట్టాభికి, మధుమూర్తికి చెప్పు."

    కోపంతో వూగిపోతూ అన్నాడు పరమశివం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS